కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి

– పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్ల‌ను ప‌ట్టించుకోండి
– రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తామ‌ని ప్ర‌భుత్వం మాట త‌ప్పింది
– వ‌యోప‌రిమితి పెంచాలి
– ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ‌ లేఖ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 3:  పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఆశావహుల డిమాండ్లు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి బ‌హిరంగ లేఖ రాసారు.  తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు వంచించబడ్డ తీరును సీఎం దృష్టికి తెచ్చారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు పోటీపడే యువతలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లే ఉంటారు. తల్లిందండ్రులకు దూరంగా ఉంటూ, హైదరాబాద్‌కు వచ్చి ఏళ్ల తరబడి పీజీల్లో, హాస్టళ్లలో ఉంటూ రేయింబవళ్లు కష్టపడి వాళ్లు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతారు. అలాంటి పేద యువత ఆశల మీద నీళ్లు చల్లకుండా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేదే తెలంగాణ ఉద్యమ నినాదం. అలాంటిది నియామకాల విషయంలో.. గత కొన్ని రోజులుగా పోస్టులు పెంచాలని పోరాడుతున్న పోలీస్ నిరుద్యోగ అభ్యర్ధుల డిమాండ్లను పెడచెవిన పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.. కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలకే ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవడం సరైంది కాదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 వేల పోలీసు పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆర్టీఐ ద్వారా బహిర్గతమయింది. స్వయంగా మీరే 12 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో.. కేవలం 5 వేల పోస్టులు భర్తీ చేస్తామనడం సుమారు 15 లక్షల మంది పోలీస్ ఉద్యోగార్థులను నైరాశ్యంలోకి నెట్టేసింది. దిల్‌సుఖ్‌నగర్ లాంటి ప్రాంతాల్లో ప్రతీరోజు నిరుద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో మూడు పర్యాయాల్లో కలిపి సుమారు 47 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం. 2016లో 9,281 కానిస్టేబుల్, 539 ఎస్సై ఉద్యోగాలకు.. 2018లో 18,428 కానిస్టేబుల్, 1,271 ఎస్సై ఉద్యోగాలకు.. 2022లో 16,614 కానిస్టేబుల్, 554 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, పోలీస్ కొలువులు నింపాం. మొత్తంగా కేసీఆర్  హయాంలో 2 లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫై చేయడమే కాకుండా, లక్షా అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.. తెలంగాణ నిరుద్యోగ యువతకు లాభం చేకూరేలా 95% లోకల్ రిజర్వేషన్ కూడా సాధించాం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మబలికింది, ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మాట తప్పింది, నిరుద్యోగ యువతకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసింది.. ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా.. కేవలం 17 వేల కొత్త ఉద్యోగాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన 50 వేల పైచిలుకు ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి, క్రెడిట్ తీసుకోవాలని చూసింది. ఇలాంటి తరుణంలో.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత తీవ్ర అగ్రహంతో ఉన్నారు. వారికిచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ వెంటనే అమలు చేయాలి. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.. పోలీస్ నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్ మేరకు కనీసం 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పేద, మధ్య తరగతి యువతకు న్యాయం చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున, నిరుద్యోగులకు మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తాం. ఈ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగుల తరఫున కొన్ని న్యాయమైన డిమాండ్లను మీ ముందు ఉంచుతున్నాను. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు పోలీస్ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ సిద్ధమవుతున్నారు. కేవలం 5,000 పోస్టులు మాత్రమే ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రస్తుత జీవో నెం. 87 ప్రకారం ఎస్సై అభ్యర్థులకు 35 సంవత్సరాలు, కానిస్టేబుల్ అభ్యర్థులకు 32 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ఉంది. పోలీస్ నోటిఫికేషన్లు వెలువడి దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నందున, వయోపరిమితి దాటిపోతున్న లక్షలాది మంది అభ్యర్థులకు వయోపరిమితిని సడలించడం అత్యంత కీలకం. తదనుగుణంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 37 సంవత్సరాలకు పెంచాలి. ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులు రెండింటికి దాదాపు ఒకే విధమైన ఫిజికల్ టెస్ట్స్ నిర్వహిస్తారు. 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థి ఎస్సై పోస్టుకు శారీరకంగా అర్హత సాధించగలిగినప్పుడు, అదే 35 ఏళ్ల అభ్యర్థికి కానిస్టేబుల్ పోస్టుకు అవకాశం నిరాకరించడం సరైంది కాదు. అందువల్ల కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని పెంచడం శ్రేయస్కరం. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న తెలంగాణ యువత డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ.. 20 వేల పోలీస్ ఉద్యోగాలతో త్వరతగతిన నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఈ బహిరంగ లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *