మహిళా లోకానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

– మహలక్ష్మి పథకాన్నిరద్దు చేసే దమ్ముందా?
– ఉచిత ప్రయాణంపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : ఫ్రీ బస్ పథకాన్ని పనికిమాలినదిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ ఉచిత బస్సు పథకం ద్వారా లక్షలాదిమంది మహిళలు ప్రతి రోజూ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటూ ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు సులభంగా పొందుతున్నారని ఆమె వివరించారు. ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్ల మేర మహిళలకు ప్రయాణ వ్యయ భారం తగ్గిందని తెలిపారు. ఇది కేవలం పథకం మాత్రమే కాదు, మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక స్వేచ్ఛకు దారితీసే కీలక అడుగు అని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ఈ పథకాన్ని ఓర్వలేక దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి విమర్శించారు. మహిళలు బయటకు రావడం, తమ పనులు స్వయంగా చేసుకోవడం ఇష్టపడని దొరతనపు ఆలోచనల వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళా ఉన్నతే తెలంగాణ ఉన్నతి : నస్తూరిపల్లి సభలో మంత్రి సీతక్క

తమది పేదల, బడుగుల, అట్టడుగువర్గాల అభివ ద్ధి, సంక్షేమ ప్రభుత్వం అని,  మహిళా ఉన్నతి తెలంగాణ ఉన్నతి అని నమ్ముతున్నామని, అందుకే రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.60 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. 4.70 లక్షల చిన్న పరిశ్రమలు మహిళలతో స్థాపింపజేసి సంపద సృష్టిస్తున్నామని, వారు అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. భూపాలపల్లి జిల్లా నస్తూరిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభలో తొలుత మంత్రి సీతక్క మాట్లాడారు. పంట కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకు పెద్ద పీట వేశామని, మొత్త కొనుగోలు కేంద్రాలు 8,251 ఉంటే వాటిల్లో ఐకేపీ సెంటర్లు 3,403 అంటే 40 శాతం కంటే ఎక్కువ కేంద్రాలు మహిళల చేతుల్లోనే ఉన్నాయని, ఈ సెంటర్లలో పంటల క్రయవిక్రయాల ద్వారా గత ఏడాది కమీషన్ల రూపంలో రూ.160 కోట్లు ఆడబిడ్డలు సంపాదించారని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామనే ఒక గొప్ప సంకల్పాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆడబిడ్డల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇటుకలు, సెంట్రింగ్ సామగ్రిని తమ మహిళా సంఘాలే సరఫరా చేస్తున్నాయని, ఇప్పటికే 720 ఇటుకల తయారీ యూనిట్లు, 170 సెంట్రింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయని మంత్రి సీతక్క వివరించారు. మహిళలకు శిక్షణ ఇచ్చి వ్యాపారాల్లో ఎదిగేలా చేస్తున్నామన్నారు. ఎండను లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలనIప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా రైతు ఉత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పారు. బీజేపీ, బీఆరఎస్‌లు మహిళలను వంటింటికే పరిమితం చేసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ మహిళా పక్షపాత ప్రభుత్వం.. మహిళా బిల్లు పేరుతో బీజేపీ డీలిమిటేషన్ బిల్లు తెచ్చింది.. బీజేపీ బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేస్తుంటే తమ ప్రభుత్వం రైతుల రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. ప్రతి కుటుంబానికి ధీమా కల్పించేందుకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కల్పిస్తున్నామన్నారు. రైతన్న ఖాతాల్లోకి ఇప్పటికి రూ.లక్ష కోట్లు వేశామని, తాము ఏడాదిన్నర కాలంలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. అప్పులపాలైన రాష్ట్రాన్ని అభివృద్ది పరుస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపుల పితామహుడు కేసీఆర్ సమస్యల మీద, రైతుల కోసం, మహిళల కోసం బయటకు రాలేదు.. కానీ ఫిరాయింపు నాయకులను చేర్చుకోవడానికి వస్తున్నారు.. ఇంటికి సమీపంలో ఉన్న అసెంబ్లీకి రారు కానీ రాజకీయ ఫిరాయింపు సభలకు వస్తారు.. వారికి ప్రజాప్రయోజనాలు పట్టవు.. ఫక్తు రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యం అని ఎద్దేవా చేశారు. త్వరలో మహిళా సంఘాలతో సీఎం సమావేశమవుతారని, ఆడబిడ్డలు ఆర్దికంగా ఎదిగేందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటారని మంత్రి సీతక్క చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *