గణేశ్‌ ఉత్సవాలకు ప‌టిష్ట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు

– మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తం
– 14 నుంచి ఉత్సవాలు.. 25న నిమజ్జనం
– విద్యుత్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, జనసమూహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
– డీజీపీ ఆనంద్‌

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు  7 : గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ఎస్‌ఐలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సెప్టెంబరు 14న ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 25న గణేశ్‌ విగ్రహాల నిమజ్జనంతో ముగియనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
గణేశ్‌ మండపాల వివరాలను సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చినట్లు డీజీపీ తెలిపారు. మండపం ఉన్న ప్రదేశం, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, నిమజ్జనానికి వినియోగించే వాహనాల వివరాలను అందులో నమోదు చేయాలి. ఎస్‌హెచ్‌వోలకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చినందున మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సీపీలు, డీసీపీలు, ఎస్పీలు మండపాలను సందర్శించి పాయింట్‌ బుక్స్‌లో పరిశీలన వివరాలు నమోదు చేయాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్తు, ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఆదేశించారు. విద్యుత్తు, అగ్నిమాపక తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలి. మండపాల వద్ద నిర్వాహకులు స్వచ్ఛంద కార్యకర్తలను ఏర్పాటు చేసుకునేలా చూడడంతోపాటు సీసీ కెమెరాలు, క్యూల నిర్వహణకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి మార్గాలు, రహదారులు, వంతెనలను ముందుగానే గుర్తించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించాలని డీజీపీ సూచించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలి. భద్రతా చర్యల్లో భాగంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లను అవసరమైన చోట వినియోగించాలని ఆదేశించారు. మండపాల ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేసి భద్రతా ఏర్పాట్ల వివరాలను నమోదు చేయాలని డీజీపీ సూచించారు. జియో ట్యాగింగ్‌, తనిఖీల వివరాలను టీజీ-కాప్‌ ప్లాట్‌ఫాంలోనూ అప్‌లోడ్‌ చేయాల న్నారు. గణేశ్‌ ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను ముందుగానే పరిష్కరించాలని డీజీపీ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా బ్రీఫింగ్‌ నిర్వహించాలి. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై తక్షణమే స్పందించాలని సూచించారు. అన్ని శాఖలు, ఉత్సవ కమిటీలు, ప్రజల సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. సమావేశంలో డీజీ టెక్నికల్‌ సర్వీసెస్‌ వి.వి.శ్రీనివాసరావు, ఐజీ ఇంటెలిజెన్స్‌ కార్తికేయ, ఐజీ మల్టిజోన్‌-1 చంద్రశేఖర్‌రెడ్డి, టీస్పార్క్‌ ఎస్పీ రూపేష్‌, ఏఐజీ రమణకుమార్‌, హైదరాబాద్‌ డీసీపీ అవినాష్‌కుమార్‌, డీసీపీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *