1
ఎలా ఉండాలో ఏమి మారాలో వల్లెవేస్తాం
మాటల మూటలు భుజాలపై తాండవిస్తూ
గాలిలో యుద్ధాలు చేసుకుంటాయి
ఒక్కరు ఒంటరిగా ఉన్నప్పుడు అసలా
గుంపులో ఉన్నప్పుడు నిజమా
ప్రతిఒక్కరి పంటికిందా కసి
మార్చిపడేయాలన్న రోదసి
‘ఎందుకిలా ఉంది?’ అన్న అజీర్తి పదే పదే
2
కాళ్ళు పట్టి ఈడ్చేసుకుంటుంది
తనలోకి ‘అవకాశం’
‘సాంత్వన’ ఆలింగనం చేసుకుంటుంది
నిండా ముళ్ళ నదిలోంచి బయటకు తీస్తూ
‘పరిస్థితే’మో ఆలోచనా గతిని
మతి నుండి దూరం చేస్తుంది
మనిషి నుండి నీడను విడగొట్టినట్టు
‘రాజీ’దారి లోకి మళ్ళిస్తూ
3
ఇప్పుడు పంటికింద నవ్వుగా
మారుతుందా ‘కసి’
మార్చిపడేయాలనుకున్న ఆ
‘మారబడే’ విషయమే నువ్వైపోయీ
పకపకా నవ్వుకుంటుంది లోలోన
ఆ విడివడ్డ నీడ
4
‘ఇదీ నిజమే’ ‘అందుకే ఇలా ఉంది’
‘ఇలా ఎందుకుండకూడదు’ క్కూడా
జవాబు తయారై ఉంటుంది భేషుగ్గా
ఇప్పుడిక ప్రశ్నలుండవు మునుపటిలా
అన్నీ ప్రతిదానికీ జవాబులే మరీ
5
ఇలా లాగబడేసరికి
నీలోని ప్రశ్న అణచబడుతుందో
లేక ఊసరవెల్లిలా రూపాంతరం
చెందుతుందో రంగులు మార్చుకొని
ఇక అన్నింటికీ సమాధానం- ప్రశ్న
కంటే ముందే ప్రసవిస్తూ ఉంటుంది
ఇంకేమి మిగులుండదు అజీర్తి అసలే
ఉండదు మింగుడు తప్ప, పోనీలే
మార్చేవారు పుట్టుకొస్తునే ఉంటారు





