ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలి

– మానవ హక్కుల వేదిక డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారీస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) డేటా సెంటర్ల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్‌ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డేటా సెంటర్ల వల్ల తాగునీరు, వ్యవసాయం, పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగదని పారదర్శకమైన అధ్యయనాలు నిర్ధారించే వరకు కొత్త హామీలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక ప్రతినిధులు వి.ఎస్.కృష్ణ, ఎస్.జీవన్ కుమార్‌లు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఉందని, రైతులు ఒక పంట కాలాన్ని వాయిదా వేసుకోవాలని, తాగునీటి సరఫరాకు హామీ ఇవ్వడం కూడా కష్టంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) నీటి అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని, ఇలాంటి తరుణంలో భారీగా నీటిని వినియోగించే ఏఐ డేటా సెంటర్లను ప్రోత్సహించడం తీవ్ర వైరుధ్యంతో కూడుకున్న నిర్ణయమని వారు తెలిపారు. డేటా సెంటర్లలోని ప్రాసెసర్లను చల్లబరిచేందుకు అత్యాధునిక శీతలీకరణ వ్యవస్థలు అవసరమని, వీటి వినియోగానికి లక్షలాది లీటర్ల నీరు అవసరమవుతుందని తెలిపారు. 2029 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుందని, దీనివల్ల గృహాలు, వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు తప్పవని హెచ్చరించారు. భారీ మూలధనంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే శాశ్వత ఉపాధి అవకాశాలు చాలా తక్కువ అని, కార్పొరేట్ సంస్థల విస్తరణ కోసం విలువైన ప్రకృతి వనరులను కేటాయించడం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని చివరికి స్థానిక ప్రజలే భరించాల్సి వస్తుందని తెలిపారు. కాగా, ప్రతిపాదిత, ఉన్న అన్ని డేటా సెంటర్ల వనరుల వినియోగంపై పారదర్శకమైన, స్వతంత్ర అధ్యయనాలు నిర్వహించాలని హెచ్ఆర్‌ఎఫ్ కోరింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి నీరు,విద్యుత్ వినియోగంపై కచ్చితమైన పరిమితులు విధించాలన్నది. సాంకేతిక రంగానికి పీఆర్ ప్రతిష్ఠ కంటే ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు, వ్యవసాయానికే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *