- మారని భూస్వామ్య పక్షపాతం
- గరిష్ట పరిమితి లేకుండా కుమ్మరింతలు
- కౌలురైతులకు మొండి చేయి
- కూలీలకు అందని ‛ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి సహాయం అనేది రైతులకు కేవలం ఒక ఆర్థిక ఊరట మాత్రమే కాదు. అది రాష్ట్ర రాజకీయ గమనాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రారంభమైన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10,000, రెండు విడతలలో రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి సహాయంగా అందించేవారు. ఆ తదనంతరం జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తన ‘ఆరు గ్యారంటీలలో’ భాగంగా ఈ సహాయాన్ని ‘రైతు భరోసా’ పేరిట సంవత్సరానికి ఎకరానికి రూ. 15,000లకు పెంచుతామని, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా దీనిని వర్తింపజేస్తామని ఉరుములాంటి హామీ ఇచ్చింది.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 జనవరి 26న అధికారికంగా ప్రారంభించినప్పటికీ, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.15,000 ఇవ్వకుండా, ప్రస్తుతానికి ఎకరానికి రూ.12,000, సీజన్‌కు రూ.6,000 చొప్పున మాత్రమే అందిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం రైతాంగంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఆర్థిక వనరుల కొరత, పరిమితుల కారణంగా తొలుత రూ.12,000లతో ప్రారంభిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని రూ.15,000లకు పెంచుతామని ప్రభుత్వ ప్రతినిధులు సమర్థించుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక, విధానపరమైన వైరుధ్యాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. కేవలం పేర్లు మార్చడం, నిధుల మొత్తాన్ని స్వల్పంగా పెంచడం మినహా, గత ప్రభుత్వ భూస్వామ్య అనుకూల విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2024, 11వ వ్యవసాయ గణన (2021-22) ఆధారంగా రాష్ట్రంలోని భూకమతాల పంపిణీ సరళిని గమనిస్తే అసమానతల తీవ్రత స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో అత్యధిక శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నప్పటికీ, ప్రభుత్వ పెట్టుబడి సహాయంలో సింహభాగం మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్న పెద్ద భూస్వాములకే చేరుతున్నది. రాష్ట్రంలో 91.4 శాతం మంది ఉన్న సన్న, చిన్నకారు రైతులు కేవలం 68.2 శాతం సాగుభూమిని మాత్రమే కలిగి ఉన్నారు. మిగిలిన సుమారు 8.6 శాతం మంది ఉన్న మధ్యస్థ, పెద్ద భూస్వాముల ఆధీనంలో ఏకంగా 31.8 శాతం సాగుభూమి కేంద్రీకృతమై ఉన్నది. రైతు భరోసా పథకం కింద ఎకరాల పరిమితి ఏదీ లేకపోవడంతో, ప్రభుత్వ ఆర్థిక సహాయంలో అత్యధిక భాగం ఈ పెద్ద భూస్వాముల ఖాతాల్లోకే చేరుతున్నది. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించాల్సిన సంక్షేమ పథకాలు, ఈ రకమైన పరిమితి లేని పంపిణీ వల్ల అసమానతలను మరింత పెంచే సాధనాలుగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగంలో కౌలు రైతులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయని కౌలు రైతు సంఘాల క్షేత్రస్థాయి సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి సాగు చేసి, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయేది కౌలు రైతులే అయినప్పటికీ, వారికి ప్రభుత్వ పెట్టుబడి సహాయం దక్కడం లేదు. ఎన్నికల ప్రచారంలో కౌలు రైతులకు కూడా ఎకరాకు రూ.15,000 అందిస్తామని కాంగ్రెస్ గట్టిగా హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత రైతు భరోసా విధివిధానాలు కౌలు రైతులను పూర్తిగా పథకానికి దూరం చేసేలా ఉన్నాయి.
మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
పెట్టుబడి సాయంలో సీలింగ్ ఉత్తదేనా?
ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీ సాగు పెట్టుబడి సాయానికి ఐదు లేదా పది ఎకరాల గరిష్ట పరిమితి (సీలింగ్) విధిస్తామని సంకేతాలిచ్చింది. వ్యవసాయం చేయని కోటీశ్వరులకు, ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికి, కేవలం భూస్వాములుగా చలామణీ అయ్యేవారికి ఈ నిధులను నిలిపివేయడం ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని కేబినెట్ సబ్-కమిటీ చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. సాగు యోగ్యం కాని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లను మినహాయించేందుకు కఠినమైన మార్గదర్శకాలు తెచ్చినప్పటికీ, ఎకరాల గరిష్ట పరిమితిపై మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఆచరణలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎకరాల సీలింగ్ ఏమీ లేకుండానే సాగులో ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా వర్తింపజేస్తున్నారు. వానకాలం 2026 సీజన్ రైతు భరోసా పంపిణీ దశలను పరిశీలిస్తే, ప్రభుత్వం పెద్ద భూస్వాములను కూడా ఎంత పకడ్బందీగా ఆదుకుందో అర్థమవుతున్నది.
తొలి విడత (జూన్ 30, 2026) 1 నుంచి 2 ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు పంపిణీ చేశారు. దశలవారీగా (5 రోజుల్లో) 6 ఎకరాల లోపు భూమి ఉన్న 67.44 లక్షల మంది రైతులకు రూ.7,135.77 కోట్లు పంపిణీ చేశారు. 7వ విడత (జూలై 7, 2026) 7 నుంచి 8 ఎకరాల లోపు భూమి ఉన్న 58,831 మంది రైతులకు రూ.259.73 కోట్లు పంపిణీ చేశారు. తుది విడత (జూలై 10, 2026) 9 నుంచి 54 ఎకరాల లోపు భూమి ఉన్న భూస్వాములకు రూ.1,009 కోట్లు పంపిణీ చేశారు. మొత్తం 1.45 కోట్ల ఎకరాల సాగుభూమికి, 74.00 లక్షల మంది రైతులకు రూ.8,759 కోట్లు అందాయి. ఈ పంపిణీ సరళి ద్వారా 50 ఎకరాలు ఉన్న ఒక పెద్ద భూస్వామి ఖాతాలోకి కేవలం ఒక సీజన్‌కే రూ.3,00,000, ఏడాదికి రూ.6,00,000 ప్రభుత్వ సహాయం చేరుతుండగా, అర ఎకరం ఉన్న సన్నకారు రైతుకు ఏడాదికి కేవలం రూ.6,000 మాత్రమే లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు తరహాలోనే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీలింగ్ విధించకుండా పెద్ద దొరలు, వ్యాపారవేత్తలు, భూస్వాముల జేబులు నింపడానికే ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టమవుతున్నది.
‘సాగు’ చేసే కౌలురైతులకు శూన్యం.. ‘సైన్’ చేసేవాళ్లకు స్వర్గం
తెలంగాణ వ్యవసాయ రంగంలో కౌలు రైతులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయని కౌలు రైతు సంఘాల క్షేత్రస్థాయి సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి సాగు చేసి, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయేది కౌలు రైతులే అయినప్పటికీ, వారికి ప్రభుత్వ పెట్టుబడి సహాయం దక్కడం లేదు. ఎన్నికల ప్రచారంలో కౌలు రైతులకు కూడా ఎకరాకు రూ.15,000 అందిస్తామని కాంగ్రెస్ గట్టిగా హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత రైతు భరోసా విధివిధానాలు కౌలు రైతులను పూర్తిగా పథకానికి దూరం చేసేలా ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కౌలు రైతుకు సహాయం అందాలంటే భూయజమానితో కుదుర్చుకున్న రాతపూర్వక లీజు ఒప్పందం సమర్పించాలి. కానీ, తెలంగాణాలో 90 శాతానికి పైగా కౌలు ఒప్పందాలు కేవలం నోటిమాటపైనే నడుస్తాయి.
రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేస్తే భవిష్యత్తులో భూమిపై తమ హక్కులకు భంగం వాటిల్లుతుందనే భయంతో భూయజమానులు సంతకాలు చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. ఫలితంగా నిజమైన సాగుదారుడైన కౌలు రైతు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తెచ్చి సాగు చేస్తుంటే, ప్రభుత్వ సాగు సాయం రూ.12,000, సన్న ధాన్యానికి అందించే బోనస్ నిధులు కూడా భూయజమానుల ఖాతాల్లోకే చేరుతున్నాయి. “కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ” జరిపిన తాజా సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రతి ముగ్గురిలో ఒకరు కౌలు రైతే ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు (ఎల్ఈసీ/సీసిఆర్), బ్యాంకు రుణాలు, విపత్తు నష్టపరిహారం అందడం లేదు. ఈ విధంగా అసలైన సాగుదారుడిని వదిలేసి, కేవలం భూమి పత్రాలు ఉన్న యజమానికే మళ్లీ మళ్లీ లబ్ధి చేకూర్చడం వ్యవసాయ సంక్షేమ స్ఫూర్తికే విరుద్ధం.
కూలీల ఆశలపై నీళ్లు
భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏడాదికి అందిస్తామన్న రూ.12,000 ఆర్థిక సహాయం కూడా తీవ్రమైన ఆంక్షల ఉచ్చులో చిక్కుకున్నది. ఈ పథకానికి అర్హులు కావాలంటే సదరు కుటుంబానికి ధరణి/భూభారతి రికార్డుల్లో ఎలాంటి భూమి ఉండకూడదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజులు కూలి పనులు చేసి ఉండాలనే కఠిన నిబంధన పెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పథకానికి దాదాపు 10 లక్షల మంది కూలీలు అర్హులవుతారని తేలింది. కానీ ఆచరణలో ఈ పథకం అమలు అత్యంత దయనీయంగా ఉన్నది. కేవలం కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి, ఇప్పటివరకు కేవలం 83,887 మందికి మాత్రమే తొలి విడతగా రూ.6,000 చొప్పున పంపిణీ చేశారు.
మిగిలిన 9 లక్షలకు పైగా నిరుపేద కుటుంబాలు నేటికీ పథకం ఎప్పుడు వర్తిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. పథకం కోసం కొత్తగా వచ్చిన 2,24,487 దరఖాస్తులలో అధికారులు కేవలం 19,193 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి, ఏకంగా 1,44,784 అప్లికేషన్లను వివిధ సాంకేతిక కారణాల సాకుతో తిరస్కరించారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా కొత్త ఉపాధి హామీ జాబ్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల, కొత్తగా పెండ్లి అయిన నిరుపేద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన కూలీలు ఈ సాయాన్ని పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విధంగా ఆర్భాటపు ప్రచారాలతో ప్రారంభించిన ఈ పథకం క్షేత్రస్థాయిలో ఆంక్షల పంజరంలో చిక్కుకొని కూలీల ఆశలపై నీళ్లు చల్లింది.
వివాదాల వలయంలో సరిహద్దుల మార్పిడి
గత ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్ తెచ్చిన వివాదాలు, రికార్డుల తప్పుల వల్ల లక్షలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఈ లోపాలను సరిదిద్దుతామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ‘తెలంగాణ భూభారతి (భూమి హక్కుల రికార్డు) చట్టం 2025’ ద్వారా ధరణి స్థానంలో నూతనంగా ‘భూభారతి’ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ మార్పిడి వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. ధరణిలో ఉన్న తప్పులనే యథాతథంగా భూభారతి పోర్టల్‌లోకి మైగ్రేట్ చేయడం వల్ల పాత వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. సరిహద్దు వివాదాలు, తప్పుడు సర్వే నంబర్లు, నిషేధిత జాబితా వంటి సమస్యలతో సతమతమవుతున్న రైతుల భూములను “సాగు యోగ్యం కానివిగా” వర్గీకరించి రైతు భరోసాను నిలిపివేస్తున్నారు. దీనిపై భూయజమానులు, విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పైగా భూభారతి, ధరణి పోర్టళ్లలో భారీ భద్రతా లోపాలు ఉన్నట్టు, అక్రమ శక్తులు అనధికారికంగా డేటాను సవరించినట్టు ఇటీవల జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారణ అయ్యింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు, బాధ్యులను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని నియమించాల్సి వచ్చింది. ఈ రకమైన సాంకేతిక లోపాలు, సరిహద్దు వివాదాల నడుమ నిజమైన రైతులు తమ హక్కులను నిరూపించుకోలేక పంట పెట్టుబడి సాయానికి దూరమవుతున్నారు.
ముసుగు తొలగినా దోపిడీ ఆగట్లే
తెలంగాణలో ప్రభుత్వం మారినా, పథకాల పేర్లు మార్చినా వ్యవసాయ రంగంలో గల ప్రాథమిక భూస్వామ్య పక్షపాతం మాత్రం మారలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరిట ధనవంతుల ఖాతాల్లో వేల కోట్లు కుమ్మరిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో ‘రైతు భరోసా’ పేరిట 54 ఎకరాల వరకు గల పెద్ద భూస్వాములకు నిధులు జమ చేస్తూ తన వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటున్నది. నిజంగా ఎండనక వాననక కష్టపడి పంటలు పండించే కౌలు రైతులను, రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద వ్యవసాయ కూలీలను కేవలం నిబంధనల సాకుతో పథకాలకు దూరం చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల సామాజిక బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
తెలంగాణ వ్యవసాయ రంగం నిజంగా బలోపేతం కావాలంటే పెట్టుబడి సహాయానికి కఠినమైన ఎకరాల పరిమితి (సీలింగ్) విధించి, ఆదా అయిన నిధులను నేరుగా కౌలు రైతులకు అందేలా చట్టపరమైన రక్షణలు కల్పించాలి. లేనిపక్షంలో ఈ పథకాలు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే రూపొందించిన ఎరలుగా మిగిలిపోతాయి.


మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి


