– ఆటో చార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలం
– ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు నడిపే ప్రసక్తే లేదు
– ఓలా, ఉబెర్ తరహాలో ప్రత్యేక యాప్ కోసం ఐటీ శాఖతో సంప్రదింపులు
– 18,700 ఆటోల రెట్రోఫిట్మెంట్‌కు ఒక్కో ఆటోకు రూ. 1.50 లక్షల సాయం-
– మంత్రులు ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి తెలిపారు. ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత నెల 23న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. వైట్ ప్లేట్ వాహనాలు, బైక్ టాక్సీల వినియోగంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రవాణా శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని, దీనికి కార్మిక సంఘాలు సహకరించాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కార్మిక శాఖతో కలిసి ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి శాసనసభలో బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ పాలసీ తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదన్నారు.
ఆటో చార్జీల పెంపునకు సానుకూలం
2012 తర్వాత ఆటో చార్జీలను పెంచలేదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం చెప్పారు. అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా త్వరలోనే చార్జీల పెంపును అమలు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రత్యేక యాప్ రూపొందించే అంశంపై ఐటీ శాఖ మంత్రికి లేఖ రాశామని చెప్పారు.
పెండింగ్ పర్మిట్లకు పరిష్కారం
జీఓ నం.263 కింద తిరస్కరించిన కేసులు, గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన ఆటో రిక్షా పర్మిట్ కోటాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్న వారికి ఆటో నడిపే విషయంలో ఉన్న నిబంధనలను సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
18,700 ఆటోలకు ఆర్థిక సాయం
నగరంలో డీజిల్, పెట్రోల్ ఆటోలను పర్యావరణహితంగా మార్చేందుకు (రెట్రోఫిట్మెంట్) సుమారు 18,700 ఆటోలకు ఒక్కో దానికి రూ. 1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామని, ఇందుకోసం సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఆటో డ్రైవర్లతోపాటు ఇతర వర్గాలకు కూడా భరోసా కల్పించేలా ప్రమాద, సహజ మరణ బీమా సదుపాయం కోసం ఇందిరమ్మ ప్రత్యేక బీమా పాలసీ తెచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణ, పోలీసు, ట్రాఫిక్ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





నా వ్యాఖ్యలు స్పీకర్ను ఉద్దేశించి చేసినవి కావు