– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. చట్టసభల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదనేది వారి చర్యలతో మరోసారి స్పష్టమైందన్నారు. అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క శనివారం చిట్ చాట్ చేశారు. ఎర్రవల్లిలో ఎల్పీ సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు పార్టీ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీకి రావాల్సిన నేతలు పార్టీ కార్యాలయంలో కూర్చుని అసెంబ్లీని అనుకరించడం ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమా అని నిలదీశారు. గతంలో ఫామ్‌హౌస్ ముందు దళిత సంఘాలు నిరసన తెలిపినప్పుడు పసుపు నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసిన ఘటనను మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఇంకా ఆ మైల పోలేదనే ఆధిపత్య దురహంకారంతోనే ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎలాగూ రాని కేసీఆర్ బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీకి కూడా రాకపోవడం చూస్తుంటే ఆయనకు చట్టసభల పట్ల, సొంత పార్టీ కార్యక్రమాల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని సీతక్క అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉంటే సచివాలయానికి రారు.. ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి రారు అని ఆమె ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌస్‌ను సచివాలయంగా, పార్టీ కార్యాలయాన్ని అసెంబ్లీగా భావించే పార్టీ బీఆర్ఎస్ తప్ప దేశంలో మరొకటి లేదని విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో ఎల్పీ సమావేశం.. పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ సమావేశం.. ఉన్న దగ్గరకే అన్నీ రావాలనుకోవడం దొరల అహంకారానికి నిదర్శనం.. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు అధికారం పోయినా దొర అహంకారం మాత్రం ఇంకా పోలేదు అని సీతక్క మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉందన్నారు. స్పీకర్‌ను, చట్టసభలను అవమానిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, ప్రతిపక్ష హోదాను ఊడగొట్టడం ఖాయమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





