– గురుకుల టెండర్లలో జీఓ -17 మర్మం
– స్థానిక ఉపాధిపై ‘కేంద్రీకృత’ దెబ్బ
– ‘టర్నోవర్’ రూల్స్ తో చిన్న వ్యాపారుల బహిష్కరణ
– ‘ప్రైవేట్ ‘దిగ్గజాల’ చేతుల్లోకి స్టూడెంట్ల కిట్లు
– సామాజిక న్యాయానికి గండి
– లాటరీ పద్ధతిని తప్పుపట్టిన హైకోర్టు
నిరుపేద విద్యార్థుల పాలిట సంజీవనిలా నిలిచిన గురుకుల వ్యవస్థ ఇప్పుడు తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నది. నాణ్యత, పారదర్శకత పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీవో ఎంఎస్ నంబర్ 17’ సంస్కరణల ముసుగులో బడా కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యానికి రహదారిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 20 వేల మంది స్థానిక చిన్న వ్యాపారులను, మహిళా సంఘాలను టెండర్ల రేసు నుంచి తప్పించి.. పొరుగ రాష్ట్రాల దిగ్గజాలకు ఎర్రకార్పెట్ పరచడం వెనుక ఏకంగా రూ. 2,041 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
(మేకల ఎల్లయ్య, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
రాష్ట్రంలో నిరుపేద విద్యార్థుల పాలిట సంజీవనిలా నిలిచిన గురుకుల వ్యవస్థ ఇప్పు డు తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకుకు న్నది. నాణ్యత, పారదర్శకత పేరుతో ప్రభు త్వం తెచ్చిన జీఓ నంబర్ 17 సంస్కరణల ముసుగులో కార్పొరేట్ గుత్తాధిపత్యానికి రహదారిగా మారిందనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. స్థానిక చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ఉపాధినిచ్చిన వికేంద్రీకృత వ్యవస్థను రద్దు చేసి కఠినమైన టర్నోవర్ నిబంధనలతో సుమారు 20 వేల మంది స్థానిక సరఫరాదారులను రేస్ నుంచి తప్పించారు. పొరుగు రాష్ట్రాల బడా కార్పొరేట్ దిగ్గజాలకు ఎర్ర కార్పెట్ పరచడం వెనుక పెద్ద ఎత్తున ‘క్విడ్ ప్రోకో’ ఒప్పందాలు ఉన్నాయని, సుమారు రూ.2.041 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టెండర్లలో సాగిన అశాస్త్రీయ ‘లాటరీ విధానాన్ని’ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి స్థానిక వ్యాపారులకు 25 శాతం కోటా ఇవ్వాలని స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు యూని ఫారాలు, కనీస వస్తువులు అందకపోవడం ఈ నూతన వ్యవస్థ అసమర్థతకు అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలో జీఓ-17 వెనుక అంతరంగంపై ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక విశ్లేషణ. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్టళ్లు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, గురుకుల విద్యా సంస్థలలోని సు మారు 27 లక్షల మంది విద్యార్థులకు నిత్యావసరాలు, పౌ ష్టికాహారం, దుస్తులు, బూట్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను సరఫరా చేసే కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 17 (తేదీ: 8.7.2025) చుట్టూ ప్రస్తుతం తీవ్ర రాజకీయ, చట్టపరమైన వివాదాలు ముసురుకు న్నాయి. ఒకవైపు ప్రభుత్వం దీనిని పారదర్శకతను పెంచేందుకు, వస్తువుల నాణ్యతను ప్రమాణీకరించేందుకు చేపట్టిన అత్యుత్తమ పరిపాలనా సంస్కరణగా అభివర్ణిస్తుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం దీనిని అవినీతిని కేంద్రీ కరించే సింగిల్ విండోగా ఆరోపిస్తున్నది. ఈ నూతన విధానం వేలాదిమంది చిన్న తరహా స్థానిక వ్యాపారులను పరిధి వెలుపలికి నెట్టివేస్తూ బడా జాతీయ కంపెనీలకు ఎర్ర కార్పెట్ పరుస్తున్నదనే ఆందోళనలు సామాజిక న్యాయ భావనను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో అమల్లో ఉన్న విధానం ప్రకారం గురుకులాలు, హాస్టళ్లకు అవసరమైన నిత్యావసరా లు, కూరగాయలు, గుడ్లు, పాలు, వంట నూనెలు, ఇతర వస్తువుల సేకరణను వికేంద్రీకృత పద్ధతిలో జిల్లా కొనుగోలు కమిటీలు నిర్వహించేవి. ఈ పద్ధతి ద్వారా స్థానిక మార్కెట్లలో లభించే వస్తువులను కొనుగోలు చేయడం వల్ల స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన చిన్న వ్యాపారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున ఉపాధిని పొందగలిగేవి. నూతన జీఓ 17, దాని అనుబంధ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) జూలై 25న జారీ చేసిన కొనుగోలు మార్గదర్శకాల ద్వారా పాత వికేంద్రీకృత వ్యవస్థ రద్దయింది. దీని స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి నిబంధనలతో కూడిన జాతీయస్థాయి టెండర్ విధానం అమల్లోకి వచ్చింది. పోటీని పెంచి, నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే అందించడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ టెండర్ అర్హత కోసం విధించిన కఠినమైన ఆర్థిక నిబంధనలు స్థానిక సరఫరాదారుల పాలిట శాపంగా మారాయి.
