ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబందించి గత 50 రోజులుగా కాక్రోజ్ జనతాపార్టీ (సిజెపి) నాయకత్వంలో యువకులు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన దీంతో విజయవంతమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామ డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం సిజెపి డిమాండ్‌కు తలవంచక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ముందు సిజెపి పెట్టిన మూడు డిమాండ్లపై కేంద్ర మంత్రులు గత రెండు విడుతలుగా చేపట్టిన చర్చలు విఫలమైనాయి.
ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే తాము మలివిడుత చర్చిస్తామని సిజెపి నాయకులు మొండి పట్టు పట్టారు. అందుకు శుక్రవారం వారు కేంద్రానికి 24 గంటల సమయాన్నిచ్చారు. శనివారం సాయంత్రానికి కేంద్రం మరోసారి చర్చించాల్సి ఉండగా అంతకు ముందే మంత్రి తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామాను ప్రధానికి పంపించడంతోపాటు రెండు పేజీల లేఖలో యువత ఆకాంక్షలను గౌరవించి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గత పది రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, ప్రధానంగా విద్యార్థి ఆందోళనలో అరాచక శక్తులు ప్రవేశించరాదన్న ఉద్దేశ్యంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మంత్రి రాజీనామాపైన ముందుగా స్పందించిన సిజెపి సృష్టికర్త అభిజిత్ జీత్కే ఇది ప్రజాస్వామ్య విజయంగా పేర్కొన్నారు. అంతేకాదు ఇది ప్రజాస్వామ్యంలో సరికొత్త ఉదయంగా ఆయన అభివర్ణించారు. విద్యార్థుల శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వాలకు లొంగకుండా ధైర్యంగా నిలబడితే ఎంతటివారి రాజీనామానైనా సాధించవొచ్చని దీనివల్ల స్పష్టమైందన్నారు. అయితే ఇది మొదటి వికెట్ మాత్రమేనని, విద్యార్థులు ఇంకా తమ హక్కులను సాధించుకోవాల్సి ఉందని , మిగతా డిమాండ్స్‌పై ఇంకా ప్రభుత్వం నుండి స్పష్టత రావాల్సి ఉందన్న రీతిలో ఆనందోత్సవాలమద్య ఆయన మరో హెచ్చరిక చేశారు.
ప్రజాభిప్రాయాలను గౌరవించి ప్రభుత్వాలు తమ నిర్ణయాలు మార్చుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందన్నది మరోసారి రుజువైంది. ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులంతా మోదీ పాలనకు బ్రహ్మరథం పడుతున్నది అన్న ప్రచార నేపథ్యంలో సిజెపి ఆందోళన మోదీ పాలనపై వేలెత్తి చూపేదిగా మారింది. ప్రధానంగా ఈ నెల 20న జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి, యువకుల మీద ప్రభుత్వం చేసిన దమనకాండ కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతకు కారణంగామారింది. దానిపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగాయి. లాఠీ ఛార్జీలు, బాష్పవాయు గోళాల ప్రయోగం యుద్ధకాండను తలపిస్తుండడంతో కేంద్రం మంత్రి రాజీనామాపై సత్వర నిర్ణయం తీసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. క్యాబినెట్ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్తితి ఏర్పడడమన్నది మాత్రం మోదీ 12 ఏళ్ళ పాలనలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాని, ప్రజా ఆందోళనకు తల ఒగ్గడంమాత్రం రెండవసారి. 2021లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మూడు నల్ల చట్టాలను ప్రవేశపెట్టే దశలో పంజాబ్ రైతాంగం చేపట్టిన ఆందోళన, క్రమంగా దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో వాటిని మోదీ సర్కార్ వెనక్కు తీసుకోక తప్పలేదు.





