స‌మాన‌త్వ హ‌క్కుల అమ‌లులో ఆలస్యం ఎందుకు ?

సమాజంలో తీవ్ర వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల ఉపాధి ,సమానత్వ హక్కులపై తెలంగాణ హైకోర్టు మరో కీలకమైన, చరిత్రాత్మక చొరవను తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న సబ్‌-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు సాధ్యం కాకపోతే, వారి నుంచి భౌతిక (ఆఫ్‌లైన్) రూపంలో దరఖాస్తులు స్వీకరించి రసీదు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం (సెప్టెంబర్ 8, 2026) కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దరఖాస్తు గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించిన నేపథ్యంలో, ఈ తీర్పు అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చింది. అంతేకాదు 2025 డిసెంబర్‌లో ట్రాన్స్ జండ‌ర్ ఆప్ష‌న్‌ లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన  ట్రాన్స్ జండ‌ర్ అభ్య‌ర్థుల ద‌రఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. నియామక నోటిఫికేషన్ల ఆన్‌లైన్ దరఖాస్తుల్లో కేవలం ‘స్త్రీ’, ‘పురుషుడు’ అనే రెండు ఆప్షన్లు మాత్రమే ఉండటాన్ని సవాలు చేస్తూ దేవత్ తనుశ్రీతో పాటు మరికొందరు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దరఖాస్తు ప్రారంభ దశలోనే తమ గుర్తింపును దాచి, తప్పుడు ప్రకటన చేసేలా అధికారులు ఒత్తిడి తెస్తున్నారని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయస్థానం.. సాంప్రదాయ లింగ వివక్ష ధోరణి  వీడి, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ మరింత సమగ్రమైన, అందరినీ కలుపుకునే  విధానాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించింది. పోలీస్ రంగంలోనే కాదు.. ఇతర విభాగాల్లోనూ నిర్దిష్ట నిబంధనల అవసరం సుప్రీంకోర్టు చారిత్రాత్మక నాల్సా వ‌ర్సెస్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా తీర్పు ప్రకారం ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి, విద్యలో సమాన హక్కులు కల్పించాల్సి ఉంది.
కేవలం పోలీస్ రిక్రూట్‌మెంట్‌లోనే కాకుండా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నిర్వహించే గ్రూప్స్, ఉపాధ్యాయ నియామకాలు , ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలోనూ వీరి కోసం ప్రత్యేక నిబంధనల అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాలలో ‘ఇతరులు’ లేదా ‘ట్రాన్స్‌జెండర్’ కాలమ్ లేకపోవడం పెద్ద లోపంగా మారింది. దీంతో పాటు వీరి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వయోపరిమితి సడలింపు, శారీరక సామర్థ్య పరీక్షలు (హైట్, వెయిట్, రన్నింగ్ ఈవెంట్స్) వంటి వాటిలో మహిళలతో సమానంగా లేదా ప్రత్యేకంగా నిర్దిష్ట నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధనలు లేకపోతే అర్హులైన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు పోటీ పరీక్షలలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.
  గతంలోనూ తెలంగాణ హైకోర్టు పలు సందర్భాల్లో ట్రాన్స్‌జెండర్లకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో హారిజాంటల్ (సమాంతర) రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. తెలంగాణ వెనుకబడిన తరగతుల (బీసీ) కమిషన్ కూడా ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై సిఫార్సులు చేసింది. పక్క రాష్ట్రమైన కర్ణాటక ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో తృతీయ లింగులకు 1 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పించి ఆదర్శంగా నిలిచింది. ఈ కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని సానుకూల చర్యలు చేపట్టింది. ఉదాహరణకు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాఫిక్ గైడ్‌లుగా, అలాగే విపత్తు నిర్వహణ సంస్థ ‘హైడ్రా’ లో వాలంటీర్లుగా కొంతమంది ట్రాన్స్‌జెండర్లను నియమించి, వారికి ఉపాధి కల్పించింది. అయినప్పటికీ, శాశ్వత నియామక నిబంధనలు , రిజర్వేషన్ విధానాల అమలులో పూర్తిస్థాయి విధానపరమైన జీఓ   విడుదల కాకపోవడం వల్ల ప్రతి నోటిఫికేషన్ సమయంలోనూ అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించాల్సి వొస్తుంది .
  తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో, ప్రభుత్వ నియామకాల బోర్డులు తమ సాంప్రదాయ విధానాలను సమూలంగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సాధారణంగా పోలీస్, అటవీ శాఖల వంటి విభాగాలలో శారీరక సామర్థ్య పరీక్షలు అత్యంత కీలకం. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలను (ఉదాహరణకు పరుగు పందెం దూరం, లాంగ్ జంప్, ఎత్తు, మరియు ఛాతి కొలతలు) ట్రాన్స్‌జెండర్ల శరీర తత్వానికి,సామర్థ్యానికి అనుగుణంగా ఎలా వర్తింపజేయాలనే దానిపై ప్రభుత్వం తక్షణమే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.ట్రాన్స్‌జెండర్ల శారీరక ప్రమాణాలను పురుషులతో పోల్చడం ఎంతమాత్రం సమంజసం కాదు.
కాబట్టి, నాల్సా తీర్పు స్ఫూర్తితో మహిళా అభ్యర్థులకు ఇచ్చే సడలింపులను వీరికి కూడా వర్తింపజేయడం లేదా వీరి కోసమే ప్రత్యేక శారీరక ప్రమాణాల మార్గదర్శకాలను జీఓ   రూపంలో విడుదల చేయడం తక్షణ అవసరం. అలాగే, ప్రతి నోటిఫికేషన్‌లోనూ వీరికి సమాంతర  రిజర్వేషన్ల కోటాను స్పష్టంగా పేర్కొనాలి. కేవలం తాత్కాలిక లేదా న్యాయస్థానాల ఆదేశాల మేరకు కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నోటిఫికేషన్లకు వర్తించేలా ఒకే సమగ్ర సర్వీస్ రూల్స్  విధివిధానాల చట్టాన్ని తీసుకువొచ్చినప్పుడే, సమాజంలో ఈ వర్గానికి నిజమైన సామాజిక న్యాయం మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ట్రాన్స్‌జెండర్లను భిక్షాటన, ఇతర సామాజిక అభద్రతా వృత్తుల నుంచి దూరం చేసి గౌరవప్రదమైన జీవనం అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఒక గొప్ప వేదిక. హైకోర్టు తాజా తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. అన్ని రకాల ఉద్యోగ దరఖాస్తుల్లోనూ మూడో లింగానికి చోటు కల్పిస్తూ, నిర్దిష్ట శారీరక ప్రమాణాల నిబంధనలను ఖరారు చేసినప్పుడే ట్రాన్స్‌జెండర్ల సాధికారత సాధ్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *