పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : ఎరమ్రంజిల్‌లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. మంత్రి సీతక్క తమతో కలిసి బతుకమ్మ ఆడటంతో మహిళా ఇంజనీర్లు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. సంప్రదాయ దుస్తులు, రంగురంగుల పూల బతుకమ్మలతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉద్యోగ బాధ్యతల మధ్య పండుగ వేడుకల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి సీతక్కకు మహిళా ఉద్యోగులు ప్రేమతో బొట్టు పెట్టి బట్టలు పెట్టారు.
గాంధీ భవన్‌లో వేడుకలు
గాంధీభవన్‌లో జరిగిన బతుకమ్మ సంబరాలలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. బతుకమ్మ ద్వారా గిన్నిస్ ఆఫ్ బుక్ రికార్డు సాధించామ న్నారు. శాసించే స్థాయికి మహిళలు ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండగ బతుకమ్మ అని, పూర్వీకులు ఇచ్చిన  సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానాన్ని మనం కాపాడుకోవాలన్నారు. చెరువులకు పూజలు చేసి పూలతో పూజించే పండగ బతుకమ్మ అని, ఆడబిడ్డ అమ్మగారింటికి వచ్చి ఆత్మీయతను పంచుకునే పండుగ బతుకమ్మ అని చెప్పారు. దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ మహిళలు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నామన్నారు. మంత్రి సీతక్కతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు పారిజాత రెడ్డి, సీనియర్ నాయకులు సంధ్యారెడ్డి, ఇందిరా శోభన్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సచివాలయంలో..  
రాష్ట్ర సచివాలయంలో బతుకమ్మ వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా జరిగాయి. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా పూలను పూజించే గొప్ప సంప్రదాయం మన తెలంగాణలోనే ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అత్యంత కీలక పాత్ర వహించే సచివాలయ ఉద్యోగులు ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం సచివాలయ మహిళా ఉద్యోగులు, అధికారులు తమ కుటుంబ సభ్యులతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.మహిళలతో కలిసి బతకమ్మ ఆడారు. టీజీవో సంఘ ఆధ్వర్యంలోనూ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.. టీజీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *