మొఖం సూర్యుడు

దహన సంస్కారం చేస్తున్న
బూజు పట్టిన వ్యాపకాలకు
హితం కోసం పాటుబడుంటే
వ్యక్తిగతం పక్కన పెట్టుంటే
అందరం స్వేచ్ఛా గీతాన్ని ఆలపించే వాళ్ళం
అధికారం నిరంకుశత్వాన్ని పునర్నిర్మిస్తూ
దేనికై పాకులాడామో మొదటికి తెస్తుంది
తప్పుల కాలాన్ని వదిలి
గాలిలో నడిచినందుకే
శరీరాల్ని వదిలేసినందుకే
బుద్ధిని నియంత్రించక
ఊగిసలాడించినందుకే
అవకాశం కమ్ముకొచ్చిన మేఘం కదా
నిరంతర పోరాటమే నిలబెట్టేది
భావోద్వేగాలను సాన పెట్టాలె
అలవాట్లను కవాతు చేయించాలి
ఆలసత్వాన్ని క్రమబద్ధీకరించాలి
అపోహలను తార్కిక కొలిమిలో ఎయ్యాలె
అనువర్తింపజేయడమే సార్థకత
మబ్బుగా మరుగైపోవడం చావు
నిటారుగా స్పృహను నిలబెట్టడం
ఉషారుగా సత్వను పరిగెత్తించడం
కళ్ళలో నవ్వు నిప్పులను నింపితే
ముఖం సూర్యుడు అయితది
గుండె కిరణాలతో చెరువైతది
నీ ముందున్నది మైదానమే
నీ లోపల ఉన్నవి గోడలు
కూల్చితే తేలికవుతావు
బంతిలా విసరబడతావు
నక్షత్రాల నుండి వెలుగును
తీసుకుంటావు.. ఆవిష్కరిస్తావు!
          – రఘు వగ్గు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *