ప్రజా సమస్యలు మరిచి.. దేవుళ్ల చుట్టూ రాజకీయాలు !

“బీజేపీ దేశ రాజకీయాల్లో మతాన్ని ప్రధాన సాధనంగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ చాలా కాలంగా విమర్శిస్తోంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులే దేవుళ్లను పార్టీ రాజకీయాలతో అనుసంధానిస్తే తమ లౌకిక రాజకీయ స్థానం ఏమిటన్న ప్రశ్న తప్పదు. బీజేపీ మత రాజకీయాలకు ప్రతిస్పందన పేరుతో కాంగ్రెస్ కూడా అదే భాషను ఉపయోగిస్తే చివరకు రాజకీయ చర్చ ప్రజల సమస్యల నుంచి మరింత దూరమవుతుంది.రాముడు ఏ పార్టీకి చెందినవాడు కాదు. శివుడు ఏ ప్రాంతానికి చెందిన దేవుడు కాదు. రావణుడిని కూడా ఎన్నికల రాజకీయాల ప్రతీకగా మార్చడం అవసరం లేదు. ప్రజల వ్యక్తిగత విశ్వాసాలను పార్టీ గుర్తులతో కట్టిపడేయడం ప్రజాస్వామ్యాన్ని బలపరచదు. భారత రాజ్యాంగం పౌరుడిని అతని మతంతో కాదు, సమాన హక్కులతో చూస్తుంది..”

దేశ రాజకీయాలు ప్రజల జీవితాల నుంచి క్రమంగా దూరమవుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. అధికారంలో ఉన్నవారి ప్రధాన లక్ష్యం కుర్చీని కాపాడుకోవడం, ప్రతిపక్షాల లక్ష్యం ఆ కుర్చీని దక్కించుకోవడం అన్నట్లుగా రాజకీయ పోటీ మారుతోంది. కానీ ఆ కుర్చీలో కూర్చోబెట్టేది ప్రజలేనన్న ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం మాత్రం రాజకీయ పార్టీల ప్రవర్తనలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను గౌరవించకుండా వ్యవహరించడం, ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని గళమెత్తడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ప్రాంతీయ పార్టీలు అయినా—అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో భాష మాట్లాడుతున్నాయన్న విమర్శ చాలా కాలంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు; విభిన్న అభిప్రాయాలను గౌరవించడం, సంస్థల స్వతంత్రతను కాపాడటం, ప్రజలను పాలనలో భాగస్వాములను చేయడం కూడా.

అయితే ప్రస్తుతం దేశ రాజకీయ చర్చల్లో ప్రజల నిజమైన సమస్యలు వెనుకబడుతున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, వ్యవసాయ సంక్షోభం, పోషకాహార లోపం, విద్య–వైద్యం, మహిళా సాధికారత, మానవ హక్కులు, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపై నిరంతర రాజకీయ చర్చ కనిపించడం లేదు. వీటికి బదులు అధికార పార్టీని ఎలా ఇరుకున పెట్టాలి, ప్రతిపక్షాన్ని ఎలా బలహీనపరచాలి, రాజకీయ కథనాన్ని ఎవరు ఆక్రమించాలి అన్నదే ప్రధాన ఎజెండాగా మారుతోంది. ఇక్కడే కూటమి రాజకీయాల పరిమితి కూడా బయటపడుతోంది. ఎన్డీయేకు ప్రత్యామ్నాయం ఇండీ  కూటమి, ఇండీ  కూటమికి ప్రత్యామ్నాయం ఎన్డీయే అన్నట్లుగా రాజకీయ వేదికను రెండు ధ్రువాలకు పరిమితం చేసే పరిస్థితి ఏర్పడితే కొత్త రాజకీయ శక్తులకు స్థలం తగ్గిపోతుంది. ప్రజలు కూడా తప్పనిసరిగా ఏదో ఒక కూటమి వైపు వెళ్లాల్సిందే అన్న భావన ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు. కొత్త ఆలోచనలు, యువత ఆధారిత ఉద్యమాలు, స్వతంత్ర రాజకీయ వేదికలు ఎదగడం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది.

ఇటీవలి దిల్లీ పరిణామాలు ఈ ప్రశ్నను మరింత స్పష్టంగా ముందుకు తెచ్చాయి. ‘సర్ ‘  ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండీ  కూటమి దిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉంటే ప్రతిపక్షం ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కే. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలు కూడా ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి.

అయితే రాజకీయ నిరసనకు రూపం ఎలా ఉండాలి అన్న ప్రశ్న కూడా అంతే ముఖ్యం. సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించడం, న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్లుగా కనిపించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇండీ  కూటమి తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. న్యాయస్థానం తలుపులు పౌరులకు తెరిచి ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్న నేపథ్యంలో, రాజ్యాంగ సమస్యకు రాజ్యాంగబద్ధమైన న్యాయ మార్గాలను వినియోగించుకోవడం మరింత సముచితమన్న అభిప్రాయం సహజమే. అంటే నిరసన చేయకూడదని కాదు. నిరసన ప్రజాస్వామ్యానికి ప్రాణం. కానీ నిరసన రాజ్యాంగ సంస్థల పట్ల ప్రజల విశ్వాసాన్ని బలహీనపరచకుండా, వాటిని మరింత జవాబుదారిగా మార్చే దిశగా ఉండాలి. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించవచ్చు; కోర్టులో సవాలు చేయవచ్చు; ప్రజల్లో చర్చకు తీసుకెళ్లవచ్చు. కానీ ప్రతి సంస్థను రాజకీయ యుద్ధభూమిగా మార్చితే చివరకు నష్టపోయేది ప్రజాస్వామ్యమే.

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరో రకమైన రాజకీయ చర్చకు దారితీశాయి. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాముడు, శివుడు, ఆర్య–ద్రావిడ భావనలను రాజకీయ సందర్భంలో ప్రస్తావించడం వివాదాస్పదమైంది. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా, ఉత్తర–దక్షిణ భారత రాజకీయ విభజనతో అనుసంధానిస్తూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. మత విశ్వాసాలను రాజకీయ వర్గీకరణకు ఉపయోగించడం వల్ల లౌకిక రాజకీయాల స్వరూపంపైనే ప్రశ్నలు వస్తాయి.

బీజేపీ దేశ రాజకీయాల్లో మతాన్ని ప్రధాన రాజకీయ  ఉపయోగిస్తోందని కాంగ్రెస్ చాలా కాలంగా విమర్శిస్తోంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులే దేవుళ్లను పార్టీ రాజకీయాలతో అనుసంధానిస్తే తమ లౌకిక రాజకీయ స్థానం ఏమిటన్న ప్రశ్న తప్పదు. బీజేపీ మత రాజకీయాలకు ప్రతిస్పందన పేరుతో కాంగ్రెస్ కూడా అదే భాషను ఉపయోగిస్తే చివరకు రాజకీయ చర్చ ప్రజల సమస్యల నుంచి మరింత దూరమవుతుంది.రాముడు ఏ పార్టీకి చెందినవాడు కాదు. శివుడు ఏ ప్రాంతానికి చెందిన దేవుడు కాదు. రావణుడిని కూడా ఎన్నికల రాజకీయాల ప్రతీకగా మార్చడం అవసరం లేదు. ప్రజల వ్యక్తిగత విశ్వాసాలను పార్టీ గుర్తులతో కట్టిపడేయడం ప్రజాస్వామ్యాన్ని బలపరచదు. భారత రాజ్యాంగం పౌరుడిని అతని మతంతో కాదు, సమాన హక్కులతో చూస్తుంది.

ఇప్పుడు దేశానికి కావాల్సింది “ఎవరి దేవుడు ఎవరు?” అన్న చర్చ కాదు. “యువకుడికి ఉద్యోగం ఎక్కడ?”, “రైతుకు గిట్టుబాటు ధర ఉందా?”, “పేద కుటుంబానికి వైద్యం అందుతోందా?”, “పిల్లలకు నాణ్యమైన విద్య ఉందా?”, “ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉందా?” అన్న చర్చ. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం అధికారాన్ని తెచ్చిపెట్టవచ్చు. కానీ ప్రజల జీవితాలను మార్చేది మంచి పాలన మాత్రమే. ప్రజాస్వామ్యానికి నిజమైన బలం దేవాలయాల నుంచి కాదు—ప్రజల గడప నుంచి, వారి సమస్యల నుంచి, వారి విశ్వాసం నుంచి రావాలి.

-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *