“భారతదేశ చరిత్రలో విద్యార్థి ఉద్యమాలకు విశిష్ట స్థానం ఉంది. స్వాతంత్య్రం సమరం నుంచి జేపీ ఉద్యమం వరకు, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వ్యతిరేక పోరాటం నుంచి మండల్, నిర్భయ, రైతు ఉద్యమాల వరకు విద్యార్థులే మార్పుకు చోదకశక్తిగా నిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎమర్జెన్సీకి ముందు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ సమయంలో కూడా దిల్లీ విశ్వవిద్యాలయం ఇలాంటి నిషేధాలను విధించలేదు. అప్పటి విద్యార్థులు బహిరంగంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తరువాత కేంద్ర మంత్రులుగా ఎదిగిన పలువురు కూడా విద్యార్థి దశలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అయితే నేడు పరిస్థితి మరింత దిగజారిందా అనే సందేహం కలుగుతున్నది …”
ఉస్మానియా యూనివర్సిటీ అయినా …జంతర్ మంతర్ అయినా …

ఆఖరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు… దేశ ప్రధాన మంత్రి గా పుష్క్రర కాలం పూర్తిచేసుకున్న నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్తితి ఏర్పడడమన్నది మాత్రం ఇదే మొదటిసారి…. కానీ, ప్రజా ఆందోళనకు తల ఒగ్గడంమాత్రం రెండవసారి. 2021లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మూడు నల్ల చట్టాలను ప్రవేశపెట్టే దశలో పంజాబ్ రైతాంగం చేపట్టిన ఆందోళన, క్రమంగా దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో వాటిని మోదీ సర్కార్ వెనక్కు తీసుకోక తప్పలేదు. ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులంతా మోదీ పాలనకు బ్రహ్మరథం పడుతున్నది అన్న ప్రచార నేపథ్యంలో సిజెపి నేతృత్వంలో విద్యార్థీ యువతీ యువకుల ఆందోళన మోదీ పాలనపై వేలెత్తి చూపేదిగా మారింది.
ప్రధానంగా ఈ నెల 20న జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి, యువకుల మీద ప్రభుత్వం చేసిన దమనకాండ కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతకు కారణంగా మారింది. దానిపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగాయి. లాఠీ ఛార్జీలు, బాష్పవాయు గోళాల ప్రయోగం యుద్ధకాండను తలపిస్తుండడంతో కేంద్రం మంత్రి రాజీనామాపై సత్వర నిర్ణయం తీసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ‘నీట్; పరీక్షల నిర్వహణ అవకతవకల కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత చేపట్టిన ఆందోళనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కొందరు మంత్రులు, పార్టీ శ్రేణులు, సనాతన ధర్మ పరిరక్షకులు విదేశీ శక్తులు చొరబడ్డాయనీ ..దేశ విచ్చిన్నానికి కుట్రలు చేస్తున్నారనీ ..సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని సామాజిక మాధ్యమాల్లో ..మెయిన్ స్ట్రీమ్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేసిన్రు .. తూచ్ ..అటువంటి సమాచారం మాకు లేదని కేంద్ర నిగాహ్ వర్గాలు కొట్టి పారేసినయ్ ..!
‘నీట్ ‘ పరీక్షల నిర్వహణ అవకతవకల పై కొన్ని నెలలు గా యువత ఆందోళనలు … వాటికి కౌంటర్ గా అధికార పార్టీ దుష్ప్రచారం ఒక్కసారిగా 2009 డిసెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు .. నాలుగున్నర సంవత్సరాల పాటు స్వరాష్ట్రం కోసం తెలంగాణ విద్యార్థి యువతి యువకుల పోరాటం.. చేపట్టిన ఉద్యమాలు గుర్తుకొచ్చినయ్..! ఆ నాలుగున్నర సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, తెలంగాణలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున పారా మిలటరీ దళాలను మోహరించి ,దమననీతితో హింసాకాండ జరిపి,తుపాకులతో బెదిరించి, బుల్లెట్ల వర్షం కురిపించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేయడానికి , అణచివేయడానికి సమైక్య పాలకులు పన్నిన కుట్రలను యువత చిత్తు చేసిన మహోజ్వల పోరాటం గుర్తుకొచ్చింది ..! తెలంగాణా ఉద్యమంలో మావోయిస్టులు ప్రవేశించారనీ .. రాష్ట్ర ఏర్పడితే ముస్లిం మాట శక్తుల అడ్డా మారుతుందని చేసిన విష ప్రచారం గుర్తుకొచ్చింది ..! ‘నీట్ ‘ పరీక్షల నిర్వహణ అవకతవకల పై ఉద్యమం పై విష ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు ‘ తల్లిని చంపి బిడ్డకు జన్మ నిచ్చారని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పట్ల అభిప్రాయం తో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేంద్రంలో అధికారం లో ఉండి ఉంటే ..మావోయిస్టుల ఏరివేతలో అవలంభించిన వైఖరితో తెలంగాణ ప్రజా ఉద్యమానికి వక్ర భాష్యం చెప్పి పూర్తిగా నిర్బీర్యం చేసే వారు అనడంలో లో ఏ మాత్రం అనుమానం లేదు ..!
ప్రజా ఉద్యమాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ఉద్యమాలు సహజమైనవి. ప్రజల ఆకాంక్షలు, సమస్యలు, ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రధాన వేదికలే ఉద్యమాలు. చరిత్రను పరిశీలిస్తే, ఏ ప్రభుత్వమైనా తన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు ఆ ఉద్యమాలను ఎదుర్కొనేందుకు అనేక రకాల వ్యూహాలను అనుసరించింది. కొన్నిసార్లు చర్చలు, రాజీలు, సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగితే, మరికొన్నిసార్లు నిర్బంధం, అరెస్టులు, కేసులు, ప్రచార యుద్ధాలు వంటి పద్ధతులు అమలయ్యాయి. కాలానుగుణంగా ఈ పద్ధతులు మారినా, ప్రజా ఉద్యమాలను బలహీనపరచాలనే లక్ష్యం మాత్రం మారలేదు. 2014 తరువాత భారత రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ సాంకేతికత, సోషల్ మీడియా వేదికలు రాజకీయ ప్రచారానికి అత్యంత శక్తివంతమైన సాధనాలుగా మారాయి. భారతీయ జనతా పార్టీ ఈ మార్పును అత్యంత సమర్థవంతంగా వినియోగించుకున్న రాజకీయ పార్టీగా విస్తృతంగా గుర్తింపు పొందింది. ఎన్నికల ప్రచారం నుంచి ప్రభుత్వ విధానాల ప్రచారం వరకు, ప్రత్యర్థుల విమర్శలకు ప్రతిస్పందించడం నుంచి తమ రాజకీయ కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వరకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించింది.
“‘నీట్ ‘ పరీక్షల నిర్వహణ అవకతవకల పై ఉద్యమం పై విష ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు ‘ తల్లిని చంపి బిడ్డకు జన్మ నిచ్చారని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పట్ల అభిప్రాయం తో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేంద్రంలో అధికారం లో ఉండి ఉంటే ..మావోయిస్టుల ఏరివేతలో అవలంభించిన వైఖరితో తెలంగాణ ప్రజా ఉద్యమానికి వక్ర భాష్యం చెప్పి పూర్తిగా నిర్బీర్యం చేసే వారు అనడంలో లో ఏ మాత్రం అనుమానం లేదు ..!”
సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి ఒకవైపు అవకాశాలను కల్పించింది. సంప్రదాయ మీడియా దృష్టికి రాని అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం, ప్రత్యామ్నాయ అభిప్రాయాలకు వేదిక కల్పించడం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి సానుకూల మార్పులు కూడా వొచ్చినయ్ . అయితే మరోవైపు ఇదే వేదికలో తీవ్రమైన రాజకీయ ధ్రువీకరణ, దుష్ప్రచారం, అసత్య సమాచార వ్యాప్తి, వ్యక్తిగత దూషణలు కూడా పెరిగాయి. డిజిటల్ వేదికలపై రాజకీయ పార్టీల అనుబంధ కార్యకర్తలు, మద్దతుదారులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రచార బృందాలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. వివిధ పార్టీలకు తమ తమ మద్దతుదారుల నెట్‌వర్క్‌లు ఉన్నప్పటికీ, బీజేపీ డిజిటల్ ప్రచార వ్యవస్థ అత్యంత విస్తృతంగా, క్రమబద్ధంగా పనిచేస్తున్నది ఎన్నికల సమయంలోనే కాదు, ప్రతిరోజూ రాజకీయ, మతపరమైన చర్చను ప్రభావితం చేసే స్థాయిలో ఆన్‌లైన్ ప్రచారం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లేదా అధికార పార్టీ విధానాలను విమర్శించే సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, పాత్రికేయులు వంటి వర్గాలపై తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్ జరుగుతున్నాయి . కొందరిని “దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు”, “విదేశీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు” వంటి ఆరోపణలతో విమర్శించే రాజకీయ వాతావరణం కూడా ఏర్పడింది.
ఇదే సమయంలో ప్రధాన స్రవంతి మీడియా పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా టెలివిజన్ చానళ్లు, కొన్ని వార్తా సంస్థలు, డిజిటల్ వేదికలు ప్రభుత్వ విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయనే విమర్శలు ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు స్వతంత్ర మీడియా సంస్థలు ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శనాత్మక కథనాలను ప్రచురిస్తున్నాయన్నాయి కూడా వాస్తవం. అయితే మీడియా స్వాతంత్య్రం , సంపాదకీయ స్వేచ్ఛ, యాజమాన్య ప్రభావం, ప్రకటనల ఆధారిత వ్యాపార నమూనా వంటి అంశాలపై చర్చలు గత కొన్నేళ్లుగా మరింత తీవ్రంగా కొనసాగుతున్నాయి.ఏ ప్రజాస్వామ్యంలోనైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు.. అసలు ప్రజాస్వామ్య బలం విభిన్న అభిప్రాయాలను వినడంలో, వాటిని సహించడంలో, వాస్తవాల ఆధారంగా చర్చించడంలో ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి ఒక్కరినీ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
ప్రజా ఉద్యమాల చరిత్ర చెబుతున్న ఒక ముఖ్యమైన పాఠం … ఉద్యమాలను కేవలం విష ప్రచారంతో లేదా నిర్బంధంతో శాశ్వతంగా అణచివేయడం సాధ్యం కాదు. సమస్యలకు రాజకీయ పరిష్కారాలు, ప్రజలతో నిరంతర సంభాషణ, పారదర్శక పరిపాలన, రాజ్యాంగబద్ధమైన హక్కులకు గౌరవం మాత్రమే దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకురాగలవు. సోషల్ మీడియా, ప్రధాన స్రవంతి మీడియా రెండూ ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన సాధనాలే. అవి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయగలవు; అదే సమయంలో ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీడియా వేదికలు వాస్తవ నిర్ధారణ, సమతుల్య విశ్లేషణ, విభిన్న అభిప్రాయాలకు సమాన అవకాశాలను కల్పించే బాధ్యతను మరింతగా గుర్తించాలి.
విశ్వవిద్యాలయాలు మేధో సంపత్తి ఉత్పత్తి కేంద్రాలు
జ్ఞానానికి ఆలయాలుగా, స్వేచ్ఛాయుత ఆలోచనలకు నిలయాలుగా, ప్రజాస్వామ్య చైతన్యానికి పునాదులుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు నేడు అధికార యంత్రాంగం నీడలో వణికిపోతున్నాయా? ప్రశ్నించే గొంతులను ప్రోత్సహించాల్సిన విద్యాసంస్థలే ఇప్పుడు ప్రశ్నించవొ ద్దని హెచ్చరికలు జారీ చేస్తే, అది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం కాదు; భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛపైనే దాడి.. న్యూదిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో దిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు నిరసనల్లో పాల్గొనవొద్దని హెచ్చరిస్తూ జారీ చేసిన ప్రకటన ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరినీ కలవరపరిచింది . విద్యార్థులు తమ పౌర హక్కులను వినియోగించకుండా అడ్డుకోవడం, పాల్గొంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని పరోక్షంగా బెదిరించడం ప్రజాస్వామ్య భారతదేశానికి తగిన వైఖరి కాదు.
భారతదేశ చరిత్రలో విద్యార్థి ఉద్యమాలకు విశిష్ట స్థానం ఉంది. స్వాతంత్య్రం సమరం నుంచి జేపీ ఉద్యమం వరకు, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వ్యతిరేక పోరాటం నుంచి మండల్, నిర్భయ, రైతు ఉద్యమాల వరకు విద్యార్థులే మార్పుకు చోదకశక్తిగా నిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎమర్జెన్సీకి ముందు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ సమయంలో కూడా దిల్లీ విశ్వవిద్యాలయం ఇలాంటి నిషేధాలను విధించలేదు. అప్పటి విద్యార్థులు బహిరంగంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తరువాత కేంద్ర మంత్రులుగా ఎదిగిన పలువురు కూడా విద్యార్థి దశలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అయితే నేడు పరిస్థితి మరింత దిగజారిందా అనే సందేహం కలుగుతున్నది
విశ్వవిద్యాలయం అనేది కేవలం పరీక్షలు రాసి డిగ్రీలు అందించే యంత్రం కాదు. దేశ భవిష్యత్తుకు దోహదపడే మేధో సంపత్తి ఉత్పత్తి కర్మాగారాలు … భిన్నాభిప్రాయాలను గౌరవించడం, వాదించడం, ప్రశ్నించడం, సమాజ సమస్యలను అర్థం చేసుకోవడం విద్యా ప్రక్రియలో భాగం. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థి నిరసన అనేది నేరం కాదు. అది ఒక పౌర హక్కు. రాజ్యాంగంలోని అధికరణం 19 ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పించింది. ఈ హక్కులను విద్యార్థుల నుంచి హరించే అధికారం ఏ విశ్వవిద్యాలయానికీ లేదు. ఇలాంటి హెచ్చరికల అసలు ప్రమాదం వాటి ప్రత్యక్ష ప్రభావంలోనే కాదు; అవి సృష్టించే భయ వాతావరణంలో ఉంది. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు సాధారణ కుటుంబాలకు చెందినవారు. ఉద్యోగం, ఉన్నత విద్య, స్కాలర్‌షిప్‌లు, భవిష్యత్ అవకాశాలపై ప్రభావం పడుతుందేమోననే భయంతో చాలామంది తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకోకుండా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే “చిల్లింగ్ ఎఫెక్ట్”.
“డిజిటల్ వేదికలపై రాజకీయ పార్టీల అనుబంధ కార్యకర్తలు, మద్దతుదారులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రచార బృందాలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. వివిధ పార్టీలకు తమ తమ మద్దతుదారుల నెట్‌వర్క్‌లు ఉన్నప్పటికీ, బీజేపీ డిజిటల్ ప్రచార వ్యవస్థ అత్యంత విస్తృతంగా, క్రమబద్ధంగా పనిచేస్తున్నది ఎన్నికల సమయంలోనే కాదు, ప్రతిరోజూ రాజకీయ, మతపరమైన చర్చను ప్రభావితం చేసే స్థాయిలో ఆన్‌లైన్ ప్రచారం కొనసాగుతున్నది.”
ప్రభుత్వం నేరుగా నోరు మూయించకపోయినా, భయంతో ప్రజలే తమ గొంతును అణచుకునే పరిస్థితి ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన దశ. ప్రస్తుత విద్యార్థి ఉద్యమం ఏ అంశంపై జరుగుతోందన్నది ఇక్కడ ప్రధాన విషయం కాదు. ఆ ఉద్యమాన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా అనేది ప్రతి విద్యార్థి వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హరించడం మాత్రం ఖండనీయం . విశ్వవిద్యాలయం చేయాల్సింది విద్యార్థులను బెదిరించడం కాదు; చర్చలకు, వాదోపవాదాలకు, ప్రజాస్వామ్య విలువలకు వేదిక కల్పించడం. ఇటీవలి కాలంలో దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు స్వతంత్ర మేధో వేదికలుగా కాకుండా, అధికారానికి అనుగుణంగా వ్యవహరించే పరిపాలనా కేంద్రాలుగా మారుతున్నాయన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. విద్యార్థి సంఘాలపై ఆంక్షలు, సెమినార్ల రద్దు, అతిథి ఉపన్యాసాలకు అనుమతుల నిరాకరణ, అధ్యాపకులపై క్రమశిక్షణా చర్యలు, ఇప్పుడు నిరసనల్లో పాల్గొనవొద్దన్న హెచ్చరికలు—ఇవన్నీ కలిపి చూస్తే విశ్వవిద్యాలయాల స్వతంత్రత క్రమంగా క్షీణిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.
ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నీ భిన్నాభిప్రాయాలకు, విమర్శలకు, ఉద్యమాలకు కేంద్రాలుగానే ఎదిగాయి. అక్కడ విద్యార్థులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు, విధానాలను విమర్శిస్తారు, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తారు. అదే వారి మేధో వికాసానికి సూచికగా భావిస్తారు. కానీ భారతదేశంలో మాత్రం ప్రశ్నించే విద్యార్థిని సమస్యగా చూడడం, విధేయుడిని ఆదర్శ విద్యార్థిగా చిత్రీకరించడం ప్రమాదకర ధోరణి. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. అక్కడ ప్రశ్నలను అణచివేస్తే, రేపటి సమాజంలో స్వేచ్ఛా స్వరాలు వినిపించవు. విమర్శలను భయపడే విశ్వవిద్యాలయాలు ఎప్పటికీ గొప్ప పౌరు లను తయారు చేయలేవు. అవి కేవలం విధేయులను మాత్రమే తయారు చేయగలవు. దిల్లీ విశ్వవిద్యాలయ పాలకమండలి తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులను బెదిరించడం కాదు, వారి రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించడం నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో విశ్వవిద్యాలయాల బాధ్యత అధికారానికి కాపలా కాయడం కాదు; స్వేచ్ఛా ఆలోచనకు, విమర్శనాత్మక దృక్పథానికి, సత్యాన్వేషణకు రక్షకులుగా నిలవడం.





