దివిటిపల్లిలో రూ. 3,225 కోట్లతో గిగా ఫ్యాక్టరీ -1
•సుమారు 4,500 మందికి ఉపాధి వకాశాలు
•శంకుస్థాపన చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
•హాజరైన రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, మార్చి 8 : పాలమూరు జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ‘‘అమరరాజా గిగా ఫ్యాక్టరీ -1’’, ‘‘ఆల్టిమిన్ ప్రైవేట్ లిమిటెడ్’’, ‘‘లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్’’, ‘‘ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’’ ప్లాంట్లకు కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ డీకే అరుణ తో కలిసి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. స్టీల్, రసాయనాలు మాదిరిగా బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై సరికొత్త పరిశోధనలు చేయాల్సిన ఉందని అన్నారు. అమరరాజా గిగా ఫ్యాక్టరీ -1 కు దివిటిపల్లి లో శంకుస్థాపన ఒక ముందడుగు అని తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘‘పుష్ప.. తగ్గేదేలే అని డైలాగ్‌ను ప్రస్తావిస్తూ దివిటిపల్లి అభివృద్ది ఆగదని చెప్పారు. దివిటిపల్లి రైల్వేస్టేషన్‌ను ఆధునీకరణ చేయనున్నట్లు వెల్లడించారు.
పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రకు కలిపి రైల్వే బడ్జెట్‌లో రూ.886 కోట్లు కేటాయిస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం ఒక్క తెలంగాణలో రైల్వేకు 6 రెట్లుగా రూ. 5337 కోట్ల బడ్జెట్ కేటాయించిందని పేర్కొన్నారు. భవిష్యత్ అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్టేషన్ ఆధునీకరణకు మంచి డిజైన్ రూపొందించాలని ఆర్కిటెక్ట్ లను, కలెక్టర్ ను కోరారు. అమరరాజ కంపెనీలో 80 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పి డి.జానకి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపి. డికె.అరుణ, మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ మహిళా సంక్షేమం కు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 11ఏళ్లలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల వంట గదుల్లో కట్టెల పొయ్యిలకు బదులుగా గ్యాస్ కనెక్షన్లు, 14 కోట్ల గృహాలకు తాగు నీటి సరఫరా, 13 కోట్ల టాయిలెట్ల నిర్మాణం, 54 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవగా.. అందులో సగం మహిళల పేరున ఖాతాలు తెరిచినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
సెమీ కండక్టర్స్ పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలి : మంత్రి శ్రీధర్‌బాబు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పారిశ్రామికవేత్తలకు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. . ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాలని కోరారు సెమీ కండక్టర్స్ పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి తెలంగాణ అనుకూలంగా ఉందని. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవ తీసుకుని తెలంగాణ లో సెమీ కండక్టర్స్ పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు పారిశ్రామికాభివృద్ధి లో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు ప్రత్యేకంగా తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) కోసం భూములు త్యాగం చేసిన రైతులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ క్లస్టర్ ను మరింత అభివృద్ధి చేసి. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తామని అన్నారు. తెలంగాణలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మా లక్ష్యం. పరిశ్రమలను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా… అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని అన్నారు.
సుమారు 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధి : గల్లా జయదేవ్
అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను తెలంగాణలో 262 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని, పదేళ్లలో రూ. 9,852 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్’’ చైర్మన్ గల్లా జయదేవ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని తెలిపారు ఇప్పటికే రెండు యూనిట్లు నిర్మాణంలో ఉండగా, తాజాగా రూ. 1,900 కోట్లతో మూడో యూనిట్ నిర్మాణానికి శనివారం భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
‘‘ఆల్టిమిన్ ప్రైవేట్ లిమిటెడ్’’ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్‌ఎఫ్ పీ) టెక్నాలజీ ఆధారంగా బ్యాటరీలు, ఇతర కీలక పదార్థాలను ఉత్పత్తి చేయనుంది. దివిటిపల్లిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 800 కోట్ల వ్యయంతో మూడేళ్లలో రెండు దశల్లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి కానుంది. సుమారు 300 మందికి ఉపాధి లభిస్తుంది. లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్’’ దివిటిపల్లిలో 20 ఎకరాల విస్తీర్ణంలో… రూ. 502 కోట్ల వ్యయంతో వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఐదేళ్లలో రెండు దశల్లో విస్తరించనున్న ఈ పరిశ్రమకు ఏడాదికి 12.50 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉంది. సుమారు 120 మందికి ఉపాధి లభించనుంది.
‘‘సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’’క్యాన్స్, క్యాప్స్ తయారీ సంస్థ. ఇది నికెల్ పూతతో స్టీల్ క్యాన్లు, లిథియం అయాన్ సెల్స్ కోసం క్యాప్స్ ను ఉత్పత్తి చేయనుంది. రూ.23 కోట్ల వ్యయంతో 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ ద్వారా 150 మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పి .డి.జానకి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎంపి డికె.అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, టిజిఐఐసి విసి అండ్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పరిశ్రమల శాఖ జి.ఎం.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు





