తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప ఊరట   

– హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే
– కరూరు బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కేసులో  
న్యూదిల్లీ, ఆగస్టు 14 : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఈ కేసులో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్‌లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులకు నగదు రూపంలో సాయం చేస్తే అభ్యంతరం చెప్పేవారా అని పిటిషనర్లను ప్రశ్నించింది. కుటుంబంలోని సంపాదనపరుడైన ఒకే ఒక వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరం చెబుతారా.. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించేందుకు మీరెవరు అని ప్రశ్నించింది. టీవీకే ఆధ్వర్యంలో గతేడాది నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన టీవీకే అధినేత విజయ్ మృతుల కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ జీవో జారీ చేశారు. ఈ జీవోను జులై 27న హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 14, 15ను ప్రభుత్వ జీవో ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది. ప్రతీ ప్రభుత్వ విభాగంలో కారుణ్య నియామకాలు ఆశిస్తున్న వారు ఎందరో ఉంటారని, వారి అవసరాలను పక్కనపెట్టి కరూర్ తొక్కిసలాట బాధితులకు ముందుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సబబు కాదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 162 ప్రకారం ఈ జీవో జారీ చేశామన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అధికారాలు వినియోగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రభుత్వ తప్పిదాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ బాధితులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వని విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో కారుణ్య నియామకాలకు అనుమతిస్తే ఒక ప్రమాదకరమైన ఒరవడికి నాంది పలికినట్టు అవుతుందని హైకోర్టు అప్పట్లో పేర్కొంది.
———————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *