మెరుపు తీగెలు
స్వర్గథామంలో సుబ్బారాయుడుగారు యెదురయ్యారు. పోయినవాళ్ళని బూడిద చెయ్యడానికి నేను వచ్చినట్టే ఆయనా వచ్చారు. దిగులుముఖాలు వదిలేసి మామూలవుతూ వొకర్ని వొకరు పలుకరించుకొని కుశలమడిగాము.
ఎప్పుడూ కలవాలని అనుకుంటూనే కలవని మేము- యెప్పటికప్పుడు కలిసే ప్లేసుగా మారింది స్వర్గథామం. “ఈ మధ్య శ్మశానంలోనే మిమ్మల్ని నాలుగుసార్లు కలిశాను” అన్నాను, అర్థంలేనినవ్వు పులుముకుంటూ. “అంటే, మనం దెయ్యాలమా?” అన్నారు సుబ్బారాయుడుగారు. “అయితే- నాలుగు సార్లేమిటి, రోజూ కలిసే వుండేవాళ్ళం” నేనూ నవ్వాను.
అప్పటికప్పుడే మా మధ్యలో నిశ్శబ్దం దూరి ఆవరించి ఆక్రమించింది.
“శ్మశాన నిశ్శబ్దం అంటే యిదేనేమో?” అన్నాను. రాయుడుగారు నిజమేనన్నట్టు తలని పైకీకిందికీ ఆడించారు.
ఆపై, మా మాటల్లోకి పోయినవాళ్ళందరూ వచ్చారు. వారి గుణగణాలూ వచ్చాయి. “పోయినోళ్ళందరూ మంచోళ్ళు” అన్నాను. “మనం కూడా త్వరలో మంచివాళ్ళం అవుతాం” అన్నారు రాయుడుగారు నవ్వుతూ. “ఎంతకాలం బతికినా యెన్ని నేరాలూ ఘోరాలూ చేసినా యెప్పుడోకప్పుడు మంచివాళ్ళం కాకతప్పదు” అన్నాను నేనూ నవ్వుతూ.
నిశ్శబ్దాన్ని చేధిస్తూ కపాలమోక్షం జరిగిన శబ్దం.
నిప్పుమీద నివురులా పేరుకుపోతున్న నిశ్శబ్దాన్ని భరించడం నావల్లకాక “యెద్దు చస్తే యెముకలు, మనిషి చస్తే మాటలు” సామెతని గుర్తుచేసుకున్నాను, నిట్టూర్పు జోడించి.
ఒకరూ వొకరూ చేరి చిన్న గుంపుగా అంతా నడుస్తున్నాము.
“అంతే! యేమీ పట్టుకుపోము, పూచికపుల్ల కూడా. అన్నీ యిక్కడే వదిలేసి పోతాము. అయినా యెందుకో యీ తాపత్రయం? డబ్బువెంట ధనంవెంట కీర్తివెంట.” వైరాగ్యంతో రాయుడుగారు ఆలోచనతోనో అనాలోచనతోనో జనంమధ్య వుండికూడా జ్వర పేలాపనలా పేలుతున్నారు.
అందరం వెళ్ళి అక్కడున్న సిమెంటు చప్టా కుర్చీలలో కూర్చున్నాము. వెనక్కి చేరబడబోతూ అంతా తలలు తిప్పి చూస్తుంటే, నేనూ తల తిప్పి చూశాను. ఆ శ్మశానంలో ఆ సిమెంటు కుర్చీలమీద తల ఆనుకొనే చోట అంటే బ్యాక్ రెస్ట్ మీద పాలరాతి పలకలు. ఆ పలకల మీద ‘దాత డబ్బా సుబ్బారాయుడు’ అని అన్ని కుర్చీలమీదా పెద్దపెద్ద అక్షరాలతో వుంది, వివరాలతో సహా.
“ఎంతయింది మాస్టారూ?” రాయుడుగారిని యెవరో అడిగారు. ఎంతోకొంత అనలేదాయన. “ముగ్గురు కూర్చొనే వొక కుర్చీకి బ్యాక్ రెస్ట్తో కలిపి ఆరువేలు. పాలరాయీ ఆ రాతిమీద పేరూ వివరాలూ మాంచి డిజైన్తో చెక్కడానికి మూడువేలూ, ట్రాన్స్పోర్టూ వొక్కోదానికి పదివేలు అనుకోండి.” చెప్పారు. “ఆరు కుర్చీలకీ అరవై వేలు” మరెవరో చాలా యెక్కువే ఖర్చుపెట్టారన్నట్టు కనుగుడ్లు పెద్దవిచేసి తలూపుతూ అన్నారు.
“నేమ్ ప్లేట్కే మూడువేలంటే, ఆరుమూళ్ళ పద్దెనిమిది వేలు, మీ లెక్కప్రకారం పోని యిరవైవేలని అనుకోకపోయినా, మీ నేమ్ ప్లేట్స్ ఖర్చుతో మరో మూడుకుర్చీలు వచ్చేవి” అన్నాను, నోరుజారి.
సుబ్బారాయుడుగారు కొన్నిక్షణాలు తీసుకున్నారు, ఆపై పెద్దగా నిట్టూర్పు వదిలి “ఆ నేమ్ బోర్డు లేకపోతే యెవరో మున్సిపాలిటీవాళ్ళు వేసారనీ అనుకోవచ్చు. అందువల్ల మరోదాత ముందుకు రాకపోవచ్చు” చెపుతుంటే, “సరే, పేరుకోసమే, మీరుకాదు- యెవరైనా చేశారు అనుకుందాం, మంచిదే కదా?” మరెవరో సమర్ధించారు.
నేను చేసిన డ్యామేజీ నాకు ఆలస్యంగా అర్థమయ్యింది. “నిజమే, యూ ఆర్ ది ఇన్స్పిరేషన్” అన్నాను, మెచ్చుకోలుగా తలాడిస్తూ.





