- పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ సమావేశంలో ఎందుకు ప్రశ్నించలేదు?
- మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలి
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. బుధవారం హైదరాబాద్ వేదికగా జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశంలో ఏపీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గళమెత్తలేదని ఆరోపిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు ప్రాజెక్టులపై మౌనం ఎందుకు?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అడుగులకు మడుగులొత్తుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. గతంలో ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహానికి పాల్పడ్డారని, ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులు, వేదికలు మారుతున్నా ఏపీకి సహకరించే ముఖ్యమంత్రి వైఖరి మాత్రం మారడం లేదని ధ్వజమెత్తారు.
ఏపీ ఇంజనీర్ల వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్వయంగా ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే, సమావేశంలో ఆ ప్రాజెక్టుపై చర్చించామని ప్రచారం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని హరీశ్ రావు ప్రశ్నించారు. నాడైనా, నేడైనా నీళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోతుంటే రాష్ట్రానికి రక్షణ ఎవరని నిలదీశారు. ఈ పరిణామాలపై మేధావులు, తెలంగాణవాదులు లోతుగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇది చారిత్రక ద్రోహమని, తెలంగాణ సమాజం క్షమించదని హరీశ్ రావు స్పష్టం చేశారు.





