ఇందిరమ్మ చీరలు, చేయూత కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం
రూ.450 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో సుమారు రూ.450 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ముందుగా అమ్రాబాద్ మండలం మద్దిమడుగుకు చేరుకుంటారు. అక్కడ రూ.38 కోట్లతో నిర్మించనున్న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం మరియు ఇతర అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. దీంతో పాటు రూ.18 కోట్లతో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు, ఆలయ సమీపంలో రూ.15 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న హరిత హోటల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు.
పాదయాత్రగా బహిరంగ సభకు
మద్దిమడుగు పర్యటన అనంతరం సీఎం హెలికాప్టర్లో అచ్చంపేటకు చేరుకుంటారు. అచ్చంపేట హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి పాదయాత్రగా వెళ్లి ప్రజలకు అభివాదం చేస్తారు. అనంతరం సభా వేదికపై నుంచి జిల్లాలోని పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
సీఎం శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనుల పూర్తి వివరాలు:
మద్దిమడుగులో
రూ.38 కోట్లు: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, ఇతర అభివృద్ధి పనులు.
రూ.18 కోట్లు: శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు.
రూ.15 కోట్లు: శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ నిర్మాణం.
అచ్చంపేట బహిరంగ సభ ప్రాంగణం నుంచి
రూ.274.32 కోట్లు: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా బీటీ రోడ్ల అభివృద్ధి పనులు.
రూ.29.65 కోట్లు: నాగర్ కర్నూల్, పెద్ద కొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు.
రూ.25 కోట్లు: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు.
రూ.18.105 కోట్లు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణం.
రూ.14 కోట్లు: అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో నూతన ఐటీడీఏ భవన నిర్మాణం.
రూ.2 కోట్లు: అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణం.





