– డిసెంబర్ 9 నుంచి సేవలు అందుబాటులోకి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు కీలకంగా భావిస్తున్న కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు కొహెడ సమగ్ర మార్కెట్‌కు సంబంధించిన సవరించిన లేఅవుట్‌పై మార్కెటింగ్ అధికారులతో సచివాలయంలో సోమవారం సమీక్షించిన ఆయన రైతులు, వ్యాపారులు, ఇతర భాగస్వాముల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు రూపకల్పనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ప్రాజెక్టును మÖడు దశలలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. తొలి దశ నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి డిసెంబర్ 9న మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌లో కొనసాగుతున్న లావాదేవీలను కొహెడ సమగ్ర మార్కెట్‌కు సాఫీగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సమన్వయంతో తరలింపు ప్రక్రియను నిర్వహించనున్నామన్నారు. ఈ మార్కెట్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఓపెన్ ప్లాట్‌ఫారాలు, ట్రక్ డాకింగ్ షెడ్లు, డ్రైయింగ్ యార్డులు, విశాల రహదారులు, రవాణా సౌకర్యాలు, పారదర్శక లావాదేవీల కోసం సాంకేతిక వసతులు, రైతులకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ మార్కెట్ ద్వారా రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడంతోపాటు మధ్యవర్తుల ప్రభావం తగ్గి, పారదర్శక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధిలో కొహెడ సమగ్ర మార్కెట్ మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన తుది ప్రతిపాదనను ముఖ్యమంత్రికి ఆమోదం కోసం సమర్పిస్తున్నామని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





