కూర‌గాయ‌ల్లో ర‌సాయ‌నాల విషం!

రాష్ట్ర  శాసనసభ  వేదికగా  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం వెల్లడించిన వాస్తవాలు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి సభ ముందు ఉంచిన గణాంకాలు , విశ్లేషణ, కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు… అది ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్యం, ఆహార భద్రతతో ముడిపడి ఉన్న తీవ్రమైన సంక్షోభం. రాష్ట్రంలో పండే కూరగాయల్లో మితిమీరిన రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు ఉండటం వల్ల ఇతర దేశాలు, పొరుగు రాష్ట్రాలు మన ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయనే చేదు నిజం పాలకులు, రైతాంగం కళ్ళు తెరిపించాల్సిన తరుణాన్ని సూచిస్తున్నది .
గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఆహార పంటల వైవిధ్యీకరణ  లో తీవ్ర లోపాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాలుగా ఉన్న కూరగాయల సాగు విస్తీర్ణం, నేడు కేవలం 50,000 ఎకరాలకు పడిపోవడం వ్యవసాయ ప్రణాళికల్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెడుతున్నది . తెలంగాణలో సాగునీటి సదుపాయాలు (కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్) పెరగడంతో రైతులంతా శ్రమ తక్కువగా ఉండి, ప్రభుత్వ మద్దతు ధర లభించే వరి సాగు వైపే మొగ్గు చూపారు. దాంతో ఉద్యానవన పంటల విస్తీర్ణం దారుణంగా తగ్గిపోయింది. గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఎంపిక చేసిన పంటలకే సబ్సిడీలను పరిమితం చేయడం, ఉద్యానవన పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేర్చకపోవడం వల్ల కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీటికి తోడు హైదరాబాద్ చుట్టుపక్కల (రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో) గతంలో పెద్ద ఎత్తున కూరగాయలు పండించే భూములు కాస్తా ఔటర్ రింగ్ రోడ్ , రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి.
తెలంగాణ ప్రజల వార్షిక అవసరాలకు 38.54 ల‌క్ష‌ల‌ టన్నుల కూరగాయలు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 19.54 ల‌క్ష‌ల‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ భారీ కొరత వల్ల నిత్యం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి రూ. 4,000 కోట్ల విలువైన కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి వొస్తున్నది . ఒకవైపు రాజధాని హైదరాబాద్ నగర జనాభా కోటి దాటిపోతుంటే, కూరగాయలను పొరుగు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడం మన స్థానిక ఉద్యానవన  రంగ వైఫల్యానికి నిదర్శనం. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు గడించాలనే ఆరాటంలో, రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల విచక్షణారహితంగా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, హానికరమైన కలుపు సంహారకాలను వాడుతున్నారు. ముఖ్యంగా నిషేధిత లేదా తీవ్ర విషపూరితమైన క్రిమిసంహారకాల అవశేషాలు  కూరగాయల్లో ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. దీనివల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సమాజాన్ని పీడిస్తున్నాయి. ఈ రసాయన తీవ్రతను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణహిత ఎరువులపై సబ్సిడీలను పెంచాలని, ఎరువుల హేతుబద్ధీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం హర్షణీయమే కానీ, స్థానికంగా అమలు కావాల్సిన కార్యాచరణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
ఒకవైపు ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్ల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ, నిత్యం ప్రజల కడుపులోకి వెళ్లే కూరగాయల సాగును నిర్లక్ష్యం చేయడం వల్లనే నేడు తెలంగాణ సమాజం ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నది .మరోవైపు, దేశంలోనే అత్యధికంగా రసాయన ఎరువులు వాడుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి వరుసలో ఉండటం తీవ్రమైన పర్యావరణ సంక్షోభాన్ని సూచిస్తున్నది . భూగర్భ జలాలు సైతం నైట్రేట్లు, భారీ లోహాల కాలుష్యంతో విషతుల్యమవుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు వ్యవసాయ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ‘ల్యాబ్ టు ల్యాండ్’ విధానంలో ప్రతి గ్రామంలోనూ మట్టి పరీక్షలు నిర్వహించాలి. ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో సూచించే ‘సాంకేతిక ప్రిస్క్రిప్షన్’ విధానాన్ని ప్రవేశపెట్టాలి. నాణ్యమైన సేంద్రీయ ఎరువులను అందుబాటులోకి తెస్తూ, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మార్కెటింగ్‌లో ప్రత్యేక ‘ప్రీమియం ధర’ కల్పించినప్పుడే ఈ రసాయన రొంపి నుండి తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.
ఈ సంక్షోభం నుండి బయటపడటానికి  హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రత్యేక కూరగాయల సాగు క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, రైతులను సేంద్రీయ, సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లించేలా ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా గ్రామ స్థాయిలోనే రైతులకు శిక్షణనిచ్చి, పురుగు మందుల మోతాదులపై నియంత్రణ సాధించాలి. అన్నదాతలు పండించే పంట ప్రజలకు పౌష్టికాహారాన్ని ఇవ్వాలి తప్ప పాయిజన్ కాకూడదు. ప్రభుత్వం వొచ్చే ఐదేళ్లలో కూరగాయల సాగును 5 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, సాగు విస్తీర్ణం పెంపుతో పాటు గుణాత్మకమైన, రసాయన రహిత పంటల ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి. మార్కెటింగ్ శాఖ పటిష్టమైన నిఘా ఉంచి, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించినప్పుడే తెలంగాణ కూరగాయలకు అంతర్జాతీయంగా తిరిగి ఆదరణ లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *