– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
– ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎల్లారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : మహిళా సంఘాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రామారెడ్డి మండల పరిధిలోని పోసానిపేట, రంగంపేట గ్రామాల సరిహద్దులో ఉన్న మోషంపూర్ చౌరస్తా వద్ద హైబ్రిడ్ యాన్యుటీ విధానం(హెచఏఎం) మొదటి దశ కింద రూ.42.80 కోట్లతో 71.63 కి.మీ మేర చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం పోసానిపేట గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
విద్యుత్ ఉప కేంద్రాల మంజూరులో ఎమ్మెల్యే కృషి అభినందనీయం
రామారెడ్డి మండలం గిద్ద గ్రామం, సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామాల్లో నూతన విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాలను మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్మోహన్ పరిశీలించారు. నియోజకవర్గానికి ఏడు విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే చూపిన ప్రత్యేక చొరవ, పట్టుదల అభినందనీయమని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
గిద్ద గ్రామ ప్రజల చిరకాల స్వప్నం సాకారం
గిద్ద గ్రామంలో రూ.2.88 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేయించి విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే గిద్ద గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, రైతుల విద్యుత్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు.
కుప్రియాల్ కి రూ.2.63 కోట్లతో విద్యుత్ ఉప కేంద్రం
సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో రూ.2.63 కోట్లతో నూతన విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ వెల్లడించారు. గ్రామ ప్రజల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణం పూర్తయితే కుప్రియాల్తోపాటు పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు దోహదపడుతుందని చెప్పారు. కుప్రియాల్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రహదారులు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంటూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి సీతక్కలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధికి జిల్లా యంత్రాంగం సహకారం: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న కృషిని అభినందించారు. అభివృద్ధి పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





