మేడ్చల్/నాగోల్, సెప్టెంబరు 22: బండ్లగూడ సుప్రీం వైన్స్ లో రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సహా ముగ్గురిని నాగోల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఖమ్మంకు చెందిన కె.ఉమా మహేష్ ఏజేకే మహేష్ (34), సాయినగర్ కు చెందిన మహమ్మద్ మున్నా ఏ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దుగ్గిరాల కార్తీక్ (29)లను ఎల్.బి.నగర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న బండ్లగూడ సుప్రీం వైన్స్ లో నయీమ్ పై నిందితులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 16న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి ఉమామహేష్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
బాల్య స్నేహితుల మధ్య విభేదాలు
నయీమ్, ఉమా మహేష్ బాల్య స్నేహితులు. చిన్నతనం నుంచే నేరాలకు పాల్పడటంతో ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయి. కొంతకాలంగా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేస్తూ ఇల్లందు, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో తిరిగేవారు. నయీమ్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఉమామహేష్ ఖమ్మంలో సోలార్ ప్యానల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారు.
ఖమ్మంలో పథకం
హైదరాబాద్ లో నయీమ్ ను హత్య చేసేందుకు ఈ నెల 13న ఖమ్మంలోని ఓ హోటల్లో ఉమామహేష్ తన అనుచరులతో కలిసి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఖమ్మం నుంచి కారులో హైదరాబాద్కు చేరుకున్న నిందితులు.. మున్నా ద్వారా నయీమ్కు ఫోన్ చేసి అతడి ఆచూకీ తెలుసుకున్నారు. బండ్లగూడ సుప్రీం వైన్స్ లో నయీమ్ ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడికి వెళ్లారు. వైన్స్ వద్ద నయీమ్ కళ్లలో కారం చల్లి వెంబడించిన నిందితులు సిట్టింగ్ ఏరియాలో వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 11కు చేరింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి ఆదేశాల మేరకు ఎల్.బి. నగర్ డీసీపీ బి.అనురాధ, ఎల్.బి.నగర్ ఏసీపీ రవీందర్రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిప్రధాన సూత్రధారి ఉమా మహేష్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నాగోల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





