ఆధునిక మహానగరంగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స్వాగతించదగినవే అయినా, అవి క్షేత్రస్థాయిలో సామాన్యుడిపై మోయలేని భారంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. తాజాగా శాసనసభ వేదికగా తెరపైకి వొచ్చిన ‘క్యూర్’ (సిటీ అర్బన్ రిఫార్మ్స్ అండ్ ఎఫిసియన్సీ) చట్టం, తద్వారా పలు వివాదాలు , ఆరోపణలు ఉన్న హైడ్రా వ్యవస్థకు బదిలీ అవుతున్న అదనపు అధికారాలు నేడు నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నగర పరిరక్షణ పేరిట తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఒకవైపు, పెరగనున్న ఆస్తి పన్నుల ఆందోళన మరోవైపు నగర జీవులను కలవరపెడుతున్నాయి.
ఆక్రమణల చెర నుంచి చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడటానికి హైడ్రాను రంగంలోకి దించడం మంచి పరిణామమే. వెబ్‌సైట్ ఏర్పాటు చేయడం, 24 గంటల హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పౌర సేవలను మరింత వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే, ఇదే సమయంలో ‘క్యూర్ చట్టం’ ద్వారా ఆస్తిపన్నుల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం కావడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శూలప్రాయంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలు, జీవన వ్యయంతో సతమతమవుతున్న పౌరులపై అదనపు పన్నుల పిడుగు వేయడం సమంజసం కాదు.
మరోవైపు, నగరంలో మౌలిక సదుపాయాల కొరత ఇంకా పూర్తిగా తీరలేదు. ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు మెట్రో రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం, కొత్త ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వంటి సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, అంతర్గత రహదారుల దుస్థితి, వర్షం వస్తే మునిగిపోయే లోతట్టు ప్రాంతాల సమస్యలుఉండనే ఉన్నాయి. పన్నుల పెంపు ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా కాకుండా, లీకేజీలను అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
సంస్కరణల పేరిట తెచ్చే ఏ చట్టమైనా ప్రజామోదంతో, పారదర్శకంగా సాగాలి. హైడ్రాకు అదనపు అధికారాలు కట్టబెట్టే క్రమంలో చట్టబద్ధమైన విధివిధానాలను కఠినంగా అమలు చేస్తూనే, సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. కేవలం పన్నుల వసూళ్లే పరమావధిగా కాకుండా, మెరుగైన పౌర సేవలు, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందించినప్పుడే ఈ ‘క్యూర్’ సంస్కరణలకు నిజమైన సార్థకత చేకూరుతుంది. పాలకుల నిర్ణయాలు నగర శ్రేయస్సును పెంచేవిగా ఉండాలి కానీ, ప్రజల నడ్డి విరిచేవిగా మారకూడదని ఆశిద్దాం!
ఏదైనా ఒక నూతన చట్టం లేదా వ్యవస్థ విజయవంతం కావాలంటే, కేవలం అధికారాల కేంద్రీకరణ మాత్రమే సరిపోదు; క్షేత్రస్థాయి యంత్రాంగంలో జవాబుదారీతనం, పారదర్శకత అత్యంత కీలకం. గతంలో ఉన్న చట్టాల పరిధిలోనే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నప్పుడు అప్పటి అధికార గణం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనే ప్రశ్నలకు సమాధానం దొరకాలి. ఇప్పుడు హైడ్రాకు చట్టబద్ధమైన ప్రత్యేక అధికారాలు కట్టబెడుతున్న తరుణంలో, ఆ సంస్థ రాజకీయ జోక్యానికి తావులేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తుందా లేదా అన్నది కాలమే నిరూపించాలి. పెద్దల అక్రమ కట్టడాల విషయంలో ప్రదర్శించే దూకుడు, సామాన్యుల గుడిసెల కూల్చివేతల వద్ద కూడా అదే రీతిలో ఉంటే ప్రజా వ్యతిరేకత తప్పదు. చట్టం దృష్టిలో అందరూ సమానులనే నమ్మకాన్ని ఈ నూతన సంస్కరణలు కల్పించవలసి ఉంది.
మరో ప్రధానమైన అంశం.. హైదరాబాద్ వంటి చారిత్రక మహానగరం కేవలం కాంక్రీట్ జంగిల్‌గా మారకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం. క్యూర్ చట్టంలో భాగంగా కేవలం పన్నుల వసూళ్లు, పరిపాలనా సమర్థతపైనే కాకుండా, నగరంలో పచ్చదనం పెంచడం, భూగర్భ జలాల పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారాలు చూపాలి. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న కొద్దీ కాలుష్యం కోరలు చాస్తున్నది . మూసీ నది ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ వంటి ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ఈ కొత్త చట్టాల ద్వారా వేగంగా అమలు కావాలి.
అంతేకాకుండా, నగరపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేలా వార్డు కమిటీలను బలోపేతం చేయాలి. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయి పన్నును నగర అభివృద్ధికి ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో త్రైమాసిక నివేదికల ద్వారా బహిర్గతం చేయాలి. అభివృద్ధి అనేది కేవలం కొన్ని ప్రధాన రహదారులు, ఐటీ కారిడార్లకే పరిమితం కాకుండా, పాతబస్తీతో పాటు నగర శివార్లలోని కాలనీలకు కూడా విస్తరించినప్పుడే సమగ్ర వికాసం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన యజమానులని గుర్తించి, వారి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ముందడుగు వేయాలి.
ఒకవైపు నగరపాలన సంస్కరణలు ముమ్మరంగా సాగుతుండగా, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చట్టం – సెక్షన్ 22ఎ కింద నిషేధిత భూముల పరిధి భారీగా పెరిగిపోవడం, తద్వారా లక్షలాది మంది సామాన్యులు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి వీధిన పడటం శాసనసభను కుదిపేస్తున్నది . ‘ధరణి’ లోపాలను సరిదిద్ది ఈ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదే సమయంలో, పారిశ్రామిక విధానాలలో అకస్మాత్తుగా తెస్తున్న మార్పుల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు, కొత్త పెట్టుబడులకు విఘాతం కలగకుండా పారిశ్రామిక వర్గాల ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, పెరగుతున్న నగర జీవన వ్యయాల నడుమ, రేషన్ ద్వారా రాయితీ ధరలకే వంటనూనె, చక్కెర అందించాలని ప్రభుత్వం భావించడం సామాన్యుడికి కొంత ఊరటనిచ్చే పరిణామం. పాలకుల ఆర్థిక విధానాలు కేవలం వసూళ్లపైనే కాకుండా, ఇటు పారిశ్రామిక వృద్ధిని, అటు సంక్షేమాన్ని సమతూకం చేసేలా సాగాలి.





