– అనర్హతపై ఉత్కంఠ
– నాగేందర్ కేసు తీర్పుతో తెరపైకి శ్రీహరి వ్యవహారం
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: దానం నాగేందర్ విషయంలో కోర్టు తీర్పు వచ్చింది.. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. తర్వాత ఎవరు? కడియం శ్రీహరినా? మిగిలిన ఎమ్మెల్యేల సంగతేంటి?” రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎందుకంటే దానం వ్యవహారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే పదవితో ముగిసిపోయే అంశం కాదు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఎమ్మెల్యేల కేసుల్లోనూ ఇప్పుడు న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న.. ఎన్నికలప్పుడు ఒక పార్టీ గుర్తు…గెలిచాక మరో పార్టీ వైపు ప్రయాణం…కానీ ఎమ్మెల్యే పదవి మాత్రం అదే.
ఇది రాజకీయాల్లో వచ్చిన కొత్త ప్యాకేజీనా?
ప్రజలు వోటేసింది వ్యక్తిని చూసా? పార్టీని చూసా? గుర్తును చూసా? లేక గెలిచిన తర్వాత మీకు నచ్చిన పార్టీని ఎంచుకోమని ఓటేశారా? ఇదే అసలు చర్చ. దానం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడా ఉపశమనం లభించలేదు. సుప్రీంకోర్టులో జరిగిన వ్యాఖ్యే ఆసక్తికరం. న్యాయస్థానంలో దానం వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ‘ఆయా రామ్, గయా రామ్, ఫిర్ ఆయా రామ్ ‘ అంటూ జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి వ్యాఖ్యానించారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ వర్సెస్ షేర్ మార్కెట్
మరో వ్యాఖ్య ఇంకా ఆసక్తికరం.. ఎమ్మెల్యే పదవిని ఫిక్స్‌డ్ డిపాజిట్ ”తో, ఎంపీ ప్రయత్నాన్ని షేర్ మార్కెట్‌తో తో పోలుస్తూ కోర్టులో సరదా వ్యాఖ్య కూడా వచ్చింది. రాజకీయ పరిస్థితిని ఇంతకంటే సర్కాస్టిక్‌గా మనం ఏమని చెప్పగలం? ఎమ్మెల్యే పదవి ఫిక్స్‌డ్ డిపాజిట్.. ఎంపీ టికెట్ షేర్ మార్కెట్.. పార్టీ మారడం పోర్ట్‌ఫోలియో డిసర్సిఫికేషన్ అనుకోవాలా? కానీ ప్రజాస్వామ్యం ఇన్‌వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో కాదు. ప్రజలు వేసిన వోటు పొలిటికల్ ఇన్‌వెస్ట్‌మెంట్ కాదు.. అది ఐదేళ్లపాటు ఇచ్చిన ప్రజాస్వామ్య బాధ్యత.
– కడియం పరిస్థితి ఏంటి? – 8-9 ఉప ఎన్నికలు వస్తాయా?
రాజకీయ వర్గాలు, పార్టీ కేడర్‌లో ప్రస్తుతం ఒకటే చర్చ కడియం శ్రీహరి పరిస్థితి ఏంటి? పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతుంది అనే విషయంపై. దానం కేసు తీర్పు తర్వాత ప్రతి కేసూ అదే ఫలితంతో ముగుస్తుందని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేపై ఉన్న ఆరోపణలు, ఆధారాలు, వారి చర్యలు, స్పీకర్ ముందు జరిగిన విచారణ- అన్నీ విడివిడిగా న్యాయపరంగా పరిశీలించాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో రాజకీయ శిబిరంతో బహిరంగంగా కొనసాగితే ప్రజలు ఇచ్చిన మాండేట్ పరిస్థితి ఏమిటి? ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న 8–9 ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఇప్పుడే వస్తాయి అని ప్రకటించడం తొందరపాటు. ఎందుకంటే ఒక్కో ఎమ్మెల్యే విషయంలో న్యాయ ప్రక్రియ పూర్తవ్వాలి. అనర్హత నిర్ణయం వస్తేనే సంబంధిత స్థానం ఖాళీ కావడం, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ వంటి అంశాలు ముందుకొస్తాయి. అందుకే సోషల్ మీడియాలో వినిపిస్తున్న 8–9 ఉప ఎన్నికలు ఖాయం అనే మాటను ప్రస్తుతం రాజకీయ చర్చ లేదా ఊహాగానంగానే చూడాలి. కానీ దానం తీర్పు తర్వాత ఒక విషయం మాత్రం మరింత ప్రధానంగా ముందుకొచ్చింది. పార్టీ ఫిరాయింపు అనేది కేవలం పార్టీ అంతర్గత వ్యవహారమా?లేక ప్రజలు ఇచ్చిన తీర్పును మార్చే అంశమా? ఇక్కడ పార్టీల పేర్లు పక్కన పెడదాం. ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లొచ్చు. రేపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లొచ్చు. మరో రోజు బీజేపీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్లొచ్చు. ఎవరు చేసినా ప్రశ్న ఒక్కటే. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటే నా రాజకీయ నిర్ణయం మారింది అని చెప్పండి. అది మీ హక్కు. కానీ ప్రజల దగ్గరకు మళ్లీ వెళ్లి ఇప్పుడు నేను ఈ పార్టీ తరఫున ఉన్నాను.. మళ్లీ నన్ను ఎన్నుకుంటారా అని అడగడంలో తప్పేముంది. అప్పుడు ప్రజలే తీర్పు చెబుతారు.
అదే అసలైన ప్రజాస్వామ్య పరీక్ష
ఎన్నికల సమయంలో పార్టీ గుర్తు ఒకటి… గెలిచిన తర్వాత కండువా మరొకటి… అసెంబ్లీలో సభ్యత్వం మాత్రం పాతదే… అంటే ఓటరుకు చివరకు మిగిలేది ఏమిటి? ఓటు వేసే హక్కు మాత్రమేనా?తాను వేసిన ఓటుకు విలువ ఉండాలనే హక్కు లేదా? దానం నాగేందర్ కేసుతో ఒక అధ్యాయం ముగిసింది. కానీ తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు అందరి చూపు—కడియం శ్రీహరి సహా మిగిలిన కేసులపై కోర్టుల్లో ఏం తేలుతుంది? ఎవరిపై అనర్హత వస్తుంది? ఎవరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు? నిజంగా మరిన్ని ఉప ఎన్నికలకు పరిస్థితి దారితీస్తుందా? వీటికి సమాధానం రాబోయే న్యాయపరమైన పరిణామాలే చెప్పాలి. కానీ ప్రజలు మాత్రం ఒక ప్రశ్న అడగవచ్చు “మా ఓటుతో గెలిచారు సరే…మా అనుమతి లేకుండా మా ఓటు ఇచ్చిన రాజకీయ గుర్తింపునే మార్చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే ఇప్పుడు చర్చ జరగాల్సిన అసలు విషయం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





