– ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
– విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోపై స్టే
– ప్రైవేట్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: హైకోర్టులో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.9లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. మంగళవారం వరకు స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు. మీరు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల నుంచి యాజమాన్యాలు వసూలు చేయొద్దంటే కళాశాలను వారు ఎలా నడుపుతారు? రీయింబర్స్‌మెంట్ కోసం ఎంత బ్జడెట్ కేటాయించారు? పెండింగ్ బకాయిలు ఎప్పటిలోపు చెల్లిస్తారు అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఆగస్ట్ 15లోపు బకాయిలు చెల్లిస్తామని బదులిచ్చారు. అలా జరిగితే తమ పిటిషన్లు కూడా వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కళాశాలల తరఫు న్యాయవాది చెప్పారు. ఇదే అంశంలో విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అటు ప్రభుత్వం, ఇటు కళాశాలల యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారన్నారు. ఈ బకాయిలతో విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోర్టును కోరారు. అడ్వకేట్ జనరల్ వాదనలు మంగళవారం వినిపిస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.