వివాదాస్పద ఎంపికలు, తీవ్ర అవినీతి ఆరోపణలు
గురుకులాల విద్యార్థుల కొనుగోలు వ్యయం, కేటాయింపులకు సంబంధించి సంవత్సరానికి మొత్తం విద్యాకిట్ల ప్యాకేజీ కోసం రూ.687.78 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటితో యూనిఫారాలు, షూస్, బెల్టులు, టైలు, ఐడీ కార్డులు, బ్యాగులు, ట్రంక్ బాక్సులు, బెడ్డింగ్ మెటీరియల్తో కూడిన సమగ్ర కిట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. యూనిఫాం వస్త్రాల కోసం 2.97 కో ట్ల మీటర్ల ఫ్యాబ్రిక్ అవసరం ఉంటుంది. ఇందులో మఫత్లాల్ ఇండస్ట్రీస్ కు 2.41 కోట్ల మీటర్లు, టీజీఎస్ ్సవోకు 55.32 లక్షల మీటర్లు కేటాయించారు. 25 శాతం నుంచి 30 శాతం వరకు వాటాను రాష్ట్ర చేనేత సహకార సంస్థకు కేటాయించి, మిగిలిన ప్రధాన వాటాను ప్రైవేట్ దిగ్గజాలకు అప్పగించారు. స్థానిక మహిళా ఉపాధిని పెంపొం దిం చడం కోసం దుస్తులు కుట్టించే బాధ్యతను పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. కుట్టు కూలి కోసం రూ.40 కోట్లు (జతకు రూ.75 వంతున) ఖర్చు అవుతాయని అంచనా. గురుకుల, జూనియర్ కళాశాలల పరిధిలో బెల్టులు, టైలు, ఐడీ కార్డులు సరఫరా చేసేందుకు తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీజీఎలఐపీసీ)కు అప్పగించారు. ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కేటాయింపులు జరిగాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల హాస్టళ్ల అవసరాల కోసం ట్రంక్ పెట్టెల కొనుగోళ్ల కాంట్రాక్టును నిరంజన్ కుమార్ జైన్ (చింతామణి పారస్నాథ్ ప్రొప్రైటర్)కు అప్ప గించారు. ఈ కాంట్రాక్టు ప్రతిపక్షాల నుంచి తీవ్ర నైతిక, చట్టపరమైన అభ్యంతరాలు ఎదుర్కొంటూ వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ నాయకుడు, పూర్వ ఐపీఎస్ అధికారి ఆర్ఎ.స్.ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాలల వస్తువుల సేకరణలో సుమారు రూ.2,041 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఘాటైన ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలు టెండర్ల వెనుక ఉన్న అనుమానాస్పద ఒప్పందాలను వెలుగులోకి తెచ్చాయి. ఆయన ఆరోపణల ప్రకారం గుడ్లు, చికెన్ సరఫరాలో రూ.600 కోట్ల స్కామ్ జరిగింది. చికెన్, గుడ్ల సరఫరా కాంట్రాక్టు దక్కించుకోవడానికి నిబంధనలు సడలిస్తూ ఒకే కాంట్రాక్టర్ కు అవకాశం ఇచ్చేలా మండలస్థాయి టెండర్ల పరిమితులను మార్చారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇందుకోసం రూ.50 లక్షల భారీ ఈఎండీ, రూ.3 కోట్ల వార్షిక టర్నోవర్ ను నిబంధనలుగా పెట్టడంతో సుమారు 20,000 మంది స్థానిక చిన్న వ్యాపారులు పోటీకి పూర్తిగా దూరమయ్యారు. గుడ్డు మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఒక్కో గుడ్డుకు రూ.7 వంతున కొనుగోలు ధరను నిర్ణయించి నష్టాన్ని ప్రభుత్వ ఖజానాపై మోపడం ద్వారా దాదాపు రూ.600 కోట్ల మేర కమీషన్లకు తెరలేపారని ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (టీఎస్ సీవో)ని పక్కనబెట్టి, ఫ్యాబ్రిక్ సరఫరా కాంట్రాక్ట్ ను ప్రైవేట్ సరఫరాదారు రాజేశ్ అగర్వాల్కు కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. డ్రగ్ పెడ్లర్ లింకులు గల కాంట్రాక్టర్లకు పనుల కేటాయించడం సరికాదంటున్నారు. గురుకుల విద్యార్థులకు ట్రంక్ బాక్సుల సరఫరా అతిపెద్ద కాంట్రాక్టును పొందిన ప్రైవేట్ వ్యాపారి నిరంజన్ కుమార్ జైన్ కు నార్కోటిక్స్ కేసులతో సంబంధాలున్నాయని హైదరా బాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేసిన పూర్వపు నివేదికలను ప్రతిపక్షాలు సాక్ష్యాలుగా చూపించాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అంతర్జా తీయ డ్రగ్ పెడ్లర్ టోని కేసులో (సీఆర్ నం.10/2022, యూ/ఎస్8 (సీ) ఆర్/డబ్ల్యూ 20(బీ)( ఐఐ) (సీ) ఆఫ్ ఎన్ డీపీఎస్ యాక్ట్) నిరంజన్ కుమార్ జైన్ నిందితుడిగా ఉన్నారని ప్రస్తావిస్తూ అటువంటి వ్యక్తికి విద్యార్థుల నిత్యావసరాల సరఫరా బాధ్యత అప్పగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గురుకుల వస్తువుల సేకరణ ప్రక్రియను జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే పూర్తి చేసి, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పంపిణీ చేసేవారని విపక్షాలు గుర్తుచే శాయి. నూతన జీవో-17 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన 26 రోజులు దాటినా విద్యార్థులకు యూని ఫారాలు, షూస్, బెడ్షీట్లు, ట్రంక్ బాక్సులు అందకపోవ డం ఈ కేంద్రీకృత వ్యవస్థ అసమర్ధతను ఎత్తి చూపుతున్న ది. ఈ ఆరోపణలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రభు త్వం నిబంధనల ప్రకారమే కేవలం రూ. 674 కోట్ల టెండర్లను ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా పూర్తి చేసిందని సమర్ధించుకున్నారు.
కాంట్రాక్టు విధానంపై హైకోర్టు సీరియస్
గురుకుల కొనుగోళ్లలో నెలకొన్న అవకతవకలు, స్థానిక వ్యాపారుల హక్కుల ఉల్లంఘనను సవాలు చేస్తూ దాఖలై స రిట్ పిటిషన్పై (డబ్ల్యూపీ నంబర్ 25983 ఆఫ్ 2025 -ఎల్.జీ.ట్రేడర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ) తెలంగాణ హైకోర్టు 2025 అక్టోబర్ 31న ఒక సుదీర్ఘమైన, చారిత్రా త్మకమైన తీర్పును ఇచ్చింది. గురుకులాలకు సరఫరా చేసే వస్తువులలో నాణ్యతను సాధించడం కొరకు ఏకీకృత ఉమ్మ కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టే అధికారం ప్రభు త్వానికి ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే పీఎం యూ నిబంధనల పేరుతో చిన్న, మధ్యతరహా కాంట్రాక్ట ర్లను టెండర్లలో పాల్గొనకుండా బహిష్కరించే వివక్షాపూరి త విధానాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వివాదాస్పద అంశాలను చక్కదిద్దడానికి, ప్రభుత్వ కొనుగోళ్లలో పారద ర్శకతను పెంచడానికి హైకోర్టు కొన్ని సవరణలను నిర్దే శించింది. టెక్నికల్ అర్హత సాధించిన వారిలో లాటరీ ద్వా రా పనులను కేటాయించే అశాస్త్రీయ పద్ధతిని పూర్తిగా నిషేధించి, కేవలం మెరిట్, పూర్వ సామర్థ్యం ఆధారంగా నే టెండర్లు కేటాయించాలని ఆదేశించింది. గ్రామీణ ఆర్థి క వ్యవస్థను రక్షించే లక్ష్యంతో, ప్రతి మండలంలో లేదా గురుకుల సంస్థ పరిధిలో కనీసం 25 శాతం సరఫరా యూనిట్లను స్థానిక చిన్న వ్యాపారులకే కేటాయించాలం ది. రూ. 1 కోటి లోపు విలువ గల కాంట్రాక్టులకు గరిష్ట ఈఎండీ 2 శాతానికి మించరాదని, అలాగే వార్షిక టర్నో వర్ పరిమితి ఆ పని అంచనా విలువ కంటే ఎక్కువగా ఉండకూడదన్నది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) లేదా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే ముందస్తు ప్రాధాన్యతలను టెండర్ నోటిఫికేషన్లోనే నిర్దిష్ట శాతంతో స్పష్టంగా ప్రకటించాలన్నది. ప్రతి టెండర్ నోటిఫికేషన్లో అంచనా వేసిన విలువ, వస్తువుల పరిమాణం, గరిష్ట యూనిట్ ధరలను బహిరంగపరచడం తప్పనిసరి అన్నది. టెండర్ దరఖాస్తుదారులు తమ ఫిర్యాదులను నమోదు చే యడానికి, సకాలంలో పరిష్కారాలు పొందడానికి ప్రత్యేక ఆన్లైన్ నిఘా వేదికను నెలకొల్పాలని ఆదేశించింది.
సామాజిక న్యాయంపై దెబ్బ
జీఓ.17 వల్ల కేవలం కాంట్రాక్టుల కేంద్రీకరణ మాత్రమే జరగలేదు. దాని వెనుక ఉన్న సామాజిక, ప్రొక్యూర్మెంట్ తత్వశాస్త్రం కూడా ప్రమాదంలో పడింది.
తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో వెనుకబడిన, దళిత, గిరిజన వర్గాల ఆర్ధిక వికాసం ప్రధానమైన ఆకాంక్ష. ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా వాటిని అమలు చేయకపోగా జీఓ -17 రూపంలో చిన్న కాంట్రాక్టర్ల అవకాశాలను సైతం హరించివేసిందని ప్రతిపక్షాలు సామాజిక చర్చను లేవనెత్తాయి. సాల్వెన్సీ సర్టిఫికెట్ నిబంధనలను రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు పెంచడం వల్ల స్థానిక గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల వ్యాపారులు టెండర్లలో పాల్గొనే ప్రాథమిక అర్హతనే కోల్పోయారు. దీనివల్ల కేవలం గుజరాత్, మహారాష్ట్ర, ఇతర పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్పొరేట్ కంపెనీలు మాత్రమే లబ్ధి పొందుతుండగా, స్థానిక నిధుల ప్రవాహం ఇతర రాష్ట్రాలకు మళ్లిపోతున్నది. మరోవైపు పీఎంయూ తీసుకువచ్చిన ఈ కేంద్రీకృత విధానం వల్ల పోటీ పెరిగిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం ప్రతికూలంగానే కనిపిస్తున్నది. కొన్ని పెద్ద కంపెనీల అర్హతలకు అనుగుణంగానే నిబంధనలు మార్చడం వల్ల నిజమైన పోటీ దెబ్బతిని కొన్ని పరిమిత సంస్థల గుత్తాధిపత్యానికి దారితీసింది. నాణ్యత నియంత్రణకు సంబంధించిన స్వతంత్ర ఆడిట్ నివేదికలను కూడా ప్రభుత్వం బహి ర్గతం చేయకపోవడం అనుమానాలకు మరింత అజ్యం పోస్తున్నది. జీఓ-17 అమలుకు వ్యతిరేకంగా, గురుకులాల కొనుగోళ్లలో అక్రమాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పెద్దఎత్తున రాజకీయ ప్రతిఘటనను ప్రారంభించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





