జీవితమే నన్ను పుటం పెట్టింది

(02 ఆగస్టు 2026 న చాసో కథా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)

నకజనకరి నాం.. నాం…’ సంపుటిలోని కథల నేపథ్యం?

‘నకజనకరి నాం.. నాం…’ సంపుటి గ్రామీణ దళిత స్త్రీల జీవనసత్యాల నుంచి పుట్టిన కథల సమాహారం. వలస జీవితం, ఆకలి, శ్రమ, సంప్రదాయాలు, అమాయకత్వం, మారుతున్నకాలం మధ్య గ్రామీణ ప్రజల అస్తిత్వ పోరాటమే ఈ కథల హృదయం. నేను ఊహించిన జీవితాన్ని కాదు, నేను చూసిన, విన్న, అనుభవించిన మనుషుల ప్రపంచాన్నే కథలుగా మలిచాను. గ్రామీణ దళితజీవితాన్ని, రైతులస్వరాన్ని సాహిత్యంలో సజీవంగా వినిపించాలనే ఆరాటమే ఈ సంపుటికి ప్రాణం. నా కథల్లో గ్రామీణప్రాంతంలో వెనుకబడిన కులాల మహిళలు మరియు వూరత్తల దళితకులాల మహిళలు తారస పడతారు కథ చదివితే వారి బతుకు గోస వినిపిస్తుంది.·

    ఉత్తరాంధ్ర- మీ కథల శైలీ శిల్పాలను ఎలా ప్రభావితం చేసింది?

ఉత్తరాంధ్ర నాకు కేవలం భౌగోళిక ప్రాంతం కాదు. అది నా భాషకు, భావానికి, కథనానికి మూలాధారం. ఇక్కడి యాస, మట్టివాసన, ప్రకృతి, మనుషుల జీవన విధానం నా కథలకు సహజత్వాన్ని, విశ్వసనీయతను అందించాయి. స్థానిక సంస్కృతిని అలంకారంగా కాకుండా కథలో అంతర్భాగంగా మలచడం వల్ల పాత్రలు పాఠకుల మనసులో సజీవంగా నిలిచాయి. అందుకే నా కథల్లో ఉత్తరాంధ్ర ఒక నేపథ్యం కాదు, ఒక ప్రధాన పాత్ర .నేను పక్కా పల్లెటూరి పిల్లాణ్ణి. నా చుట్టూ నా ఇంటిచుట్టూ నా నడిచుట్టూ నేను పెరిగిన హాస్టల్ చుట్టూ జీవితం నా కథల్లో ఉంది నా బాల్యం చుట్టూ వాలకాలు ఉన్నాయి నాటకాలు ఉన్నాయి బుర్రకథలు జాలరి బాగోతాలు సాధువుల పాటలున్నాయి వాటినుండి  జీవితమే నన్ను పుటం పెట్టింది. నేను పెన్ను పెట్టినా నోరు కదిపినా అవే వస్తాయి.

‘కాసిన చెట్లు రాళ్ళ దెబ్బలు / కాయక మానవు సుమ్మండీ / కాసికి పోయిన గాడిద ఎప్పుడూ గంగిగోవుగా రాదండి’ ఇలా యాచకుల జంగాల బతుకు పాటల్లోంచి నా కథలు మొలిచాయి.

‘నకజనకరి నాం.. నాం..’ సంపుటికి చాసో కథా పురస్కారం రావడం మీద మీ స్పందన?

చాసో కథా పురస్కారం అందుకోవడం నాకు లభించిన గౌరవం మాత్రమే కాదు. ఉత్తరాంధ్ర సంస్కృతి, అట్టడుగు వర్గాల అనుభవాలకు లభించిన సాహిత్య గుర్తింపు. ఈ పురస్కారం ఆనందంతో పాటు మరింత బాధ్యతను కూడా గుర్తుచేసింది. సమాజపు అంచుల్లో మిగిలిపోయిన జీవితాలను నిజాయితీతో, మానవీయ దృక్పథంతో సాహిత్యంలో నిలబెట్టాలనే నా సంకల్పానికి ఇది మరింత బలాన్నిచ్చింది. చాసో పురస్కారంతో ఇప్పటికే మరికొన్ని జీవన సెకలాలను ఇంతవరకు ఎవరూ ముట్టని దళితకోణాల్ని ఉత్తరాంధ్ర సన్నకారు రైతు పంటపాటల్ని మాటల్ని కథల్లో రాయడానికి సరుకు సంపాదించుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *