– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రధాని మోదీ సభకు ఇంతటి జనసంద్రం కనిపించడం రాష్ట్రంలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సభ విజయవంతమయ్యేందుకు కార్యకర్తల అహర్నిశల శ్రమ, నాయకత్వ సమన్వయం, కార్యకర్తల నిబద్ధత ప్రధాన కారణమని అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రౌండ్ బయట కూడా వేలాదిగా ప్రజలు ఉండటం బీజేపీపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ప్రతి వర్గం బీజేపీ వైపు ఆశతో చూస్తోందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా రాజకీయ మార్పు అనివార్యమవుతుందని రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త రాజకీయ దిశను తీసుకురాబోతోందని, రాబోయే రోజుల్లో బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా, మహిళా, యువత వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తోందని, గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మోదీ గ్యారంటీ అంటే తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, రాష్ట్ర ఆర్థిక పురోగతి అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమ పంథాలో పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, అధికారం లక్ష్యంగా కార్యకర్తలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై జరుగుతున్న విమర్శలను ఖండించిన ఆయన ఇది ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతున్న సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్ల తొలగింపే లక్ష్యమని, అసలైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించిన ఆయన ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి.. కానీ కాంగ్రెస్ పార్టీ తనను తాను ముస్లిం లీగ్ తరహా పార్టీగా మార్చుకుంటోంది అని వ్యాఖ్యానించారు. దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని కూడా ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




