– నదిని, పర్యావరణాన్ని, ప్రజల హక్కులను కాపాడాలి
– ప్రజలను నిర్వాసితులను చేసే విధానాన్ని మార్చాలి
– మూసీ రివర్ ప్రాజెక్టును పునః సమీక్షించాలి
– మూసీ జన ఆందోళన్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 10: మూసీ నది పునరుజ్జీవనం పేరుతో చేపడుతున్న ప్రస్తుత మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు నదిని శుద్ధితో పాటు ప్రజల ఇళ్లు, జీవనోపాధులు, పర్యావరణాన్ని రక్షించే విధంగా ఉండాలని, ప్రజలను నిర్వాసితులను చేసే ప్రాజెక్టు విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ మూసీ జన ఆందోళన ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. తొలుత దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు శంకర్ సభకు ఆహ్వానం పలికారు. డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు మంజుల బస్తీ ప్రజల నిర్వాసితుల బాధలను ప్రతిబింబించే పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త సజయ సభకు అధ్యక్షత వహించారు. మానవ హక్కుల వేదిక నాయకుడు జీవన్ కుమార్ ప్రారంభోపన్యాసం చేస్తూ మూడు దశాబ్దాలుగా మూసీ నది, దాని పరివాహక ప్రాంత ప్రజలపై ప్రభుత్వాలు అనుసరి స్తున్న విధానాలను వివరించారు. ప్రస్తుత మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ప్రజలకు, నదికి ప్రయోజనం కలిగించే విధంగా లేదన్నారు. ఈ సందర్భంగా ‘మూసీ పునరుజ్జీవం పేరిట విధ్వంసమా? – నదిని కాపాడుకుందాం, ప్రజాహక్కులను రక్షించుకుందాం’ అనే కరపత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు విడుదల చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పరిధిలోని బాధితులు, సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ తమ అనుభవాలను వివరించారు. ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం, భయపెట్టడం, ఒత్తిడికి గురిచేయడం జరుగుతోందని తెలిపారు. బాపుఘాట్, హైదర్‌షాకోట్, బుద్వేల్, హైదర్‌గూడ, చాదర్‌ఘాట్ ప్రాంతాలతోపాటు మూసీ దిగువ ప్రాంత గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వైశాలి, సుధా గోపరాజు, బిలాల్, ముస్కన్, అనిత, కొమురయ్య, బట్టు శంకర్, బాలయ్య తదితరులు తమ ఇళ్లు, పొలాలను ఏ పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. మూసీ జన ఆందోళన కొనసాగిస్తున్న ప్రజా ఉద్యమానికి మద్దతుగా వివిధ పార్టీల ప్రతినిధులు ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎల్‌బీనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున మనోజ్, న్యూడెమోక్రసీ తరఫున ఝాన్సీ, సీపీఐ తరఫున స్టాలిన్ పాల్గొని మూసీ ప్రాజెక్టు బాధితులకు తమ మద్దతును తెలిపారు. పర్యావరణవేత్తలు డాక్టర్ బాబూరావు, డాక్టర్ దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రాజెక్టు వల్ల సంభవించే పర్యావరణ ప్రభావాలను వివరించారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో పర్యావరణ అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును ప్రస్తుత రూపంలో వ్యతిరేకించాలని, నదిని కేవలం ఒక నగర అభివృద్ధి ప్రాజెక్టుగా కాక మొత్తం నది పరివాహక ప్రాంతం ప్రాతిపదికన చూడాలని వారు సూచించారు. ప్రజా సంఘాల ప్రతినిధులు సంధ్య, మీరా సంఘమిత్ర, జ్యోతి, ఉషా సీతాలక్ష్మి, విమలక్క, సిస్టర్ లిసి, శంకర్, అఖిల్, రవి కన్నెగంటి, వేణు, సంజీవ్ తదితరులు మాట్లాడుతూ, మూసీ బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ప్రజలకు, మూసీ నదికి న్యాయం చేయని ఏ ప్రాజెక్టునైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం మూసీ నదిని శుభ్రపరిచేందుకు ₹7,345 కోట్ల మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. ఇందులో ఫేజ్ 1ఎ హిమాయత్ సాగర్ నుంచి 9.1 కి.మీ, ఫేజ్ 1బి గండిపేట నుంచి 11.8 కి.మీ పరిధిలో గాంధీ సరోవర్ పేరుతో పనులు చేపడుతున్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





