పాలకులారా…కృపయా ధ్యాన్‌దే !

మనదేశంలో ప్రయాణం వేళ తీవ్ర క్రమశిక్షణారాహిత్యాన్ని, దుర్భర దారిద్ర్యాన్ని కళ్లారా తిలకించాలంటే ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చూస్తే సరిపోతుంది. బెంగుళూరు నుంచి దానాపూర్ (బిహార్‌)కు సంఘమిత్ర (12295) ఎక్స్‌ప్రెస్‌ అని ఓ రైలు నిత్యం తిరుగుతూ ఉంటుంది. ఏపీ, తెలంగాణలో అనేక స్టేషన్లలో ఈ రైలు ఆగుతూ వెళ్తుంది. వస్తే టైము కంటే ముందే రావడం, లేదంటే సగం రోజు లేటుగా రావడం దీని స్టైల్‌. మన దేశంలో రైలు టైమ్‌కు రాకుంటే వార్త కాదు,  ఎప్పుడో ఓ సారి టైమ్‌కు వస్తుంది చూడండి… అది చర్చనీయాంశమైన వార్త అవుతుంది.

ఇక్కడ సంఘమిత్ర ముచ్చట ఎందుకంటే… ఈ దేశ సగటు ప్రజల జీవన ప్రమాణాలను, జీవనశైలిని దాని జనరల్‌ బోగీల్లోనే చూడాలి. రెండు రోజుల పాటు ప్రయాణించి గమ్యం చేరే ఈ రైలు… ముందు రెండు, వెనుక రెండు జనరల్‌ బోగీలను తగిలించుకొని బయలుదేరుతుంది. ఎక్కడ నిండిపోతుందో తెలియదు కానీ,  ఖమ్మం, వరంగల్‌కు వచ్చే సరికి కాలుపెట్టే సందు లేకుండా ఈ రైలులోని నాలుగు బోగీలూ కిక్కిరిసిపోతాయి. కింద వున్న సీట్లు, పైన బెర్త్‌లు, సైడ్‌ లగేజి సెల్ఫ్‌లు మొత్తం జనంతో నిండిపోతాయి. కొందరు లుంగీలు, చీరలను ఊయల్లా కట్టుకొని గాలిలో ఊగుతూ, తూగుతూ నిద్రిస్తుంటారు. మరికొందరు దారికి నిలువు, అడ్డంగా దర్జాగా పడుకొని గుర్రు కొడుతుంటారు. టాయిలెట్స్‌ దారులన్నీ ప్రయాణికులతో నిండి, కనీసం అవి ఎక్కడున్నాయో కూడా తెలియకుండా పోతాయి.  మధ్యలో ఏదైనా స్టేషన్‌లో కాస్త సందు చూసుకొని ఎవరైనా కంపార్ట్‌మెంట్‌ లోనికి వెళ్లడానికి ప్రయత్నిస్తే… డోర్స్‌ వద్ద నిల్చున్న వారు చైనా గోడల వలె అడ్డుగా కనిపిస్తారు. అంగీలు విప్పి కొందరు, దుమ్ముకొట్టుకుపోయిన దుస్తులతో మరికొందరు ఈ దేశంలోని దరిద్ర నారాయణులంతా ఇక్కడే వున్నారా.. అన్నట్టుగా దర్శనమిస్తారు. దుస్సాహసం చేసి లోనికి దూరితే.. ఇక అంతే సంగతులు. గమ్యం చేరడానికి పట్టే గంట, రెండు గంటల్లోనైనా ఆరోగ్యంగా ఇంటికి చేరగలమా.. అని భీతి కలుగుతుంది.

పాపం వాళ్లనడానికి ఏముంది..? ఉత్తర భారతం నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చే పేదలు వాళ్లు.  ఇక్కడ చేసినన్ని రోజులు పని చేసి, ఎంతో కొంత మిగుల్చుకొని కుటుంబాల చెంతకు పరుగు పరుగున వెళ్లే నిర్భాగ్యులు. పూట గడవడమే వారికి పోరాటమైనప్పుడు కట్టూబొట్టూ గురించి వారికి పట్టింపు ఎందుకుంటుంది…? శుచీశుభ్రతపై ఆలోచన ఎందుకుంటుంది…? ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి నిత్యం బతుకుదెరువు కోసం వేలాదిగా వచ్చే అభాగ్యులను చూస్తుంటే.. వృద్ధి రేట్లు, తలసరి ఆదాయాల్లో పెరుగుదల గురించి ప్రతీ బడ్జెట్‌లో పాలకులు వీనులవిందుగా వినిపించే అంకెలు ఒట్టి రంకెలేనా.. అనే డౌటనుమానం వస్తుంది.

ముంబై సబర్బన్‌ రైళ్లలోని రద్దీని మించి ఉత్తర-దక్షిణ భారతం మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లలోనూ ఇదే పరిస్థితి. జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలని వరంగల్‌కు చెందిన డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ అనే సోషల్‌ వర్కర్‌ సుదీర్ఘకాలం పోరాటం చేశారు. ప్రజలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయించారు. ఆయన పోరాటాన్ని మీడియా జాతీయ స్థాయిలో ఫోకస్‌ చేసింది. ఆర్నెల్ల క్రితం స్పందించిన రైల్వే శాఖ పలు రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచుతున్నట్టు ప్రకటించింది.  కానీ ఎలాంటి మార్పు, ప్రభావం ఉత్తర-దక్షిణ భారతం మధ్య తిరిగే రైళ్లలో కనిపించడం లేదు.  ఒక‌వేళ పెంచినా అవి ఏ మూల‌కు స‌రిపోతాయో ఎవ‌రూ చెప్ప‌లేరు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 బ‌డ్జెట్‌లో రైల్వేకు రూ.2.65 ల‌క్ష‌ల కోట్ల‌ను కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ‌, హైస్పీడ్ రైళ్లు, నూతన రైల్వే లైన్లు, ప్రస్తుత రైల్వే లైన్ల విస్తరణ ఇలా అనేక అంశాల‌కు బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అమృత్‌భారత్ స్కీమ్ కింద రైల్వే స్టేష‌న్ల‌ను ఎయిర్‌పోర్టుల్లా  తీర్చిదిద్దుతున్నట్టు చెప్పుకున్నారు.  అయితే, బ‌డ్జెట్ అంతా సంపన్న గుబాళింపే కానీ,  పేద వర్గాల ప్ర‌యాణికుల‌ను దృష్టిలో పెట్టుకున్న దాఖ‌లాలే లేవు. ర‌ద్దీకి త‌గిన రీతిలో జ‌న‌ర‌ల్‌ బోగీల సంఖ్య పెంపు, పేద‌ల అవ‌స‌రాల‌ను తీర్చే నూత‌న రైళ్ల ఏర్పాటు వంటి గ‌రీబ్ విజ‌న్ లేనేలేదు. వాస్త‌వానికి మ‌న దేశంలో అత్యంత చ‌వ‌కైన ర‌వాణా రంగం రైల్వేనే. ఇది పేద వ‌ర్గాల వారికి వ‌రం. దేశ‌వ్యాప్తంగా రోజూ రెండున్న‌ర కోట్ల మంది రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ప్యాసింజ‌ర్లు, స‌రుకుల ర‌వాణా ద్వారా రైల్వేకు రోజూ రూ.400 కోట్ల ఆదాయం ఒనగూరుతుంది. దేశ ఆర్థిక వృద్ధిలో రైల్వే రంగం పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది.

జ‌న‌ర‌ల్ బోగీల్లో, స్లీప‌ర్ క్లాసుల్లో నిత్యం క‌ళ్ల‌కు క‌ట్టే ప్ర‌యాణికుల‌ యుద్ధాలు, రైల్వే స్టేష‌న్ల‌లో త‌రుచూ చోటుచేసుకొనే తొక్కిస‌లాట‌లు, ప్లాట్‌ఫామ్స్‌పై అర‌కొర వ‌స‌తుల‌తో అల్లాడే ప్ర‌యాణికులు… ఈ దేశ రైల్వే రంగ డొల్ల‌త‌నానికి ప్ర‌తీక‌లుగా క‌నిపిస్తాయి.  రైల్వే జీఎంలు, బోర్డు చైర్మ‌న్లు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఫ‌స్ట్‌ క్లాస్ కంపార్ట్‌మెంట్ల‌లో ప్ర‌యాణించి రైళ్ల‌న్నీ ఇలాగే ఉంటాయ‌ని భ్ర‌మిస్తారు కాబోలు. ఒక్క‌సారి వారు సాధార‌ణ ప్ర‌యాణికుల్లా సంఘ‌మిత్ర వంటి జ‌న‌ర‌ల్ బోగీల్లో ప్ర‌యాణిస్తే నిజం ఏమిటో, రైళ్లలోని భ‌యాన‌క పరిస్థితులు ఏమిటో, సాధార‌ణ ప్ర‌యాణికుల అవ‌స్థ‌లేమిటో  అనుభ‌వంలోకి వ‌స్తాయి.

అమృతభారత కింద వేల కోట్ల వ్యయంతో దేశంలోని 1309 రైల్వే స్టేషన్లను సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తోంది మోదీ సర్కారు. మొన్నటిదాకా కంపుకొట్టే రైల్వే స్టేషన్లు- ఈ మధ్య కాలంలో నయాలుక్‌తో ఔరా.. అని అనిపిస్తున్నాయి. జనరల్‌ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారి కోసం కూడా ఫ్రీ వెయిటింగ్‌ రూమ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఉచిత వైఫైతో ప్రపంచాన్ని ప్రయాణికుల చేతిలోకి చేర్చుతున్నారు.   ప్యాసింజర్లను కస్టమర్లుగా మార్చే ప్రయత్నంలో రైల్వే స్టేషన్లలో షాపింగ్‌స్టోర్స్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధునాతన ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, భారీ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ప్రయాణికుల శారీరక శ్రమను తగ్గిస్తున్నాయి.  వందేభారత్‌ రైళ్లు, అమృతభారత్‌ రైళ్లు దూరాన్ని రోజుల నుంచి గంటల్లోకి కుదించాయి. కానీ సగటు పేదల ప్రయాణాన్ని సుఖవంతం చేయకుండా.. ‘ఇవన్నీ బాగానే వున్నాయి..’ అని ఎలా అనగలం…? రైల్వే ద్వారా రోజుకు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న పాలకులారా… కృపయా ధ్యాన్‌సే!
image.png
-శంకర్‌రావు శెంకేసి,
సీనియర్ జర్నలిస్ట్ (79898 76088)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page