రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం తో ముగిసాయి.మార్చి 11న ప్రారంభం అయిన శాసన సభ, శాసన మండలి ఉభయ సభల సమావేశాలు 11 రోజుల పాటు కొనసాగాయి . కొన్ని సందర్భాలలో ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినా సభ 12 బిల్లులు ..3 తీర్మానాలకు ఆమోదం తెలిపింది. బిఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ గురికావడం ..కొందరు సభ్యుల అభ్యంతర వ్యాఖ్యలు ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు జర్నలిస్టుల వ్యవహార శైలీ పై సభలో పరుషపదజాలం తో మాట్లాడినా సభ జరిగినంత లో హుందాగా జరిగిందనే చెప్పొచ్చు. సమావేశాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి దిల్లీ లో అధిష్టానం పెద్దలను కూడా కలిసొచ్చారు . అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇచ్చినట్లు ..ఉగాదికి విస్తరణ జరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సమావేశాల ఆఖరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై మాట్లాడుతూ పడిపోతున్న విద్యా ప్రమాణాల గురించి ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి తమ ప్రభుత్వం డ్రీం ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ..దానికి కేటాయించిన నిధుల పై మాట్లాడుతూ మంత్రి వర్గ విస్తరణ జరిగినా విద్యా శాఖ ను తను ఉంచుకోనున్నట్లు తెలిపారు . మంత్రులకు ఏ శాఖను ఎవరికీ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి విచక్షణాధికారం. విద్య. హోమ్, సాధారణ పరిపాలన, మున్సిపల్ తో పాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలను కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు . తన వద్ద ఉన్న శాఖలు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలతో పాటు విద్యాశాఖకు ఎంత సమయం కేటాయించగలరన్నది ఇక్కడ ప్రశ్న ..! విద్యా శాఖ అత్యంత సంక్లిష్టమయినది.
న్యాయ స్థానాలలో బహుశా రెవెన్యూ తరువాత విద్యా శాఖకు సంబంధించిన కేసులే ఎక్కువ. గత అనుభవాల దృష్ట్యా ..ముఖ్యమంత్రి కార్యాలయానికి పరిశీలనకు పంపిన ఫైల్ తిరిగి సెక్షన్ కు వొచ్చే సమయం పై అందరికీ అనుమానాలే ..గత ప్రభుత్వం లో నైతే కొన్ని నెలల కు కూడా ఫైల్ కు మోక్షం లభించక పోయేది ..! యువత నైపుణ్యం, విద్యా ప్రమాణాలు, క్రీడల పై ఎక్కువ సమయాన్ని , దృష్టి పెడుతున్న ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖలను మంత్రివర్గ విస్తరణలో ఇతరులకు కేటాయించి కేవలం విద్య శాఖ ను నిర్వహిస్తే ఆశించిన ఫలితాలు లభించవొచ్చు.