రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సాగునీరుతో పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా మారాలని కేసీఆర్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందన్నారు. ప్రకృతి తో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని కేసీఆర్ అన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహం సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కేసీఆర్ కోరుకున్నారు.
రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆశించారు. అప్పుడే విశ్వావసు నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని కేసీఆర్ అన్నారు. ఉగాది పచ్చడి మాదిరి, జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని కేసీఆర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు.





