మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారత్‌

సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్తున్న
మహిళల స్ఫూర్తి గొప్పది
•దేశ అభివృద్ధిలో వీరి భాగస్వామ్యం ఉండాలి..
•మహిళా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 :  మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్తున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం మనదేశమేనని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బిజెపి నగర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళల సమస్యలను అధిగమించి, మహిళా సమాజాన్ని ఎలా ప్రోత్సహించాలనే అంశంపై ప్రపంచం ముందుకు వెళ్తోందన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని చెప్పారు. ఫైటర్‌ ‌విమానాలు నడపడంలో, పైలట్లుగా, స్పేస్‌ ‌టెక్నాలజీ రూపకల్పనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యాంకుల్లో, పోలీసు రంగంలో, రెవెన్యూ, ఉపాధ్యాయులుగా, ఐటీ రంగంలో ఇలా ఏ రంగంలో చూసినా మహిళలు చాలా నమ్మకంతో, ధైర్యంతో, అంకిత భావంతో పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో లక్షలాది మంది ఆడబిడ్డలు ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏ రంగంలో కూడా వివక్ష ఉండొద్దని ఆర్మీలో కూడా మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం కల్పించారు.

భగభగ మండే ఎండలో, ఎముకలు కొరికే చలిలో కూడా దేశ సరిహద్దుల్లో ఏకే 47 పట్టుకుని మహిళా జవాన్లు పహారా కాస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందుండాలనే ఉద్దేశంతో వార్డు మెంబర్‌ ‌నుంచి పార్లమెంటు సభ్యుల వరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని మోదీ నడుం బిగించారు. ఏ కాంగ్రెస్‌ ‌ప్రధాని కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ధైర్యం చేయలేదు. మోదీ మాత్రమే లోక్‌ ‌సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు తీసుకొచ్చి ఆమోదింపజేశారు. అన్ని విషయాల్లో కూడా ప్రధాని మోదీ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు డ్రోన్‌ ‌దీదీ పథకం ద్వారా డ్రోన్లను అందించారు. రాజకీయ నాయకుల వోటు బ్యాంకు రాజకీయాల కారణంగా ముస్లిం మహిళలకు అనేక హక్కులు ఉండేవి కావు. ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌ను రద్దు చేసే ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేదు. కానీ నరేంద్ర మోదీ మాత్రం ధైర్యంగా రద్దు చేసి ముస్లిం మహిళల కళ్లల్లో ఆనందం చూశారు. దేశం గర్వించదగ్గ శ్రా‌వేత్త  అబ్దుల్‌ ‌కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది. మరో సారి రాష్ట్రపతిని  చేయాల్సిన అవకాశం వొచ్చినప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌ను, మూడోసారి గిరిజన మహిళను దేశ రాష్ట్రపతిగా చేసిన ఘనత నరేంద్ర మోదీది.

మహిళలు ఎవరూ భయపడొద్దని, గట్టిగా నిలబడాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. ఆడ బిడ్డలందరికీ అండగా నిలబడతానని ఆయన మాటిచ్చారు. వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తున్నారు. దేశంలో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఉగ్రవాదం అనే మాట వినిపించట్లేదు. దేశం మొత్తం శాంతి భద్రతలు ఉన్నాయి. ఆయన వొచ్చిన తర్వాత జమ్మూ, కశ్మీర్‌ ‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారు. 370 అధికరణ తీసేశాం. ఎలాంటి ఘర్షణ లేకుండా అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నాం. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఆత్మ నిర్భరత సాధించాలంటే మహిళలు కీలక పాత్ర పోషించాలి. 2047 నాటికి దేశంలోని ప్రతి మహిళకు సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉంది.

మహిళలు కూడా అభివృద్ధి చెందితేనే 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్‌గా మారుతుంది. మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రతి మహిళకు ఉచితంగా గ్యాస్‌ ‌కనెక్షన్‌ అం‌దించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీది. దేశంలోని మహిళల సాధికారతను మరింత పెంచేలా, దేశ ధర్మాన్ని కాపాడే శక్తిని నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కోరారు. బస్తీల్లో పొదుపు సంఘాలను ప్రోత్సహించే దిశగా మహిళా మోర్చా కార్యకర్తలు కృషి చేయాలని,  పొదుపు సంఘం అంటే ఆత్మ విశ్వాసం అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *