రైతులు సంఘటితమైతేనే మంచి ధర

– ‘రైతు నేస్తం’లో వ్యవసాయ కమిషనర్ సురేంద్ర మోహన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : పంట పండించడంతోపాటు దానిని మెరుగైన ధరకు అమ్ముకోవడానికి రైతులు సంఘటితంగా ఏర్పడడమే ఏకైక మార్గమని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ స్పష్టం చేశారు. రైతులు విడివిడిగా కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు , మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుగా ఏర్పడితేనే పంటకు మంచి డిమాండ్, ధర లభిస్తాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ 112వ ప్రత్యేక ఎపిసోడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి.గోపి మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైతు సంఘాలను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఈ సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

అద్దెకు వ్యవసాయ యంత్రాలు

చిన్న రైతులపై యంత్రాల కొనుగోలు భారం తగ్గించేందుకు సంఘాల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాట్లు వేసే యంత్రాల నుంచి కిసాన్ డ్రోన్లు, కంబైన్ హార్వెస్టర్లు, పసుపు బాయిలర్లు, స్ట్రా బేలర్ల వరకు 37 రకాల యంత్రాలను తక్కువ అద్దెకు అందించనున్నట్లు డాక్టర్ గోపి తెలిపారు. దీనివల్ల సాగు వ్యయం తగ్గడమే కాకుండా సంఘాలకు ఆదాయం సమకూరుతుందన్నారు.

లాభసాటి ఎగుమతి మార్గాలు

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో పండించే ‘గెర్కిన్స’ (ప్రత్యేక కీరదోస), యాదాద్రి భువనగిరి జిల్లాలో మునగాకు పొడి తయారీ ద్వారా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు అధిక ఆదాయం పొందుతున్న విధానాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు వివరించారు.

ఎల్‌నినో జాగ్రత్తలు, ఖేత్ బచావో అభియాన్

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు, నేల సంరక్షణ లక్ష్యంగా చేపట్టే ‘ఖేత్ బచావో అభియాన’ అమలుపై రైతులకు అధికారుల అవగాహన కల్పించారు. రబీలో నవంబర్ 15 వరకు పప్పు ధాన్యాలు, నూనె గింజలు విత్తుకోవచ్చని తెలిపారు. నవంబర్ 16 దాటితే నీటి లభ్యతనుబట్టి పెసర, మినుము, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ వేసుకోవాలని, తక్కువ నీటి వనరులు ఉన్న రైతులు శనగ, కుసుమ పంటలను ఎంచుకోవాలని అధికారులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *