అక్రమార్కులను హడలెత్తిస్త్తున్న హైడ్రా!

 సవాళ్లు .. ప్రతిసవాళ్లతో  మరింత హీటెక్కుతున్న బుల్డోజర్‌ పాలిటిక్స్‌

అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా పేరు చెబితేనే రాజకీయ నాయకులకు కూడా కంటివిరీద కునుకు పట్టడం లేదు. కెసిఆర్‌ హయాంలో అక్రమాలను కూల్చేస్తామని హడావిడి చేశారు. అప్పుడే ఎన్‌ కన్వెన్షన్‌, అయ్యప్ప సొసైటీలపై పడ్డారు. కానీ తరవాత ఏదో మతలబు జరిగింది. ఆగిపోయారు. ఇప్పుడు వారే అంటే కెసిఆర్‌ తనయుడు, అనుయాయులు  హైడ్రా చర్యలను కూల్చేస్తున్నారు. ఒకడు చెరువులోనే బిల్డింగ్‌ కట్టుకుంటే వదిలేయాలా అన్నది ఇప్పుడీ పెద్దమనుషులు చెప్పాలి. హైడ్రా తరహా చర్యలు తీసుకోవాలని సర్వత్రా ఇప్పుడు డిమాండ్‌ వస్తోంది. కానీ కెటిఆర్‌, ఈటెల రాజేందర్‌, లాంటి వారు మాత్రం హైడ్రాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని అనుకోవాలి.

ఇప్పటికే తెలంగాణ కేబినెట్‌ హైడ్రాకు చట్టబద్దతకల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.. మిషన్‌ మూసీ ప్రక్షాళనలో హైడ్రాకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. తాజాగా హైడ్రాలో కొత్తగా 169 సిబ్బందిని కేటాయించారు. డిప్యుటేషన్‌పై వివిధ విభాగాల్లోని సిబ్బందిని హైడ్రాకు అటాచ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్‌ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు సహా సైంటిస్ట్‌, తహసీల్దార్లు, సర్వేయర్‌ ,ఫారెస్ట్‌ ఆఫీసర్‌తో హైడ్రా మరింత బలోపేతమైంది. తిరుగులేని బాణంలా దూసుకెళ్తోన్న హైడ్రా.. ఇప్పుడు మరింత బలోపేతం అవుతుంది.

చెరువులు, నాలాలపై కబ్జాల కబ్జాల తొలగింపుకు సీఎం రేవంత్‌ రెడ్డి హైడ్రాకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చారు. అయితే, ఆక్రమణలను తొలగించడం మంచిదే.. కానీ సంపన్నుల విషయంలో ఒకలా.. నిరుపేదల విషయంలా మరోలా వ్యవహరిస్తున్నారని విపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తున్నారన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా వుంటుందన్నారు. అవసరమైతే బుల్డోజర్‌కు అడ్డుగా తాము నిలబడుతా మన్నారు.

బాధితులకు న్యాయం జరిగేలా లీగల్‌ ఎయిడ్‌ అందిస్తామన్నారు. హైడ్రా ముసుగులో పేదలపై దుర్మార్గపు చర్యలను ఆపాలని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. లేదంటే ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ సర్కారు తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈటల చెప్పారు. హైడ్రా యాక్టివిటీ హద్దుల్లో ఉండాలంటున్నాయి విపక్షాలు .పర్యావరణ పరిరక్షణే లక్ష్యం.. చెరువులు, నాలాలపై కబ్జాలను తొలగించడమే మార్గం అంటూ హైడ్రాను ప్రభుత్వం మాత్రం మరింత బలోపేతం చేస్తున్నది. సవాళ్లు .. ప్రతిసవాళ్లతో బుల్డోజర్‌ పాలిటిక్స్‌ మరింతగా హీటెక్కుతున్నాయి. అయితే మంచిని మంచిగా స్వాగతించాలి. అప్పుడే విపక్ష రాజకీయాలను ప్రజలు కూడా స్వాగతిస్తారు.
   -రతన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page