ఫలితాన్ని ఆశించను

స్వర్ణ కిలారి

(02 ఆగస్టు 2026 న చాగంటి తులసి అనువాద పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)

లిప్తకాలపు స్వప్నం అనువాదానికి ఎంచుకోవడానికి కారణం?

ఒరిజినల్ ఇంగ్లీషు వెర్షన్ ‘ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ’లో చదివినప్పుడే నేను బాగా కదిలిపోయాను. ఒకరోజు నా సహచరుడు ‘నువ్వు దీన్ని తెలుగు చేయొచ్చు కదా’ అన్నాడు. చదవడమే చాలా కష్టమైంది నాకు, ఇంకా అనువాదం ఎలా చేయగలను? అంత బాధ నేను తట్టుకోలేను అని చెప్పేశాను. కొన్నాళ్ల తర్వాత, ‘ఒక అమ్మగా నువ్వు మాత్రమే చేయగలవు’ అన్నాడు. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. మామూలుగా అయితే రెండు మూడు నెలల్లో అనువాదం చేయవచ్చు. కానీ, ఇది నాక్కూడా మొదటి పుస్తకం కావడం వల్ల అయిదు నెలల పైనే పట్టింది. అప్పటికి నా కొడుకు వయసు కూడా సుమారు క్లింట్ వయసే కావడం వల్ల ప్రతిదీ తనతో పోల్చి చూసుకునేదాన్ని. బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని, నవ్వుకునేదాన్ని, అబ్బురపడేదాన్ని. అలా అనుకోకుండా నా జీవితంలోకి వచ్చిన క్లింట్ ఇప్పుడు నాలో ఒక భాగమైపోయాడు.

ఈ పుస్తక రచయిత అమ్ము నాయర్ వస్తుశిల్పాలలో పాటించిన ప్రత్యేకతలను తెలుగు అనువాదంలోకి తీసుకురావడానికి మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకున్నారు?

రచయిత అమ్ము నాయర్ కు కూడా ‘ది బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ’ తొలి పుస్తకమే. ఇంత అద్భుతంగా ఎలా రాసిందని ఆశ్చర్యపోయాను. అందులోని ప్రకృతి వర్ణనలు, లోతైన ఫిలాసఫీ, ఆమె దగ్గరగా చూసిన వాతావరణం- అన్నీ కలిసి అది ఆమె మొదటి రచన అనిపించకుండా చేశాయి. ఆ మలయాళ నేపథ్యాన్ని తెలుగులోకి తీసుకురావడానికి చాలా ఇబ్బందిపడ్డాను. పూర్తిగా తెలుగీకరణ చేయకూడదు. కానీ, ఆ మలయాళ పదాలను, ఆ వాతావరణాన్ని తెలుగు పాఠకులకి సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి. కొందరు మలయాళ స్నేహితులను అడిగి వాటి అర్థాలు తెలుసుకున్నాను. క్లింట్ మీద తీసిన సినిమా, కొన్ని డాక్యుమెంటరీలు, వీడియోలు చూసాను. మూడో డ్రాఫ్ట్ కి సంతృప్తి కలిగింది.

చాగంటి తులసి అనువాద పురస్కారం లిప్తకాలపు స్వప్నానికి రావడం మీకెలా అనిపించింది?

ప్రతిష్టాత్మక చాగంటి తులసి అనువాద పురస్కారం ‘లిప్తకాలపు స్వప్నాని’కి ఇస్తున్నాం అని చలం గారు చెప్పగానే కాసేపు అలా నిశ్శబ్దంగా ఉండిపోయాను. చేసిన కష్టానికి, పడిన వేదనకు తగిన గుర్తింపు వచ్చినట్టు ఫీలయ్యాను. ఈ పుస్తకానికి పురస్కారాలు వచ్చినా, ఎన్ని ప్రశంసలు వచ్చినా, క్లింట్ కి సంబంధించి ఏ చిన్నవార్త అయినా, సమీక్ష అయినా వెంటనే క్లింట్ అమ్మగారైన చిన్నమ్మగారితో షేర్ చేసుకుంటాను. నేను అనువాదాన్ని ఆస్వాదిస్తాను కానీ ఫలితాన్ని ఆశించను. ఎవరైనా దాన్ని గుర్తించి అభినందిస్తే మాత్రం ఆనందిస్తాను. ఇలాంటి అరుదైన పురస్కారాలు రచయితలకు మరిన్ని మంచి రచనలు చేయడానికి స్ఫూర్తినిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *