ప్రత్యర్థుల మీద, ప్రజల మీద బిజెపి మానసిక యుద్ధం!

“ఇది ఒక మానసిక యుద్ధం. ఈ యుద్ధంలో మాటలూ అబద్ధాలూ అతిశయోక్తులూ దుర్భాషలూ ప్రగల్భాలూ ఆయుధాలుగా ఉంటాయి. ఆ ఆయుధాలు ప్రత్యర్థులను ఓడించడానికి సరిపోవన్నమాట నిజమే. కాని వాటికి ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే శక్తి ఉంటుంది. అటువంటి ప్రచారం వల్ల ప్రత్యర్థి శిబిరంలో వ్యక్తుల మధ్య అప్పటికే ఉన్న దూరాలు, అపనమ్మకాలు మరింత పెరుగుతాయి. ప్రత్యర్థి శిబిరంలోని నాయకుల బలహీనతలు బైటపడి, వారిని ఆకర్షించి, పార్టీ ఫిరాయింపజేసే అవకాశం కలుగుతుంది. ‘శత్రువు ఇంట్లో ఒక విస్తరి ఎక్కువ లేచినా లాభమే’ అనే పాత సామెత ఒకటుంది. శత్రువు ఇంట్లో ఒక భోజనం ఖర్చు పెరిగినా అది ఇవతలి పక్షానికి ఆ మేరకు మేలు చేస్తుందని దాని అర్థం..” 

తెలంగాణలో సంఘ్ పరివార్ కు నానాటికీ దగ్గరవుతున్న ఒక ప్రముఖ దినపత్రిక వండి వారుస్తున్న కథనాలు హాస్యాస్పదంగా, ఆసక్తికరంగా, భయావహంగా ఉంటున్నాయి. హాస్యాస్పదం ఎందువల్లనంటే వాటిలో నిజంగా జరిగిన వాస్తవం తక్కువా, ఆ పార్టీనో, ఆ పత్రికో ఆశిస్తున్నది ఎక్కువా ఉంటున్నాయి. ఆసక్తికరం ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికి ఉన్న అధికార, ప్రతి పక్షాలకు తోడు, మరొక ప్రతిపక్షం రావడానికి, అది రెండు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలలో అధికారపక్షం అవుతానని కలలు కనడానికి ఎంత అవకాశం ఉందనే చారిత్రక, సామాజిక ఆసక్తి. ఈ కల్లబొల్లి కబుర్లే కొంపతీసి నిజమవుతాయా, ధిక్కార, ప్రగతిశీల ఆలోచనల తెలంగాణ ఈ నరహంతక తిరోగమన మార్గం పడుతుందా అనే భయం.

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం పెరుగుతున్నదనీ, రానున్న శాసనసభ ఎన్నికలలో విజయం ఆ పార్టీదేననీ ఆ పత్రిక ప్రకటనలూ వార్తలూ ఊహాగానాలూ ఎడాపెడా ప్రచురిస్తున్నది. ‘తెలంగాణలో వందశాతం గెలుస్తాం’ అని అమిత్ షా అన్నాడట. ‘రాష్ట్రంలో బీజేపీ ఆట మొదలైంది’ అని కిషన్ రెడ్డి అన్నాడట. ‘మా పార్టీని తట్టుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదు’ అని బండి సంజయ్ అన్నాడట. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం’ నినాదంతో రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ హోమ్ మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి జె పి నడ్డా పాల్గొంటున్నారు. బీజేపీ తెలంగాణ ఇన్ చార్జి సునీల్ బన్సాల్ బాధ్యత కింద ఉన్న బెంగాల్, ఒడిశా, తెలంగాణలలో తొలి రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చింది, ఇక మిగిలింది తెలంగాణే, అది కూడా సాధిస్తాం అని కూడా అంటున్నారు.

ఒక రకంగా ఇవన్నీ తాటాకు చప్పుళ్లు, ప్రగల్భాలు, ఉత్తరకుమార ప్రజ్ఞలు అని కొట్టి పారెయ్యవచ్చు. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలుంది. ఇప్పటికిప్పుడైనా, రెండు సంవత్సరాల తర్వాతనైనా భారతీయ జనతా పార్టీకి మొత్తం 119 స్థానాలకు పోటీ చేయించడానికి అభ్యర్థులు దొరుకుతారా కూడా అనుమానమే. కాని ఈ వార్తలు సూచించేదేమంటే సంఘ్ పరివార్ సరిగ్గా 2014 కు ముందు కేంద్రంలో చేసినట్టు, 2014 నుంచి ఇప్పటిదాకా దేశమంతా చేస్తున్నట్టు, తెలంగాణలో కూడా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే దుష్ప్రయత్నం మొదలు పెట్టింది అని. ఇది ఒక మానసిక యుద్ధం. ఈ యుద్ధంలో మాటలూ అబద్ధాలూ అతిశయోక్తులూ దుర్భాషలూ ప్రగల్భాలూ ఆయుధాలుగా ఉంటాయి. ఆ ఆయుధాలు ప్రత్యర్థులను ఓడించడానికి సరిపోవన్నమాట నిజమే. కాని వాటికి ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే శక్తి ఉంటుంది.

“దీన్ని నరేటివ్ బిల్డింగ్ అనీ, మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్ అనీ అంటారు. ఆ సినిమా, వ్యాపార, రాజకీయ ప్రముఖులెవరో తెలియదు. వారి పేర్లు రాలేదు. వారితో ఆంతరంగిక సంభాషణలో వాస్తవంగా ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. కానీ ఆంతరంగికంగా ఏమి జరిగిందని బైటి సమాజం అనుకోవాలో పార్టీ ప్రచార యంత్రాంగం నిర్దేశిస్తుంది. అది జరిగినా జరగకపోయినా ప్రజలు అది జరిగిందని అనుకోవాలి. సామాజిక జీవనంలో ప్రభావశీలమైన మనుషులెందరో అమిత్ షాను కలిశారని, వారందరూ తెలంగాణలో భాజపా గెలుపు గురించి మాట్లాడుకున్నారని, అమిత్ షా వ్యక్తం చేసిన ఆత్మవిశ్వాసాన్ని అంగీకరించారని ఒక అభిప్రాయం సమాజంలో వ్యాపించాలన్నదే సంఘ్ పరివార్ లక్ష్యం. ఆ ప్రముఖుల అభిమానులు, వారి తెలివి మీద గౌరవం ఉన్నవారు కూడా ఆ అభిప్రాయాన్ని ఔదల దాలుస్తారు..”  

అటువంటి ప్రచారం వల్ల ప్రత్యర్థి శిబిరంలో వ్యక్తుల మధ్య అప్పటికే ఉన్న దూరాలు, అపనమ్మకాలు మరింత పెరుగుతాయి. ప్రత్యర్థి శిబిరంలోని నాయకుల బలహీనతలు బైటపడి, వారిని ఆకర్షించి, పార్టీ ఫిరాయింపజేసే అవకాశం కలుగుతుంది. ‘శత్రువు ఇంట్లో ఒక విస్తరి ఎక్కువ లేచినా లాభమే’ అనే పాత సామెత ఒకటుంది. శత్రువు ఇంట్లో ఒక భోజనం ఖర్చు పెరిగినా అది ఇవతలి పక్షానికి ఆ మేరకు మేలు చేస్తుందని దాని అర్థం. మానసిక యుద్ధపు ప్రధాన లక్ష్యం అదే. ప్రత్యర్థి శిబిరంలోని వారి మనసులు కకావికలు చేయాలి. ప్రత్యర్థి శిబిరంలో కొందరు బలహీన మనస్కులలోనైనా తమ ఉనికి గురించి, భవిష్యత్తు గురించి అనుమానాలు రేకెత్తించాలి. అవతలి పక్షమే గెలుపు సాధించబోతున్నదేమో, ఇక్కడే ఉంటే నా పుట్టి మునుగుతుంది, కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని అవతలికి దూకెయ్యడం ఉత్తమం అని  ప్రత్యర్థి శిబిరంలో బలహీనులూ, ఆశపోతులూ, దురాశాపరులూ అనుకునేలా చేయాలి. అలా ప్రత్యర్థి పక్షం బలహీన పడుతుంది.

మానసిక యుద్ధానికి అటువంటి ప్రత్యక్ష వ్యూహమే కాక, అంతకన్నా ముఖ్యమైన పరోక్ష వ్యూహం కూడా ఉంటుంది. మామూలుగా ఎప్పుడయినా సమాజంలో వైరి పక్షాల శిబిరాల్లో విధేయులైన జనసంఖ్య పెద్దగా ఉండదు. ఎక్కువలో ఎక్కువ అటు ఇరవై శాతం, ఇటు ఇరవై శాతం అటూ ఇటూగా ఉంటారు. వారు కాక అరవై శాతం మంది ఎటూ తేల్చుకోలేని స్థితిలో, తటస్థంగా, గోడ మీద పిల్లి వాటంగా, ఎటు దూకితే ప్రయోజనం అని లెక్కలు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉండేవాళ్లుంటారు. వారిలో ఎందరిని ఎట్లా ఆకట్టుకోగలం, లాక్కోగలం, లాక్కోవడానికి సామ దాన భేద దండోపాయాలలో ఏది ప్రయోగించగలం అని ఇరువైపుల వ్యూహకర్తలూ ఆలోచిస్తుంటారు. ఆ అరవై శాతం లోంచి పదో, ఇరవయో శాతం కొల్లగొట్టగలిగిన వారినే గెలుపు వరిస్తుంది. మానసిక యుద్ధ వ్యూహపు లక్ష్యమంతా ఈ తటస్థులను ఆకర్షించడం ఎలా అనే ప్రశ్న చుట్టే తిరుగుతుంది.

తెలంగాణలోనైతే భారతీయ జనతా పార్టీని, సంఘ్ పరివార్ ను నమ్మేవారి సంఖ్య చాలా తక్కువ అని వారి నాయకత్వానికి కూడా తెలుసు. కాని ఆ సంఖ్య పెంచుకోవాలంటే, తటస్థుల మనసు గెలుచుకోవాలంటే, ‘ఏమో వీరే వస్తారేమో’ అనే అనుమాన బీజం నాటాలి. ఆ బీజం క్రమక్రమంగా మహా వృక్షమవుతుంది. ఆ మహావృక్షపు కొమ్మల మీద అబద్ధాల కోతులు శాఖాచంక్రమణాలు చేస్తాయి. నిన్నటి దాకా తటస్థులుగా ఉన్నవారు, తమను తాము తటస్థులమని అనుకున్నవారు, సంఘ్ పరివారమే గెలిచే శక్తి అనే నిర్ణయానికి వస్తారు. న్యాయం పక్షాన, సత్యం పక్షాన, ప్రజల పక్షాన ఉండేవారి కంటే గెలిచేవారి పక్షాన ఉండాలని అనుకోవడం ఒక సహజమైన మానవ బలహీనత. విశ్వాసం ముఖ్యమా, బోయినం ముఖ్యమా అనే ప్రశ్న అడిగించి బోయినమే ముఖ్యమని వీరబొబ్బిలి చేత చెప్పించారు కె ఎన్ వై పతంజలి. మానసిక యుద్ధ నిపుణుడు గోబెల్స్ ఒకే అబద్ధం పదే పదే చెప్పు, అసాధారణం అనిపించే అబద్ధం చెప్పు, అది నిజమనిపించడానికి అందులో చిటికెడు నిజం కలుపు, అబద్ధమే నిజంగా ఊరేగుతుంది అన్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అక్షరాలా నమ్మే సిద్ధాంతం అది.

“రాష్ట్ర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని భారతీయ జనతా పార్టీ 3ఎం విధానాన్ని అనుసరించాలని నిర్ణయిందట. అంటే మున్నూరు కాపు, ముదిరాజ్, మాదిగ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే సోషల్ ఇంజనీరింగ్ అట. ఈ ఊహాగానం రాసినవారు, రాయించినవారు ఈ మూడు సామాజికవర్గాలను సంఘ్ పరివార్ గొడుగు కిందికి తేవాలనే వ్యూహం రచిస్తున్నట్టున్నారు. నిజానికి ఈ మూడు కులాల మొదటి అక్షరాలు ఎం తో ఉండడం తప్ప వాటి మధ్య మరే సంబంధమూ, పోలికా లేదు..”

తెలంగాణలో ఈ మానసిక యుద్ధం ఇప్పుడు పూర్తిస్థాయిలో మొదలయినట్టే కనబడుతున్నది. ఈ యుద్ధాన్ని సహజంగానే సర్వ సైన్యాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించాడు. ఇటీవల ఆయన నగరానికి వచ్చినప్పుడు సినిమా, వ్యాపార, రాజకీయ ప్రముఖులతో విడివిడిగానూ, సామూహికంగానూ కలిశాడట. సాధారణంగా పరస్పర యోగ క్షేమాలు, ఆయా రంగాల పని తీరు మాత్రమే చర్చకు వచ్చే చోట, ఈ భేటీలన్నిట్లోనూ అమిత్ షా రాజకీయాలు మాట్లాడాడట. “ఈసారి గెలుస్తున్నాం, అందులో ఎలాంటి సందేహం లేదు” అన్నాడట. “అంత నమ్మకంగా, గట్టిగా చెప్పడంపై పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోందట”! కార్యకర్తలను ఉద్దీపింపజేయడానికి అటువంటి మాటలు అనడం రాజకీయ నాయకులందరికీ అలవాటే గాని, అవే మాటలు జ్ఞానేష్ కుమార్ నూ, ఎన్నికల కమిషన్ నూ గుప్పెట్లో పెట్టుకున్న అమిత్ షా అంటున్నప్పుడు పూర్తిగా భిన్నమైన అర్థాలు వినబడతాయి.

దీన్ని నరేటివ్ బిల్డింగ్ అనీ, మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్ అనీ అంటారు. ఆ సినిమా, వ్యాపార, రాజకీయ ప్రముఖులెవరో తెలియదు. వారి పేర్లు రాలేదు. వారితో ఆంతరంగిక సంభాషణలో వాస్తవంగా ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. కానీ ఆంతరంగికంగా ఏమి జరిగిందని బైటి సమాజం అనుకోవాలో పార్టీ ప్రచార యంత్రాంగం నిర్దేశిస్తుంది. అది జరిగినా జరగకపోయినా ప్రజలు అది జరిగిందని అనుకోవాలి. సామాజిక జీవనంలో ప్రభావశీలమైన మనుషులెందరో అమిత్ షాను కలిశారని, వారందరూ తెలంగాణలో భాజపా గెలుపు గురించి మాట్లాడుకున్నారని, అమిత్ షా వ్యక్తం చేసిన ఆత్మవిశ్వాసాన్ని అంగీకరించారని ఒక అభిప్రాయం సమాజంలో వ్యాపించాలన్నదే సంఘ్ పరివార్ లక్ష్యం. ఆ ప్రముఖుల అభిమానులు, వారి తెలివి మీద గౌరవం ఉన్నవారు కూడా ఆ అభిప్రాయాన్ని ఔదల దాలుస్తారు.

కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతల నుంచి సమాచారం తీసుకుంటున్నప్పటికీ, వారి మీద ఆధారపడకుండా కేంద్ర హోమ్ శాఖకు చెందిన నిఘా వర్గాలను, ఇతర రాజకీయ వ్యూహకర్తలను రాష్ట్రంలో మోహరించిందట. వారు మేధావులను, విద్యావేత్తలను, పర్యావరణవేత్తలను కలిసి సమాచారం సేకరించి, నేరుగా అమిత్ షాకు పంపిస్తున్నారట. వంద శాతం గెలుస్తాం అన్న మాటలో ఎంత నిజముందో గాని, సంఘ్ పరివార్ ప్రచారం చెయ్యదలచుకున్న ఈ వార్తలలో మాత్రం వంద శాతం అబద్ధం ఉండవచ్చు. ఈ మాటలన్నీ వారి సృష్టే కావచ్చు. ఏమీ లేని చోట, ఎంతో కొంత ఉన్నచోట చాలా చాలా ఉందని, తమకు తెలియనిదేదో జరిగిపోతున్నదని అమాయకులను బురిడీ కొట్టించడమే ఈ వార్తా కథనాల లక్ష్యం.

ఎన్నికల బరిలోకి ఒంటరిగానే దిగుతాం అనే మేకపోతు గాంభీర్య ప్రకటన ఒకటి. ఎలాంటి పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్తాం అని చెప్పడం కూడా వారికి లేని బలం ఉన్నట్టుగా నమ్మించి తటస్థంగా ఉన్నవారిని ప్రభావితం చేసే వ్యూహంలో భాగమే. అలా ఒంటరిగా చేస్తాం అని ఒకవైపు అంటూనే, ఇతర పార్టీల నుంచి జిల్లాకు ఒక బలమైన నాయకుడిని తీసుకుంటామని, అన్ని సామాజిక వర్గాల నేతలను పార్టీ వైపు ఆకర్షిస్తామని కూడా లీకులు ఇస్తున్నారు. అంటే ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని సందేశం పంపడం. ఆయా జిల్లాల్లో, సామాజిక వర్గాల్లో ఇతర పార్టీల్లో తమకు సముచిత స్థానం దక్కలేదని కినుకతో ఉన్నవారందరికీ ఎరవేయడం అన్నమాట.

రాష్ట్ర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని భారతీయ జనతా పార్టీ 3ఎం విధానాన్ని అనుసరించాలని నిర్ణయిందట. అంటే మున్నూరు కాపు, ముదిరాజ్, మాదిగ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే సోషల్ ఇంజనీరింగ్ అట. ఈ ఊహాగానం రాసినవారు, రాయించినవారు ఈ మూడు సామాజికవర్గాలను సంఘ్ పరివార్ గొడుగు కిందికి తేవాలనే వ్యూహం రచిస్తున్నట్టున్నారు. నిజానికి ఈ మూడు కులాల మొదటి అక్షరాలు ఎం తో ఉండడం తప్ప వాటి మధ్య మరే సంబంధమూ, పోలికా లేదు. రాష్ట్రంలో కుల గణన గణాంకాల ప్రకారం, అత్యధిక జనాభా ఉన్న పది కులాల వరుసలో 10.3 శాతంతో మాదిగ మొదటి స్థానంలో ఉండగా, 7.4 శాతంతో ముదిరాజ్ మూడో స్థానంలో, 3.9 శాతంతో మున్నూరు కాపు తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఈ 1 ప్లస్ 3 ప్లస్ 9 లేదా 10.3 ప్లస్ 7.4 ప్లస్ 3.9 మొత్తం 21.6 శాతం ఏమి లెక్క? వారిలోనైనా అందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతారని హామీ ఏమీ లేదు. మున్నూరు కాపు కన్నా ఎక్కువ మంది ఉన్న షేఖ్ ముస్లిం అనే సామాజిక వర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఎలాగూ పక్కన పెడుతుంది. కాని ఆ వరుసలోనే ఉన్న లంబాడా, యాదవ, రెడ్డి, గౌడ్, మాల కులాలను ఎందుకు వదులుతున్నట్టు? ఇంతకీ మనుస్మృతిని నమ్మే, ఆచరణలోకి తేదలచుకున్న సంఘ్ పరివారానికీ, మనుస్మృతి అణచివేసిన 3ఎం కూ పొంతన కుదరడం సాధ్యమేనా?

అయితే పత్రికల ద్వారా జరిగే మానసిక యుద్ధం ప్రభావం ఎంత అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇది కేవలం పత్రికా పాఠకులను ఉద్దేశించిన వ్యూహం కాదు, పత్రికల ద్వారా చాపకింద నీరులా సమాజమంతా వ్యాపింప జేయదలచుకున్న విష ప్రచారం ఇది. ఇది అల్లుకోవడానికి రెండు సంవత్సరాల సమయం ఉంది.

తస్మాత్ జాగ్రత్త, తెలంగాణా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *