– ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’
– నిర్జల ఏకాదశి పర్వదినంతో కర్ర పూజ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25:ఖైరతాబాద్ బడా గణేశుడి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గురువారం సాంప్రదాయబద్ధంగా కర్ర పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నాడు. విగ్రహానికి ఓ వైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ జరగనుంది. ఈ ఏడాదితో ఖైరతాబాద్‌లో బడా గణేషుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ పూజా కార్యక్రమం అనంతరం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ ఏడాది కొలువుదీరనున్న వినాయకుడి నమూనా పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. రాబోయే వినాయక చవితి పండుగ నాటికి, అంటే కేవలం 82 రోజుల్లోనే అన్ని హంగులతో కూడిన 70 అడుగుల భారీ మహా గణపతి విగ్రహాన్ని పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న యుద్దాలు సమసిపోయి, శాంతి చేకూరాలనే సంకల్పంతో ఈ సారి ఖైరతాబాద్ గణేషుడిని ‘పంచముఖ సంకట హార మహా గణపతి‘ రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ భారీ విగ్రహానికి కుడి వైపున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగం రూపాన్ని, ఎడమ వైపున భక్తులను రక్షించే కాళికామాత విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. లోకకల్యాణార్థం కొలువుదీరనున్న ఈ పంచముఖ గణపతి విశేష రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.