బ్రతుకు బాటలో
అవిశ్రాంతంగా శ్రమిస్తూ గమిస్తూ
సుదూర లక్ష్యాలనెన్నో అందుకున్నాను
ఇంకా చేయవలసిన గమనాలూ
చేపట్టవలసిన గమ్యాలూ
ఎక్కువే వున్నాయి
ఇటుచూస్తే
కొద్దిపాటి జీవనకాల ప్రమాణం
అటు చూస్తే
ఎన్నోతీరాలకు చేరవలసిన ప్రయాణం
సాధించవలసినవి మిక్కిలిగా మిగిలి
ఆశాంతిని రేకెత్తిస్తున్న వైనం
నా అశక్తతను చాటుతున్న దైన్యం
వాంఛిత ఫలాల ప్రాప్తికి
ఈ పయనానికెన్ని జన్మలు కావాలో
జ్ఞాన సముపార్జన సాగిస్తూ వృద్ధున్నైనాను
అనేక విద్యలింకా అజ్ఞాతంగానే వున్నాయి
ఈ అభ్యాసానికి చరమస్థానమెక్కడో
పరమస్థానమెక్కడో
ఇటుచూస్తే పరిమిత మేధాసామర్థ్యం
అటు చూస్తే అనంత విజ్ఞాన సాగరం
సంపూర్ణ జ్ఞానలబ్దికి
ఈ అధ్యయనానికెన్ని జన్మలు కావాలో
కోటానుకోట్ల మానవుల
విభిన్న స్వభావాలను
జాగ్రత్తగా పఠించాను
అయినా ఆ మనస్తత్త్వ మహా సముద్రాల
పాతాళ ప్రదేశాల మర్మ సమాచార సంగ్రహణ
అసంపూర్ణంగానే వున్నది
ఇటుచూస్తే త్వరగా తరిగిపోతున్న
జీవన తరుణం
అటుచూస్తే వడిగా పెరిగిపోతున్న
జనసంఖ్యతో పాటు
వేగంగా మారిపోతున్న
జనగణ గుణం
లోకులను పూర్తిగా అర్థం చేసుకునే
కార్యసిద్ధికి
ఈ అభ్యసనానికెన్ని జన్మలు కావాలో





