గిరిజ‌న ప్రాంతాల గ‌నుల‌ను సింగ‌రేణికి కేటాయించాలి!

తెలంగాణ ఆర్థిక, ఇంధన రంగానికి జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ (ఎస్‌సీసీఎల్) చుట్టూ రాజకీయం మరోసారి హీటెక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఈ వివాదానికి మూలకారణం. కేంద్రం వేలం లేకుండా నేరుగా సింగరేణికే కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించగా, ఇది దశాబ్ద కాలం క్రితం నాటి కాంగ్రెస్ హయాం కేటాయింపు అని, కేంద్రం వాస్తవాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సింగరేణి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను స్వయంగా దిల్లీ వెళ్లి ఒత్తిడి తీసుకురావడం వల్లే ఎట్టకేలకు ఈ మైనింగ్ లీజు అనుమతులు వొచ్చాయని, కానీ కేంద్రం మాత్రం క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం సరికాదని భట్టి విక్రమార్క విమర్శించారు. దీనికి బీజేపీ రాష్ట్ర యూనిట్ గట్టి కౌంటర్ ఇచ్చింది. గతంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ (యూపీఏ) ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బ్లాక్‌ను సింగరేణికి పూర్తిగా ఎందుకు కేటాయించలేకపోయారో కాంగ్రెస్ చెప్పాలని బీజేపీ నేత ఎన్. రాంచందర్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలోనే సింగరేణి నష్టాల్లోకి వెళ్ళిందని, మోదీ ప్రభుత్వమే వేలం భారం (రూ. 2,550 కోట్లు) లేకుండా ఈ గనిని రక్షించిందని బీజేపీ వాదిస్తోంది.


ఈ వివాదంలో ఇరు పక్షాలు చెబుతున్న బొగ్గు నిల్వల గణాంకాలపై భిన్నమైన లెక్కలు వినిపిస్తున్నాయి. ఈ గనిలో సుమారు 182 మిలియన్ టన్నుల ఆపరేషనల్ బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీని ద్వారా ఏడాదికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రూ. 64,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని కిష‌న్‌రెడ్డి చెబుతున్నారు. భూగర్భంలో మొత్తం 434.14 మిలియన్ టన్నుల అపార బొగ్గు నిల్వలు  ఉన్నాయి. కాబట్టి ఏటా 10 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేసి, సింగరేణి 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడానికి ఇది దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీలు, పన్నుల రూపంలో సుమారు రూ. 16,000 కోట్ల ఆదాయం సమకూరుతుంద‌నేది ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెబుతున్నారు. దీన్ని ఎవ‌రు సాధించార‌న్న వివాదం ఒక కొలిక్కి వొచ్చింద‌నుకున్న‌ప్ప‌టికీ ఇదిలాఉండగా  గిరిజన ప్రాంతాల్లోని మిగిలిన గనుల సమస్యను కూడా ప‌రిష్క‌రించాల్సి ఉంది .


గ‌తంలో కోయగూడెం-3, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్-3  గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఈ గనులను దక్కించుకున్న ప్రైవేట్ కంపెనీలు ఇప్ప‌టివ‌ర‌కు ప‌నులు ప్రారంభించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఈ గనులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు నేరుగా కేటాయించే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.  ఇతర ప్రైవేట్ సంస్థలు ఆఫర్ చేసిన రెవెన్యూ వాటా  కంటే 0.5% ఎక్కువ చెల్లించడానికి సింగరేణి సిద్ధంగా ఉందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. అయితే, ప్రస్తుత చట్టాలు మరియు నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ కాకుండా నేరుగా  సింగరేణికి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది.
కోయగూడెం-3, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్-3  గనులను ప్రైవేట్ సంస్థలకు వేలం వేయడం గిరిజన ల్యాండ్ రెగ్యులేషన్స్ (1/70 చట్టం) ఉల్లంఘనేనని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఈ వేలంపాటలను రద్దు చేసి, సింగరేణికే ఇవ్వాలనే డిమాండ్ ఇప్ప‌టికే వినిపిస్తోంది.  కేంద్రం ఈ గనులను ప్రైవేటీకరించాలని చూస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విధానాలను ఒకవైపు వ్యతిరేకిస్తూనే మరోవైపు టెండర్లను పిలుస్తోంద‌ని కమ్యూనిస్ట్ పార్టీలు (సీపీఐ, సీపీఐ-ఎం) విమర్శిస్తున్నాయి. కొయ్యగూడెం-3, సత్తుపల్లి-3 గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ… ఈ గనులను వెంటనే సింగరేణికి అప్పగించాలని ప్రతిపక్ష నాయకుడు కె.టి. రామారావు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు పనులు చేపట్టకపోవడం మరియు సింగరేణికి బదిలీ కాకపోవడంతో ఈ రెండు మైనింగ్ బ్లాకులు ప్రస్తుతం నిలిచిపోయి ఉన్నాయి.

నిబంధనల ప్రకారం, ఈ గనుల కోసం కేంద్రం భవిష్యత్తులో మరోసారి వాణిజ్య బొగ్గు గనుల వేలం  నిర్వహించే అవకాశం ఉంది. నిజానికి ఈ రెండు బ్లాకుల్లో బొగ్గు లభ్యతపై అన్వేషణ  కోసం సింగరేణి సంస్థ గతంలోనే కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది. బొగ్గు గ‌నుల‌పై రాజ‌కీయాన్ని ప‌క్క‌న పెడితే శతాబ్ద కాలపు చరిత్ర ఉన్న సింగరేణి మనుగడకు మరిన్ని బొగ్గు బ్లాకులు అవసరం. కేంద్రం వాణిజ్య వేలం  పద్ధతిని పక్కన పెట్టి, గిరిజన హక్కులను గౌరవిస్తూ, తెలంగాణ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని గోదావరి లోయలోని మిగిలిన గనులను కూడా సింగరేణికే కేటాయించినప్పుడే ఉభయ ప్రభుత్వాల చిత్తశుద్ధి నిరూపితమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *