భద్రాద్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,100 కోట్లు
రామాలయ అభివృద్ధికి రూ.300 కోట్లు
గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలి
రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 25 : భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణతో కలిసి ఆలయ పునరుద్ధరణ, రాతి కట్టడాల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేర‌కు భక్తుల ఆకాంక్షలకు మించి భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. పుష్కరాల అభివృద్ధి పనుల కోసం వివిధ శాఖల ద్వారా ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. భద్రాచలం రామాలయ అభివృద్ధికి సుమారు రూ.300 కోట్ల మేర నిధులు కేటాయించామని, అవసరమైతే అదనపు నిధులిస్తామ‌ని చెప్పారు. ఆలయ రాతి కట్టడాలు భవిష్యత్ తరాలకు శాశ్వత ఆస్తిగా నిలిచేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. వొచ్చేనెల 19న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

భద్రాద్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులకు కార్మికుల సంఖ్యను కనీసం 300 మందితో పనులు కొనసాగించాలని ఆదేశించారు. సెంట్రింగ్, స్టీల్, రాడ్ బెండింగ్ పనులకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, ఇంజనీరింగ్ సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని సూచించారు.పెండింగ్‌లో ఉన్న డ్రాయింగ్‌లు, డిజైన్లను వెంటనే పూర్తి చేయాలని, రాతి నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. పనుల అమలులో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణ పుష్కర ఘాట్ల నిర్మాణాలకు సంబంధించిన డ్రాయింగ్‌లను త్వరితగతిన ఆమోదింపజేసి పనులు ప్రారంభించాలని, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.కరకట్టల నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించేటప్పుడు రైతులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజాప్రతినిధులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం నూతన మార్కెట్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్ కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అదేవిధంగా రంగనాయకుల గుట్ట వద్ద రూ.5.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా భూస్థాయి నీటి నిల్వ ట్యాంకు (జీఎల్ఎస్ఆర్) నిర్మాణం, బోర్‌వెల్స్, పంపుసెట్లు, పైప్‌లైన్ల ఏర్పాటు, భద్రాచలం ఘాట్ వద్ద శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ , సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ,దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *