తెలంగాణ అభివృద్ధికి మోదీ చారిత్రక నిర్ణయం

– ఘట్‌కేసర్-కాజీపేట రైల్వే బహుళ ట్రాకింగ్‌కు ఆమోదం
– రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశంలో తెలంగాణకు అత్యంత ప్రయోజనకరమైన సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-కాజీపేట బహుళ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం లభించడం పట్ల హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎనిమిది రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు రూ.20,804 కోట్లతో బుధవారం ఆమోదం తెలుపగా ఇందులో సికింద్రాబాద్-ఘట్‌కేసర్-కాజీపేట మార్గం తెలంగాణ రైల్వే వ్యవస్థకు జీవనాడి వంటిదన్నారు. సరకు రవాణా వేగవంతమై పరిశ్రమలు, రైతులు, వ్యాపారులు, యువతకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ నిర్ణయం ప్రధాని మోదీ వికసిత భారత్, వికసిత తెలంగాణ సంకల్పానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు రహదారి, రైలు, పరిశ్రమలు, మార్కెట్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని, రవాణా వ్యయం తగ్గి, సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు. తెలంగాణకు ప్రయోజనాలు
సికింద్రాబాద్-కాజీపేట కారిడార్‌లో రద్దీ తగ్గి రైళ్ల సమయ పాలన, సేవా విశ్వసనీయత మెరుగుపడుతుందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ప్రయాణికుల రైళ్లతోపాటు బొగ్గు, సిమెంట్, ఇనుము-ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైళ్లు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణాకు అదనపు సామర్థ్యం ఏర్పడుతుందన్నారు. తెలంగాణలోని పరిశ్రమలకు సరకు రవాణా సౌలభ్యం పెరిగి లాజిస్టిక్స్ వ్యయం తగ్గే అవకాశం ఉంటుందని, నిర్మాణ దశలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అనుబంధ సేవారంగాలకు కూడా ఉత్సాహం లభిస్తుందన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, భువనగిరి కోట వంటి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలకు చేరువ మెరుగవుతుందన్నారు. ప్రధాని మోదీ తెలంగాణపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ నిర్ణయం స్పష్టమైన నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *