– రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హామీ
– మా భూములను ఎర్రవెల్లి సర్వే నం.325లో కలిపారు
– సర్వే చేసి మా భూములు మాకు ఇప్పించండి
– మంత్రి పొంగులేటికి శివారు వెంకటాపూర్ గ్రామస్తుల వేడుకోలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామ రైతులకు న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్‌లో రికార్డుల మార్పులతో తమ తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కోల్పోయామని రైతులు మంత్రికి విన్నవించగా ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన తుమ్మల సత్యనారాయణ, శేరి పోషయ్య, శేరి శ్రీకాంత్, పుట్ట విఠల్, పుట్ట దయానంద్, బచ్చలి జహంగీర్ తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సచివాలయంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శివారు వెంకటాపూర్‌లోని సర్వే నంబర్లు 38, 41, 47, 85, 88, 100లోని దాదాపు 134 ఎకరాల వ్యవసాయ భూముల్లో తమ తాతముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రికార్డులను తారుమారు చేయడం ద్వారా మా భూములపై హక్కులు లేకుండా చేశారని, మా పొలాలు మాకు కాకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి అమలుకు ముందు తమ వద్ద ఉన్న పాస్‌బుక్కులు, గ్రామ నక్షా పటాలను రైతులు మంత్రికి చూపించారు. ఆనాటి అధికారులు కొత్త పాస్‌బుక్కులు ఇస్తామని చెప్పి తమ వద్ద పాత పాస్‌బుక్కులు తీసుకున్నారని, కొత్త పాస్‌బుక్కులు ఇవ్వకుండా తమను మోసం చేశారని వారు వివరించారు. ఆనాటి ప్రభుత్వ హయాంలో ఓవర్ మ్యాపింగ్ పేరుతో శివారు వెంకటాపూర్ గ్రామ వ్యవసాయ భూములను ఎర్రవెల్లిలోని సర్వే నంబర్ 325లో కలిపి నక్షా రూపొందించారని, దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు ఆరోపించారు. ప్రస్తుతం సర్వే నంబర్ 325లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే తరహాలోనే శివారు వెంకటాపూర్ గ్రామంలోనూ సమగ్ర సర్వే నిర్వహించి గ్రామ సరిహద్దులను స్పష్టంగా గుర్తించి రికార్డులు-పాత పాస్‌బుక్కులు-గ్రామ నక్షా-క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎవరికి చెందిన భూమి వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంత్రిని కోరారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన శివారు వెంకటాపూర్ గ్రామ రైతులకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదని మంత్రికి వివరించారు. అలాగే దేవాసుకుంట, ముత్తిలింగం కుంటలను కూడా పాండురంగ రిజర్వాయర్‌లో విలీనం చేశారని తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణం, భూముల మ్యాపింగ్, రికార్డుల మార్పుల కారణంగా తమ గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విన్న మంత్రి పొంగులేటి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం.. ఎవరి భూమి వారికి దక్కేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డి.ఎస్.లోకేష్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





