నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి జన్మదిన కానుక

– పీఎస్‌ఆర్ యువ నేస్తం పేరిట ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ప్రారంభం
– ఇప్పటివరకు లక్ష మందికి పైగా పేర్ల నమోదు
– ఏడాదిపాటు ఉచిత శిక్షణ.. అవసరమైతే గడువు పొడిగింపు
– గతంలో 2,300 మందికి శిక్షణ.. 462మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు పీఎసఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీఎసఆర్ యువ నేస్తం పేరిట ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈరోజు నుంచి ఏడాదిపాటు ఈ ఉచిత శిక్షణ ఉంటుందని, అవసరమైతే ఈ శిక్షణ కాలాన్ని పొడిగిస్తామని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పొంగులేటి ఈ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గత 30 ఏళ్లుగా ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ ఎంతోమంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని, ఐఏఎస్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించేందుకు కూడా మార్గనిర్దేశం చేసిందని తెలిపారు. ఈ సంస్ధలో కరీం, కృష్ణారెడ్డి, మేముల సైదులు వంటి అనుభవజ్ఞులైన అధ్యాపకులు శిక్షణలో భాగస్వాములుగా ఉండటం అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.

గత అనుభవమే ‘యువ నేస్తం’కు స్ఫూర్తి

2013లో రాజకీయాల్లోకి ప్రవేశించి 2014లో ఎంపీగా ఎన్నికైన అనంతరం 2016లో ఖమ్మం ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంత్రి గుర్తు చేశారు. అప్పట్లో సుమారు 2,300 మంది నిరుద్యోగులకు ఆఫ్‌లైన్‌లో శిక్షణ అందించడంతోపాటు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. శిక్షణ పొందిన వారిలో 462మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. ఉద్యోగాలు సాధించిన వారు తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు తనను ఎంతగానో కదిలించాయని, వారి ఆనందాన్ని చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని మంత్రి భావోద్వేగంగా అన్నారు. ఆ అనుభవమే మరింతమంది నిరుద్యోగ యువతకు శిక్షణ అందించాలనే సంకల్పానికి ప్రేరణగా నిలిచిందన్నారు.

ఇంటి వద్ద నుంచే నాణ్యమైన శిక్షణ

ప్రస్తుత ఆన్‌లైన్ శిక్షణ విధానం వల్ల అభ్యర్థులు హైదరాబాద్‌కు రాకుండానే తమ ఇళ్ల వద్ద నుంచే శిక్షణ పొందవచ్చని మంత్రి తెలిపారు. దూరప్రాంతాల్లో నివసించే యువతకు ప్రయాణ ఖర్చులు, వసతి తదితర ఇబ్బందులు లేకుండా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ఒక్కో అభ్యర్థికి ఇలాంటి శిక్షణ అందించేందుకు సాధారణంగా కనీసం రూ.లక్ష ఖర్చవుతుందని, పుస్తకాలు, ఇతర శిక్షణ సామగ్రి కోసమే సుమారు రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకు అయ్యే వ్యయాన్ని ట్రస్ట్ భరిస్తుందని స్పష్టం చేశారు.

లక్ష మందికిపైగా నమోదు.. ఎంతమందికైనా శిక్షణ

‘పీఎస్‌ఆర్ యువ నేస్తం’పై తొలుత కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఉచిత శిక్షణ నిజంగానే అందిస్తున్నట్లు తెలుసుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో యువత పేర్లు నమోదు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ప్రకటన విడుదల చేసిన పది రోజుల్లోనే లక్ష మందికి పైగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవడం ఈ కార్యక్రమంపై యువత చూపుతున్న ఆసక్తికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి కటాఫ్ తేదీ విధించలేదని, లక్ష మందితోనే పరిమితం కాకుండా ఎంతమంది అభ్యర్థులు వచ్చినా శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏడాదిపాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని, అవసరమైతే పొడిగిస్తామని తెలిపారు.

త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో సుమారు మరో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నాయని చెప్పారు.

దీపావళిలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు కలిసిన సందర్బంలో పాత్రికేయుల ఇళ్ల స్ధలాల అంశం చర్చకు వచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రానున్న దీపావళి లోగా జర్నలిస్టుల ఇళ్ల స్ధలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి సమ్మతించారని, దీనివల్ల దీర్ఘకాలిక సమస్య తీరుతుందని అన్నారు. దీనిపై విలేక‌రులు స్పందిస్తూ మంత్రి పుట్టిన రోజున తమకు శుభవార్త వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *