‘వరల్డ్ పీపుల్స్‌’తో భారత్-రష్యా బంధాలు మరింత బలోపేతం

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : స్వాతంత్య్రానంతరం భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి, ఉక్కు కర్మాగారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో అప్పటి సోవియట్ యూనియన్ అందించిన సహకారం చిరస్మరణీయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. భారత్-రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహం పరస్పర విశ్వాసం, గౌరవం, సహకారానికి ఇది నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని ఆ సంస్థ హెడ్ డాక్టర్ రాయల నీతునాయుడుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల భావనకు కూడా సోవియట్ రాజ్యాంగం ప్రేరణగా నిలిచిందని గుర్తు చేశారు. రక్షణ, విజ్ఞానం, అంతరిక్షం, సాంకేతికత, ఇంధనం, విద్య వంటి అనేక రంగాల్లో భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. మహిళలకు రాజకీయ, సామాజిక జీవితంలో సముచిత స్థానం కల్పించడంలో రష్యా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సీతక్క చెప్పారÁT. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పన, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యాలయం ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యాపారం, పర్యాటకం, సంస్కృతి, పరిశోధన, ఆవిష్కరణలు, ప్రజల మధ్య పరస్పర సహకారం వంటి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చారిత్రక వారసత్వంతోపాటు సాంకేతిక రంగంలో ప్రపంచ గుర్తింపు పొందిన నగరమని పేర్కొన్న ఆమె ఈ కార్యాలయం భారత్-రష్యా ప్రజల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంపొందించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్నేహం, శాంతి, అభివృద్ధి, సాంస్కృతిక అవగాహనకు దోహదపడే ప్రతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *