- రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నా..
- రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
- తాడ్వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాంక్షించారు. మంగళవారం కొండపర్తి గ్రామంలో గవర్నర్ పర్యటించారు. తొలుత కొమరం భీం, బిర్సాముండా విగ్రహాలను, పాఠశాలలో డిజిటల్ తరగతులను, అంగన్వాడీ కేంద్రాన్ని, రూ.7,84,700 వ్యయంతో నిర్మించిన మసాలా యూనిట్, రూ.7,76,594 తో కుట్టు మిషన్ యూనిట్ ను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం రిమోట్ తో వ్యవసాయ మోటార్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ.. గ్రామంలో 70 గృహాలు 285 మంది ప్రజలు ఉన్నారని, చిన్న గ్రామమని అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి మన సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో డిజిటల్ తరగతులు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషమని ఆయన అభినందించారు. విద్యార్థులు ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నారని తెలిపారు.




