గ్రామ పంచాయతీల్లో నిబంధనల సరళీకరణ
ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తూ కొత్త పాలసీ
ఎల్నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటాం
రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధంగా ఉన్నాయి
మొక్కజొన్న కొరతపై ప్రత్యేక దృష్టి
పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026’ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్లను ఉత్పత్తి చేయడమే కాకుండా.. రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026’ (Poultry India Expo 2026 Hyderabad)ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిత్యం 5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తూ విద్యార్థులకు, యువతకు పౌష్టిక ఆహారాన్ని అందించడంలో పౌల్ట్రీ వ్యాపారులు కీలక భాగస్వాములవుతున్నారని అభినందించారు.
మొక్కజొన్న కొరతపై ఆదేశం
పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనపరమైన సమస్యలను నిర్వాహకులు తమ దృష్టికి తీసుకొచ్చారని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ ఫారాలు నిర్మించుకోవడానికి సులభతరంగా సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తీసుకొస్తుందని ప్రకటించారు. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని, అయితే పౌల్ట్రీ రంగానికి అత్యవసరమైన మొక్కజొన్నల కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రులను ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు..
ఒడిదుడుకులను తట్టుకుని పరిశ్రమను కాపాడుకుంటున్న పౌల్ట్రీ వ్యాపారుల కృషిని ప్రభుత్వం అభినందిస్తోందని, సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పౌల్ట్రీని కూడా ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి, శాశ్వత పరిష్కారం దిశగా, కాలానుగుణంగా క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీలను రూపొందిస్తామని స్పష్టం చేశారు. “పాలసీలు, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి చింత అవసరం లేదు. తెలంగాణలో ‘పాలసీ పెరాలసిస్’ అనేదే లేదు. గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి పాలసీలను కొనసాగిస్తూనే, అవసరమైన కొత్త పాలసీలను తీసుకొస్తున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.





