ఎల్‌నినో సవాళ్లకు శాస్త్రీయ పరిష్కారాలు చూపాలి

  • ఐదు నెలల్లో రూ.10 వేల కోట్లతో జల సంరక్షణ పనులు
  • సంక్రాంతి తర్వాత ప్రతినెలా రూ.2 వేల కోట్ల పనులకు ప్రణాళిక
  • కరువు నివారణ, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయంపై ప్రధాన దృష్టి
  • క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై  మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి  సమీక్ష

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,  నవంబర్‌ 24: వాతావరణ మార్పులు, ఎల్‌నినో పరిస్థితుల వల్ల తలెత్తే సవాళ్లకు శాస్త్రీయంగా నిరూపితమైన, ఆచరణలో అమలు చేయగల పరిష్కారాలను తెలంగాణ క్లైమేట్‌ కాంక్లేవ్‌ (Climate Conclave) ప్రపంచం ముందుంచాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంక్లేవ్‌ చర్చలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా కరువును తట్టుకునే విధానాలు, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయం, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై కేంద్రీకృతం కావాలని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న క్లైమేట్‌ కాంక్లేవ్‌ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ రూపకల్పన, నిపుణుల భాగస్వామ్యం, పెట్టుబడిదారులతో సంప్రదింపులు, ప్రదర్శనలు, ఆడియో–విజువల్‌ అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన నమూనాలతోపాటు ఇక్రిశాట్‌ గుర్తించిన అత్యుత్తమ విధానాలను ప్రదర్శనలు, ఆడియో–విజువల్‌ కార్యక్రమాల్లో పొందుపరచాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ డి. కృష్ణభాస్కర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

ఐదు నెలల్లో రూ.10 వేల కోట్ల పనులు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆలోచనల మేరకు రూపొందించిన ఐదు నెలల ఎల్‌నినో సన్నద్ధత కార్యక్రమం కాంక్లేవ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుమారు రూ.10 వేల కోట్లతో ప్రతిపాదించిన ఈ కార్యక్రమంలో సంక్రాంతి తర్వాత ప్రతి నెలా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖలు సంయుక్తంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్‌, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో జల వనరుల పరిరక్షణకు సంబంధించిన పనులను విస్తృతంగా చేపట్టనున్నారు. వ్యవసాయ పనులు తగ్గే కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.

తాగునీరు, ఆహార భద్రతకు భరోసా

సంభావ్య కరువు పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీరు, ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంక్లేవ్‌లో సమగ్రంగా వివరించాలని ఉత్తమ్‌ ఆదేశించారు. వచ్చే వర్షాకాలం వరకు జలాశయాల్లోని నీటి నిల్వలను కాపాడుకునేందుకు అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు దాదాపు ఏడాదిపాటు సరిపడే బియ్యం నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. కరువు కారణంగా పంట దిగుబడులు తగ్గినప్పటికీ ప్రజల ఆహార భద్రతకు ఇబ్బంది కలగకుండా ఈ నిల్వలు కీలక రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జీరో ఉద్గారాల దిశగా తెలంగాణ

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విస్తరణ, శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమల్లో తిరిగి వినియోగించడం, నికర శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని డేటా సెంటర్లు తమ విద్యుత్‌ అవసరాల్లో కనీసం 51 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సమకూర్చుకోవాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని అధికారులు వివరించారు. క్లైమేట్‌ కాంక్లేవ్‌లో పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, నీటి సంరక్షణ రంగ నిపుణులు, సామాజిక ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొననున్నారు. సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి భాగస్వాములతో కలిపి సుమారు 125 మంది గ్రామీణ ప్రతినిధులను కూడా చర్చల్లో భాగస్వాములను చేయనున్నారు.
నీటి భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవస్థలు, జీవవైవిధ్య పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నియంత్రణ, వ్యవసాయం, స్వచ్ఛ ఇంధనం తదితర అంశాలపై కాంక్లేవ్‌లో విస్తృతంగా చర్చించనున్నారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ క్రెడిట్లు, పర్యావరణ పర్యాటకం, చక్రీయ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు ప్రత్యేక పెట్టుబడిదారుల వేదికను ఏర్పాటు చేయనున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర అభివృద్ధిలో తెలంగాణను దేశానికి మార్గదర్శకంగా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కాంక్లేవ్‌ ప్రతిబింబించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *