ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జిపై రాకపోకలు

– కోతకు గురవ్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం
– వ్యవసాయ  శాఖ  మంత్రి తుమ్మల

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి దేశ విదేశాల నుండి భక్తులు లక్షల మంది వస్తూ ఉంటారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యం కోసం రెండవ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామ‌ని వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత వరదల సమయములో రెండో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోతకు గురైన విష‌యం విదిత‌మే. ఈ రోడ్డు పున‌ర్నిర్మాణ‌ పనులను ఆయన బుధవారం పరిశీలించి అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగవంతం చేసి ఈ నెలలో బ్రిడ్జిపై రాకపోకలు పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు దేశ విదేశాల నుండి భక్తులు రామయ్య దర్శనానికి వస్తూ ఉంటారని, అలాగే ముఖ్యమైన గోదావరి పుష్కరాలు, ముక్కోటి, శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా భక్తులు అధికంగా వ‌స్తుంటార‌న్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని 2015 లో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ సమస్యలు రావడంతో అమరావతి టు జగదల్పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండవ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రారంభించిన‌ట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం పనులు నత్తనడకగా సాగాయని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూసామని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రెండవ బ్రిడ్జి అందుబాటులో ఉంటుందని అన్నారు. వరదలు ఎన్ని వచ్చినా అప్రోచ్ రోడ్డు కోతకు గురవకుండా పక‌డ్బందీగా రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని, ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేసి రెండవ బ్రిడ్జిపై రాకపోకలు జరిగేలా చూస్తామని అన్నారు. రెండవ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గడ్, ఒడిస్సా వయా భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా మారుతుంద‌న్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *